logo

జీవో ఇచ్చారు..నిధులు మరిచారు!

మూడేళ్ల కిందట తిత్లీ తుపాను సృష్టించిన భీతావహ దృశ్యమిది. సోంపేట మండలం గొల్లగండి గ్రామంలో ఓ రైతుకు చెందిన ఎకరం తోటలో 55 చెట్లు నేలకూలాయి. దీంతో రైతు ఏడాదికి రూ.లక్ష ఆదాయం కోల్పోయాడు. కొత్తగా మొక్కలు పెట్టి అవి కాపునకు వచ్చే సరికి కనీసం మరో ఐదేళ్లు.

Published : 18 Jan 2022 06:20 IST

న్యూస్‌టుడే, సోంపేట

మూడేళ్ల కిందట తిత్లీ తుపాను సృష్టించిన భీతావహ దృశ్యమిది. సోంపేట మండలం గొల్లగండి గ్రామంలో ఓ రైతుకు చెందిన ఎకరం తోటలో 55 చెట్లు నేలకూలాయి. దీంతో రైతు ఏడాదికి రూ.లక్ష ఆదాయం కోల్పోయాడు. కొత్తగా మొక్కలు పెట్టి అవి కాపునకు వచ్చే సరికి కనీసం మరో ఐదేళ్లు. ఇంతా నష్టపోతున్న రైతుకు పరిహారంగా వచ్చింది రూ.82,500. కనీసం అంతే మొత్తం అదనంగా చెల్లిస్తామన్న ప్రస్తుత ప్రభుత్వం హామీ అమల్లోకి వస్తే మరికొంత ఆసరా అయినా లభించేది. రెండేళ్లు దాటినా దానికి అతీగతీలేదు. నాయకుల మాటలు తప్ప బాధిత రైతుకు ఒరిగిందేమీ లేదు.


తాను అధికారంలోకి వస్తే తిత్లీ బాధిత రైతులకు అదనపు పరిహారం ఇస్తానని ఇప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మాట ప్రకారం కొబ్బరి, జీడి రైతులకు రెట్టింపు పరిహారం ఇచ్చేలా జీవో జారీ చేశారు. నిధులు మాత్రం సరిపడినంతా విడుదల చేయలేదు.

ఇచ్చింది రూ.98 కోట్లే...

సెప్టెంబరు 2019న విడుదల చేసి జీవోనెంబర్‌ 11 ప్రకారం కొబ్బరి చెట్టుకి రూ.1,500, జీడిపంటకు హెక్టారుకి రూ.20 వేలు అదనంగా పరిహారం అందజేయాల్సి ఉంది. ఇందుకు రూ.278 కోట్లు అవసరమని లెక్కలు వేశారు. ఇందులో కేవలం రూ.98 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చిన నిధులను ఏ ప్రాతిపదికన పంపిణీ చేయాలో తెలియక, పైనుంచి ఎలాంటి ఆదేశాలూ లేక అధికారులు మిన్నకుండిపోయారు.

తుడిచిపెట్టుకుపోయిన ఉపాధి

2018 అక్టోబరు నెలలో సంభవించిన తిత్లీ తుపాన్‌లో ఉద్దాన ప్రాంతానికి సంబంధించి ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస, సంతబొమ్మాళి మండలాల పరిధిలో కొబ్బరి, జీడితోటలు తుడిచి పెట్టుకుపోయాయి. వందేళ్ల కాలంలో వచ్చిన అతిపెద్ద తుపాన్‌ కావడంతో ఈ ప్రాంతాల్లోని ప్రతిరైతూ బాధితుడిగా మారాడు. కొబ్బరి, జీడి పంట ఆధారంగానే ఉద్దానంలో 1.5 లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. రెండు ప్రధాన పంటలు నాశనం కావడంతో ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాల పరిధిలో సాంకేతిక ఇబ్బందులు, మొదటి దఫా పరిహారమే అందనివారు 5 వేల మందికి పైగా ఉన్నారు.

ఇవీ లెక్కలు

తిత్లీలో పడిపోయిన కొబ్బరి చెట్లు 16 లక్షలకు పైగా

నష్టపోయిన జీడిచెట్లు 29 లక్షలు

బాధిత రైతు కుటుంబాలు 53 వేలు

బాధిత రైతు కుటుంబాలు 79 వేలు


కలెక్టర్‌ ద్వారా ప్రతిపాదనలు పంపాం...

- రత్నాల వరప్రసాద్‌, ఏడీ, ఉద్యాన శాఖ

పెంచిన పరిహారం మేరకు అదనపు నిధుల కోసం కలెక్టర్‌ ద్వారా ఇటీవలే మళ్లీ ప్రతిపాదనలు పంపించాం. గతంలో విడుదల చేసిన నిధులు తక్కువ కావడం, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో పంపిణీ చేయలేకపోయాం. ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిన తరువాత అదనపు సాయం అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం.


త్వరలో పంపిణీ జరిగేలా కృషి...

- పిరియా విజయసాయిరాజ్‌, ఛైర్‌పర్సన్‌, జిల్లాపరిషత్తు

తిత్లీ అదనపు పరిహారం త్వరలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో దారిమళ్లిన సాయం, అనర్హుల ఖాతాలో నిధులు జమ చేయడం లాంటి అంశాల మూలంగా అదనపు సాయం పంపిణీ ఆలస్యమైంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అర్హులైన బాధిత రైతులందరికీ పరిహారం ఇచ్చేందుకు చర్యలు చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు