logo

కాలం చేసిన గాయం!

సరదాగా పండగ చేసుకున్న ఇళ్లలో ఆ సందడి ఆవిరైపోయింది. ఊహించని ప్రమాదాలు ఆ కుటుంబసభ్యులను శోక సంద్రంలో ముంచేశాయి. సోమవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు, రైలు ఢీకొని ఒకరు... చెరువులో జారిపడి ఒకరు.. నదిలో మునిగి మరొకరు మృత్యువాత పడ్డారు.

Updated : 18 Jan 2022 06:33 IST

సరదాగా పండగ చేసుకున్న ఇళ్లలో ఆ సందడి ఆవిరైపోయింది. ఊహించని ప్రమాదాలు ఆ కుటుంబసభ్యులను శోక సంద్రంలో ముంచేశాయి. సోమవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు, రైలు ఢీకొని ఒకరు... చెరువులో జారిపడి ఒకరు.. నదిలో మునిగి మరొకరు మృత్యువాత పడ్డారు. నాగావళి నదిలో ఇటీవల గల్లంతైన ఇద్దరూ మృతిచెందారు. వీటితో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.


స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా...

భామిని గ్రామీణం, హిరమండలం, న్యూస్‌టుడే: సంక్రాంతికి అత్తారింటికి వెళ్లి సరదాగా గడిపిన అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న వ్యక్తిని మృత్యువు కాటేసింది. బత్తిలి హెచ్‌సీ ఎ.వి.రమణ వివరాల ప్రకారం.. హిరమండలానికి చెందిన కుమారస్వామి(35) సోమవారం ఉదయం బత్తిలిలోని అత్తారింటి వద్ద నుంచి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నాడు. భామిని మండలం కాట్రగడ-బి-బొమ్మికకు మధ్యన ప్రధాన అలికాం-బత్తిలి రహదారిలోని మలుపు వద్ద ఏర్పాటు చేసిన సేఫ్టీ గ్రిల్స్‌ను ఢీకొన్నాడు. దీంతో వాహనం పొలాల్లోకి వెళ్లిపోగా అతని పొట్ట, ఇతర భాగాల్లోకి గ్రిల్స్‌ చొచ్చుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తాపీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొత్తూరు సీఐ ఎస్‌.సూర్యచంద్రమౌళి సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


రైలు ప్రమాదంలో దుర్మరణం..

ఇచ్ఛాపురం, కవిటిగ్రామీణం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం-జాడిపూడి రైలు నిలయాల మధ్య రైౖలు ఢీకొనడంతో కవిటి మండలంలోని జమేదారుపుట్టుగకు చెందిన నాగలి కృష్ణారావు(34) మృతి చెందారు. రైల్వే జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కూలీగా పని చేస్తూ, భార్యాబిడ్డలను పోషించుకుంటున్న కృష్ణారావు ఆదివారం ఇంట్లో పండగ చేసుకొని, బంధుమిత్రులతో సరదాగా గడిపారు. అదేరోజు రాత్రి బహిర్భూమికని రైలు పట్టాలు దాటి వెళ్తుండగా ఎగువమార్గంలో నుంచి వచ్చిన రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పలాస రైల్వే పోలీసు హెచ్‌సీ రమేష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, శవపంచనామాకు మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని...

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: రహదారి ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు వద్ద సోమవారం జరిగింది. ఎస్‌.ఐ. రాజేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం. పెద్దపాడు గాంధీనగర్‌కాలనీ జాడపేటకు చెందిన జాడ రాంబాబు(38) విశాఖపట్నంలో తాపీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి సొంతూరుకు వచ్చాడు. పండగ జరుపుకొన్నాడు. ఈ క్రమంలో సోమవారం పెద్దపాడు వద్ద బహిర్భూమికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా నరసన్నపేట నుంచి విశాఖపట్నంవైపు వెళ్తున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


చిత్తారపురం వద్ద ఒకరు...

సంతకవిటి, బూర్జ, న్యూస్‌టుడే: నాగావళి నదిలో ఈ నెల 14న గల్లంతైన బి.భాస్కరరావు(45) మృతదేహం సంతకవిటి మండలం చిత్తారపురం గ్రామం వద్ద లభ్యమైనట్లు ఎస్‌ఐ ఆర్‌.జనార్దనరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బూర్జ మండల కేంద్రానికి చెందిన భాస్కరరావు ఖండ్యాంలో కూరగాయలు అమ్మేందుకు సైకిల్‌పై నాగావళి నది దాటుతుండగా ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


నదిలో గల్లంతైన యువకుడి మృతి

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఆమదాలవలస మండలంలోని బెలమాం వద్ద నాగావళి నదిలో గల్లంతైన అనీల్‌కుమార్‌(21) మృతదేహం సోమవారం శ్రీకాకుళం నగరంలోని దత్తాత్రేయస్వామి ఆలయం వద్ద లభ్యమైంది. అక్కడ మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలపగా... వారొచ్చి మృతుడిని గుర్తించారు. ఈ మేరకు కేసును నమోదు చేసి విచారిస్తున్నట్లు ఆమదాలవలస పోలీసులు తెలిపారు. అనీల్‌కుమార్‌ విశాఖపట్నంలో తల్లిదండ్రులతో పాటు ఉంటున్నాడు. అక్కడే ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ చదువుతున్నాడు. పండగకు బెలమాంలోని తాతగారింటికి వచ్చి నదిలో ఆదివారం గల్లంతైన సంగతి తెలిసిందే.


చెరువులో జారిపడి...

సారవకోట, న్యూస్‌టుడే: చెరువులో జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన సారవకోట మండలంలోని భద్రాచలం గ్రామంలో సోమవారం చోటు చేసుకొంది. ఎస్‌.ఐ. లావణ్య వివరాల మేరకు... శ్రీకాకుళం న్యూకాలనీకి చెందిన బోగి భరణికుమార్‌(38) ఈ నెల 15న సంక్రాంతికి అత్తవారింటికి భద్రాచలం గ్రామానికి భార్యాపిల్లలతో కలిసి వచ్చారు. ఈ నెల 16న చెరువులో స్నానానికి వెళ్లాడు. చీకటి పడినా ఇంటికిరాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. భరణికుమార్‌కు ఈత రాదని తెలుసుకొని గ్రామంలోని చెరువు వద్ద పరిశీలించారు. అక్కడ గట్టున పాదరక్షలు, బట్టలు కనిపించడంతో గ్రామస్థులు చెరువులో దిగి గాలించగా నీటిలో మృతదేహం లభ్యమైంది. భరణికుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


అదృశ్యమై... శవమై తేలి..

ఎచ్చెర్ల/అరసవల్లి, న్యూస్‌టుడే: ఎచ్చెర్ల మండలం తెప్పరేవు గ్రామ సమీపంలో శనివారం అదృశ్యమైన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ షేక్‌ అన్వర్‌(35) సోమవారం కాళింగపేట వద్ద నాగావళి నదీ తీరంలో శవమై తేలాడు.ఎస్‌ఐ కె.రాము తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం వాంబేకాలనీలో నివాసం ఉంటున్న అన్వర్‌ శనివారం నది వద్దకు బహిర్భూమికి వెళ్లి అందులో జారి పడిపోయాడు. ఇంటికి రాకపోవడంతో భార్య రహీనాద్‌ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన మృతదేహం కాళింగపేట వద్ద కనిపించింది. మృతుడి తలపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అన్వర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని