logo

నైట్‌వాక్‌... నేరాలకు చెక్‌!

నేరాల నియంత్రణకు, ప్రజల్లో ధైర్యాన్ని నింపేందుకు జిల్లా పోలీసుశాఖ ‘నైట్‌వాక్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎస్పీ అమిత్‌బర్దార్‌ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి రాత్రి వేళల్లో నగరంలోని

Published : 22 Jan 2022 04:52 IST


స్థానికులతో మాట్లాడుతున్న ఎస్పీ అమిత్‌బర్దార్‌

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం: నేరాల నియంత్రణకు, ప్రజల్లో ధైర్యాన్ని నింపేందుకు జిల్లా పోలీసుశాఖ ‘నైట్‌వాక్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎస్పీ అమిత్‌బర్దార్‌ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి రాత్రి వేళల్లో నగరంలోని కాలనీల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వీధుల్లోకి వెళ్లి స్థానికులతో మాట్లాడుతున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులను సమన్వయ పరిచి, వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు.

ఈ నెల 8న కార్యక్రమాన్ని ప్రారంభించారు. గూనపాలెంలోని వీధుల్లో ఎస్పీ పర్యటించారు. ఆ సమయంలో కొందరు స్థానిక మహిళలు ఎస్పీ వద్దకు వెళ్లి వీధి దీపాలు వెలగడం లేదని, యువకులు తమ ప్రాంతానికి వేరే వ్యక్తులు వచ్చి మద్యం, గంజాయి, సిగరెట్లు బహిరంగా తాగుతున్నారని చెప్పారు. ఓ యువతి తనను కొందరు ఆకతాయిలు అల్లరి చేస్తున్నారని ఫిర్యాదు చేయగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌.ఐ.కు సూచించారు. శాంతినగర్‌ కాలనీలో ఈ నెల 12న నైట్‌వాక్‌ చేశారు. అక్కడ చాలాచోట్ల నిఘా కెమెరాలు లేకపోవడంతో తక్షణమే ఏర్పాటు చేయించాలని రెండోపట్టణ సీఐ ఈశ్వరప్రసాద్‌కు సూచించారు. దోమల బెడద ఎక్కువగా ఉందని పలువురు స్థానికులు చెప్పడంతో నగరపాలక సంస్థ సిబ్బందికి విషయం తెలియజేయాలని సిబ్బందిని ఆదేశించారు. 18న మూడో సారి పీఎన్‌ కాలనీలో తిరిగారు.. ఇందులో ఎస్పీతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు నటుకుల మోహన్‌, దేవభూషణ్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు పి.జగన్మోహనరావు, తదితరులు పాల్గొంటున్నారు. కేవలం పోలీసులు మాత్రమే వెళ్తే ప్రజలకు సమస్యలు నిర్భయంగా తెలపరని భావించి వారినీ తీసుకువెళ్తున్నారు.


ఈ నెల 8న నైట్‌వాక్‌లో భాగంగా ఎస్పీ నగరంలోని గూనపాలెంలో పర్యటించారు. ఆ సమయంలో స్థానిక రామాలయంలో నిఘా కెమెరాలు లేవని గమనించారు. వెంటనే ఏర్పాటు చేయాలని ఒకటో పట్టణ ఎస్‌.ఐ. విజయ్‌కుమార్‌కు సూచించగా.. తక్షణమే వేయించారు.


సమాచారమిస్తే మరింత బాగు...

ప్పటికే మూడు ప్రాంతాల్లో నిర్వహించిన నైట్‌వాక్‌ కార్యక్రమంపై మంచి స్పందనే వచ్చింది. కాలనీల్లో, శివారు ప్రాంతాల్లో చాలా కాలం నుంచి వీధి దీపాలు వెలగకపోవడం, ట్రాఫిక్‌ ఇబ్బందులు, మంచినీటి ఇక్కట్లు, ఈవ్‌టీజింగ్‌, యువత వాహనాలు వేగంగా నడపడం, గంజాయి విక్రయాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, జూదమాడటం వంటి సమస్యలను ఎక్కువగా ప్రజలు నైట్‌వాక్‌లో ఎస్పీ దృష్టికి తీసుకువస్తున్నారు. కానీ అధికారులు ఏ ప్రాంతంలో ఎప్పుడు పర్యటిస్తారో అనే సమాచారమూ ముందుగా తెలియజేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా చేస్తే మరిన్ని సమస్యలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో పాటు నైట్‌వాక్‌ ఉద్దేశమూ నేరవేరుతుందని అంటున్నారు.


ఇబ్బందులు తెలుసుకుంటున్నాం...: నైట్‌వాక్‌లో భాగంగా ప్రజలతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకుంటున్నాం. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడుతున్నాం. నేరాల నియంత్రణకు అందరి సహకారం అవసరం. మహిళలు దిశ యాప్‌ను చరవాణుల్లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఆపద సమయంలో ఉపయోగపడుతుందని అవగాహన కల్పిస్తున్నాం. ఎవరైనా ఎలాంటి సమస్యలున్నా మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు నిర్భయంగా తెలియజేయవచ్చు.

- అమిత్‌బర్దార్‌, ఎస్పీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని