logo

కుమారుడి పాణం తీసిన తల్లిదండ్రుల గొడవ

చరవాణిలో మాట్లాడొద్దన్నందుకు విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి తీరని శోకాన్నే మిగిల్చింది. మరో ఘటనలో తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుండటం తట్టుకోలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడటం 

Updated : 22 Jan 2022 05:17 IST

చరవాణిలో మాట్లాడొద్దన్నందుకు విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి తీరని శోకాన్నే  మిగిల్చింది. మరో ఘటనలో తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుండటం తట్టుకోలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడటం ఆలోచనల్లో పడేస్తోంది. జిల్లాలో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలు మనం ఎటుపోతున్నామో.. ఓసారి ప్రశ్నించుకోమంటున్నాయి..

దుర్గాప్రసాద్‌(దాచిన చిత్రం)

లావేరు గ్రామీణం, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుండటాన్ని తట్టుకోలేక దుర్గాప్రసాద్‌(24) బలవన్మరణానికి పాల్పడిన ఘటన లావేరు మండలం తాళ్లవలస పంచాయతీ రావివలసలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నారాయణ అప్పారావు భార్యతో ఈ నెల 19న గొడవ పడ్డాడు. తరచూ గొడవపడుతున్న వీరి తీరు చూడలేక పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్‌ ఆ రోజు రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన తండ్రి కూడా తాగేశాడు. స్థానికులు ఇద్దరినీ 108లో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. తండ్రి కొలుకోగా.. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గురువారం కేజీహెచ్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. దుర్గాప్రసాద్‌ భద్రాచలంలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నాడు. సంక్రాంతి పండక్కి వచ్చాడు. అప్పారావు చిన్న కుమారుడు దివ్యాంగుడు. తల్లి పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.సిద్ధార్థ్‌కుమార్‌ తెలిపారు.  


చరవాణిలో మాట్లాడొద్దన్నందుకు విద్యార్థిని ఆత్మహత్య

వంగర, న్యూస్‌టుడే: చరవాణికి దూరంగా ఉంటూ చదువుపై దృష్టిపెట్టాలని తల్లిదండ్రులు చెప్పిన మాటలకు ఆవేశం తెచ్చుకుని వంగర మండలం కె.కొత్తవలస గ్రామానికి చెందిన బాలిక(16) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అప్పలరాజు కుటుంబం కొన్నేళ్ల కిందట కూలిపనుల నిమిత్తం విజయవాడ వలస వెళ్లింది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె ప్రస్తుతం అక్కడే పదోతరగతి చదువుతోంది. ఇటీవల అంతా సంక్రాంతి పండక్కి స్వగ్రామం వచ్చారు. బాలిక సెల్‌ఫోన్‌లో తరచూ మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు శుక్రవారం మందలించారు. దీంతో బాలిక మధ్యాహ్నం 2 గంటల సమయంలో మడ్డువలస వంతెన పైనుంచి సువర్ణముఖి నదిలో దూకేసింది. విషయం తెలుసుకున్న సీఐ నవీన్‌కుమార్‌, ఎస్‌ఐ దేవానంద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని నదిలో గాలించగా.. బాలిక మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు శ్రీనివాసరావు ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని