logo

ఆ స్థాయిలో పరీక్షలేవి?

సిక్కోలులో కొవిడ్‌ మూడోదశ విజృంభణ రోజురోజుకీ తీవ్రమవుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకొస్తున్నాయి. గతంలో పాజిటివిటీ రేటు 7 దాటిన వెంటనే కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. శుక్రవారం వచ్చిన కొవిడ్‌

Published : 22 Jan 2022 04:52 IST

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, గుజరాతీపేట

* జిల్లాలో శుక్రవారం 3,279 నమూనాలు పరీక్షించగా రికార్డు స్థాయిలో 1,230 కొత్త కొవిడ్‌ కేసులు వెలుగులోకొచ్చాయి. పాజిటివిటీ రేటు 37.5 శాతంగా నమోదైంది. గత ఎనిమిది నెలల్లో ఇదే అత్యధికం. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా కొవిడ్‌ పరీక్షలు మాత్రం పెంచడం లేదు.

* గతేడాది కొవిడ్‌ రెండో దశలో విజృంభించినప్పుడు మే 1న అత్యధికంగా 2,048 కేసులు నమోదయ్యాయి. అప్పుడు 7,215 నమూనాలు పరీక్షించారు. అంటే పాజిటివిటీ రేటు 28.38 శాతం. అప్పుడు ఈ స్థాయిలో పాజిటివిటీ రేటు నమోదు కావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టింది. ఇప్పుడు పది రోజుల్లోనే పాజిటివిటీ రేటు 7.5 నుంచి 37.5కి చేరుకుంది.

సిక్కోలులో కొవిడ్‌ మూడోదశ విజృంభణ రోజురోజుకీ తీవ్రమవుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకొస్తున్నాయి. గతంలో పాజిటివిటీ రేటు 7 దాటిన వెంటనే కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. శుక్రవారం వచ్చిన కొవిడ్‌ ఫలితాల ప్రకారం పాజిటివిటీ రేటు అత్యంత ప్రమాదకరస్థాయిలో 37.5గా నమోదైంది. అయినా జిల్లా అధికార యంత్రాంగం పటిష్ఠ చర్యలకు దిగడం లేదు.


కొవిడ్‌ కిట్ల కొరత..! 

తంలో జిల్లాకి లక్ష కొవిడ్‌ టెస్టింగ్‌ కిట్లు సరఫరా అయ్యాయి. వాటిలో ప్రస్తుతం 30 వేలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో పరీక్షల సంఖ్య పెంచడంతో కిట్ల కొరత ఏర్పడింది. జిల్లాలో ఆ సమస్య ఎదురు కాకుండా అధికారులు పరీక్షలను పెంచడం లేదు. పీహెచ్‌సీ స్థాయిలో గతంలో ఎంతమంది వెళ్లినా నమూనాలు సేకరించేవారు. ఇప్పుడు 10-15 మందికి మాత్రమే చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే భేదం లేకుండా వైరస్‌ అంతటా వ్యాప్తి చెందింది. ఈ క్రమంలో గ్రామాల్లోనూ ఎక్కువ సంఖ్యలో నమూనాలు సేకరించి పరీక్షించాలి. వీలైనంత ఎక్కువ మంది వైరస్‌ బాధితులను గుర్తించి చికిత్స అందిస్తేనే వారి నుంచి ఇతరులకు కొవిడ్‌ వ్యాపించకుండా కట్టడి చేయవచ్చు.


ఆంక్షలు ఏమయ్యాయో..

మాస్కు ధరించకుండా ఎవరైనా బయట తిరుగుతూ కనిపిస్తే రూ.100 జరిమానా విధిస్తామని గతంలో జిల్లా అధికారులు చెప్పారు. దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, బస్సుల్లో కొవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటించాలని చెప్పారు. ఆ హెచ్చరికలన్నీ ప్రకటనలకే పరిమితమైపోయాయి తప్పితే పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాలేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా అన్నిచోట్లా నిబంధనలు కఠినంగా అమలు చేస్తేనే కొవిడ్‌ వ్యాప్తిని కొంతలో కొంతైనా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది.


విస్తృతంగా నిర్వహించండి: కలెక్టర్‌

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: కరోనా పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధికారులకు సూచించారు. టెక్కలిలోని జిల్లా ఆసుపత్రి నూతన భవనంలో ఏర్పాటు  చేసిన వీఆర్‌డీల్యాబ్‌ను శుక్రవారం పరిశీలించారు. ప్రస్తుతం 100 ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులతో ట్రయల్‌రన్‌ ప్రారంభమైనట్లు చెప్పారు. ఇప్పటివరకు జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో 5 వేల పరీక్షల సామర్థ్యంతో ల్యాబ్‌ నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో అవసరాన్ని బట్టి టెక్కలిలో పరీక్షల సామర్థ్యాన్ని 3 వేలకు పెంచుతామన్నారు. ఇచ్ఛాపురం, టెక్కలి, పాతపట్నం మండలాల నుంచి వచ్చే నమూనాలను కేవలం 12 గంటల్లోనే పరీక్షించి ఫలితాలిచ్చే సౌకర్యం కలిగిందన్నారు. వైద్యసిబ్బంది నియామకం, పరీక్షల సామర్థ్యం వివరాలను డిప్యూటీ డీఎంహెచ్‌వోలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 26న ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. మౌలిక వసతులు, తాగునీరు అంశాలపై ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ ప్రసాద్‌ను ఆరా తీశారు. ఈయనవెంట సబ్‌కలెక్టర్‌ వికాస్‌మర్మత్‌, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ శ్రీనుబాబు, తహసీల్దార్‌ హనుమంతరావు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని