logo

కొండను కొల్లగొడుతున్నారు!

కోటబొమ్మాళి సమీపంలో వందకుపైగా ఎకరాల్లో విస్తరించిన కొత్తపేట కొండ ఇది. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ.. పలు జీవజాలాలకు ఆధారంగా నిలుస్తున్న ఈ కొండను గడిచిన మూడు నెలలుగా ఇలా తవ్వి తరలించేస్తున్నారు.

Published : 22 Jan 2022 04:52 IST

న్యూస్‌టుడే, కొత్తపేట(కోటబొమ్మాళి)

కోటబొమ్మాళి సమీపంలో వందకుపైగా ఎకరాల్లో విస్తరించిన కొత్తపేట కొండ ఇది. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ.. పలు జీవజాలాలకు ఆధారంగా నిలుస్తున్న ఈ కొండను గడిచిన మూడు నెలలుగా ఇలా తవ్వి తరలించేస్తున్నారు. గతంలో అధికారులుండరని ఆదివారం, సెలవు రోజుల్లో మాత్రమే ఈ అక్రమం సాగేది. ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం నిత్యకృత్యంగా మారింది. జేసీబీ పెట్టి మరీ రోజుకు 30కిపైగా ట్రాక్టర్ల కంకరను తవ్వి తరలించేస్తున్నారు. దీంతో కొండ వేగంగా కరిగిపోతోంది.

కొత్తపేట, కోటబొమ్మాళి సమీపంలో ఉన్న కొండలో కంకర అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. యంత్రాలతో భారీగా తవ్వుతూ ట్రాక్టర్లతో బహిరంగంగా తరలించి విక్రయిస్తున్నారు. ఈ అక్రమం మండల, ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలోనే జరుగుతున్నా.. ఎలాంటి చర్యలూ లేకపోవడం విడ్డూరం. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వ పనులకే తవ్వుతున్నామని అక్రమార్కులు బెదరగొడుతున్నారు.

ముప్పు ముంగిట..
కొండను ఆనుకుని కేజీబీవీ బాలికల కళాశాల, కొండపై పోలీసు, రెవెన్యూ రిపీటర్‌స్టేషన్లు, ప్రకాష్‌నగర్‌కాలనీ, ఇందిరమ్మకాలనీ ఉన్నాయి. తాజాగా కోటబొమ్మాళి, కొత్తపేట పంచాయతీలకు చెందిన వందలాది మందికి జగనన్న కాలనీ నివాసాలు ఈ సమీపంలోనే మంజూరయ్యాయి. ఓ వైపు వీటి నిర్మాణాలు సాగుతున్నాయి. మరోవైపు భారీగా ఈ కంకర అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇలా తవ్వేస్తే కొండ ఆకారం మారిపోయి.. భవిష్యత్తులో వరద ముంపు పొంచి ఉంటుందని సమీప ప్రాంతాల వారు అంటున్నారు. తవ్వకాలతో కొండ మట్టి వదులు అవుతోంది. దీంతో వర్షం పడితే మట్టి సులువుగా కరిగి చుట్టుపక్కల జనావాసాలు, కార్యాలయాల్లోకి చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉందని, వెంటనే అక్రమ తవ్వకాలను ఆపాలని వీరంతా కోరుతున్నారు.


అనుమతులు తీసుకోవాలి..

కంకర తవ్వకాలకు ఎక్కడా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. అనుమతుల్లేకుండా తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ కార్యక్రమాలకు అవసరమైనప్పుడు దరఖాస్తులు సమర్పిస్తే మైన్స్‌, జియాలజీ శాఖకు పంపించటం జరుగుతుంది. ఈ విషయమై పలువురు తెలియచేసినప్పుడు దరఖాస్తులు ఇవ్వాలని చెప్పడం జరిగింది.

- సూర్యనారాయణ, తహసీల్దార్‌, కోటబొమ్మాళి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని