logo

జిల్లా మిల్లుల్లోకి ఒడిశా ధాన్యం!

స్థానికంగా సేకరించిన ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకొచ్చి ఓ చోట నిలిపి ఉంచిన లారీలోకి ఎక్కిస్తున్న వైనాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు. అవి ఒడిశా రైతుల నుంచి సేకరించిన ధాన్యం బస్తాలు. ఇచ్ఛాపురానికి కూతవేటు దూరంలో లారీల్లోకి లోడ్‌ చేసి అక్కడి నుంచి రాత్రి సమయాల్లో ....

Published : 22 Jan 2022 04:52 IST

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

స్థానికంగా సేకరించిన ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకొచ్చి ఓ చోట నిలిపి ఉంచిన లారీలోకి ఎక్కిస్తున్న వైనాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు. అవి ఒడిశా రైతుల నుంచి సేకరించిన ధాన్యం బస్తాలు. ఇచ్ఛాపురానికి కూతవేటు దూరంలో లారీల్లోకి లోడ్‌ చేసి అక్కడి నుంచి రాత్రి సమయాల్లో చెక్‌పోస్టులు దాటించేస్తున్నారు. అనంతరం ఆ లారీలు నేరుగా జిల్లాలోని మిల్లుల్లోకి వెళ్లిపోతున్నాయి. క్షణాల వ్యవధిలోనే అక్కడ సరకు అన్‌లోడ్‌ అయిపోతోంది.

రుగాలం శ్రమించి పంట పండిస్తున్న అన్నదాతకు ఎప్పుడూ గడ్డుకాలమే. పండించానికి ఎంత శ్రమిస్తున్నారో ఆ పంటను అమ్ముకోవడానికి అంతకంటే ఎక్కువ కష్టపడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. రైతుభరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా ధాన్యం సేకరించి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. రైతుల నుంచి సకాలంలో ధాన్యం కొనడం గగనంగా మారిపోయింది. ఎక్కడికక్కడ అధికారులు, మిల్లర్లు పెడుతున్న కొర్రీలతో దళారులకే అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి అన్నదాతది.

కొన్నది 25 శాతమే..

జిల్లాలో రైతుల నుంచి 7.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. వాస్తవానికి డిసెంబరు చివరి నాటికి లక్ష్యంలో 40 శాతం, జనవరిలో మరో 40 శాతం, ఫిబ్రవరిలో మిగిలిన 20 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. ఈసారి జనవరి మూడోవారం గడిచిపోతున్నా ఇప్పటికి కొన్నది కేవలం 25 శాతం మాత్రమే. ఈ లెక్కన లక్ష్యాన్ని ఎప్పటికి చేరుకుంటారో, ధాన్యం పూర్తిగా ఎప్పటికి కొనుగోలు చేస్తారో ఎవరికీ తెలియని దుస్థితి.

తక్కువ ధరకే పంట...!

ఇచ్ఛాపురానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నాఘర్‌ వద్ద దళారులు తిష్ఠవేసి ఒడిశా రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. 77 కిలోల బస్తాకు రూ.1,100 చెల్లిస్తున్నారు. మళ్లీ బస్తాకు 2-5 కిలోల ధాన్యం అదనంగా తీసుకుంటున్నారు. అలా క్వింటా ధాన్యాన్ని రూ.1,428కి కొనుగోలు చేసి ఇక్కడి మిల్లర్లకు చేరవేస్తున్నారు. మరపట్టిన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మిల్లర్ల నుంచి కొనుగోలు చేస్తుంది. ధాన్యం లోడు క్షేమంగా మిల్లుకు చేరేవరకూ దళారులే బాధ్యత వహిస్తుండటంతో మిల్లర్ల చేతికి మట్టి అంటుకోకుండా పని జరిగిపోతోంది.


ఒడిశా ధాన్యం రాష్ట్రంలోకి ప్రవేశించడంతో ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొంటూ గతేడాది జిల్లా అధికారులు ఇచ్ఛాపురం చెక్‌పోస్టు వద్ద లారీలను ఇలా రోజుల తరబడి నిలిపేశారు. ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో పాటు మరోసారి ఇలా ధాన్యం రవాణా చేయబోమని సంబంధిత లారీ యాజమాన్యాలు స్పష్టం చేయడంతో వాటిని వదిలేశారు. ఇప్పుడు మరికొందరు ఇలా అక్రమ రవాణాకి పాల్పడుతున్నారు.


అడ్డుకోకుంటే తీవ్ర నష్టమే

రైతుల నుంచి ఇప్పటివరకూ కొనుగోలు చేసింది దాదాపు 2 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. ఇంకా 5.8 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ సమయంలో ఒడిశా ధాన్యం కనుక ఇక్కడి మిల్లుల్లోకి చేరిందంటే జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఏటా ఈ తతంగం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయం అధికారులకూ తెలిసిందే. ఈసారైనా జిల్లా సరిహద్దుల వద్ద కఠిన ఆంక్షలు విధించి ధాన్యం లారీలు రాకుండా నిలువరిస్తే తమ పంటకు గిట్టుబాటు ధర దక్కుతుందని జిల్లా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


నిఘా పెంచుతాం 

డిశా ధాన్యం జిల్లాలోని మిల్లుల్లోకి రాకుండా అడ్డుకుంటున్నాం. మిల్లర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించాం. ఈ అంశాన్నీ ప్రధానంగా ప్రస్తావించాం. అత్యాశకి పోయి సమస్యలు కొని తెచ్చుకోవద్దని మిల్లర్లకు సూచించాం. సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద నిఘా మరింత పెంచుతాం. వచ్చే ప్రతి లారీని క్షుణ్ణంగా తనిఖీ చేసేలా ఏర్పాట్లు చేస్తాం.

-ఎం.విజయసునీత, జాయింట్ కలెక్టర్‌(రైతుభరోసా)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని