logo

మా బాధలు చూడండి సారూ.!

కొంతభాగం కాలిపోయిన ఈ ధాన్యం బూర్జ మండలంలోని పెద్దపేట పంచాయతీ కొండపేటకు చెందిన అడ్డాకుల ఆదినారాయణవి. మరో గంటలో వీటిని సంచుల్లోకి ఎత్తాలనుకుంటుండగానే అగ్నికీలలు ఎగసి క్షణాల్లో రాశులను చుట్టుముట్టాయి. స్థానికులు, పాలకొండ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది శ్రమించిన మీదట పూర్తి నష్టం జరగకుండా కొంత కాపాడగలిగారు. అప్పటికే రూ.లక్ష మేర నష్టపోయానని బాధితుడు లబోదిబోమంటున్నాడు. అధికారుల

Updated : 23 Jan 2022 05:36 IST

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, వీరఘట్టం, బూర్జ

కొంతభాగం కాలిపోయిన ఈ ధాన్యం బూర్జ మండలంలోని పెద్దపేట పంచాయతీ కొండపేటకు చెందిన అడ్డాకుల ఆదినారాయణవి. మరో గంటలో వీటిని సంచుల్లోకి ఎత్తాలనుకుంటుండగానే అగ్నికీలలు ఎగసి క్షణాల్లో రాశులను చుట్టుముట్టాయి. స్థానికులు, పాలకొండ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది శ్రమించిన మీదట పూర్తి నష్టం జరగకుండా కొంత కాపాడగలిగారు. అప్పటికే రూ.లక్ష మేర నష్టపోయానని బాధితుడు లబోదిబోమంటున్నాడు. అధికారుల సకాలంలో తమ ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదుగదా అని వాపోతున్నాడు.

మిల్లర్లు, అధికారులకు మధ్య సమన్వయ లోపం కారణంగా ధాన్యం కొనుగోళ్లు షెడ్యూల్‌ ప్రకారం సాగడంలేదు. తమ పంట అమ్ముకోవడానికి తీవ్రంగా శ్రమించినా రైతుకు ఫలితం దక్కడం లేదు. రాశులు, బస్తాలుగా ధాన్యం రెండు నెలలుగా కల్లాల్లోనే దర్శనమిస్తోంది. ఈలోపు వర్షాలు, అగ్నిప్రమాదాల వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. పంట చేతికి అందిందనుకునేసరికే మరో రూపంలో రైతులను కష్టాలు చుట్టుముడుతున్నాయి.

నోడల్‌ అధికారులేరి..

మిల్లుకో నోడల్‌ అధికారి ఉన్నా అక్కడివరకూ వచ్చిన ధాన్యం వెనక్కి వెళ్తున్నాయంటే వారు ఎంత సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారో వేరే చెప్పనక్కర్లేదు. ఈ ఇబ్బందులన్నిటికీ ప్రధాన కారణం సిబ్బందికి, మిల్లర్లకు మధ్య సమన్వయం లేకపోవడమే. జిల్లా ఉన్నతాధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే మరింత ఎక్కువ మంది రైతులు తమ పంటను, మద్దతు ధరను నష్టపోవాల్సి వస్తుంది.

 ఎక్కడ చూసినా ధాన్యమే..

పంట కోసిన తర్వాత 80 శాతం మంది రైతులు పొలాల్లోనే కుప్పలుగా వేశారు. డిసెంబరు మూడో వారం నుంచి పెద్దఎత్తున నూర్పిళ్లు ప్రారంభించారు. ఇప్పటికే మెజారిటీ రైతులు కుప్పలు నూర్పిడి చేసి ధాన్యాన్ని ఆరబెట్టి ధాన్యాన్ని బస్తాల్లో నింపి నెట్లు కడుతున్నారు. రైతులు ఆర్బీకేల చుట్టూ తిరుగుతున్నా ఆ బస్తాలు మిల్లుల్లోకి వెళ్లడం లేదు.


ఎట్టా బతకాలి దేవుడా!

ఈ రైతు పేరు దేశమంతుల రామందొర. వీరఘట్టం మండలం కంబర పంచాయతీ పరిధిలోని కాగితాడ గిరిజన గ్రామం. ఐదెకరాల పొలం కౌలుకు తీసుకుని రూ. 1.25 లక్షలు అప్పుచేసి పంట సాగుచేశారు. 132 బస్తాల ధాన్యం చేతికొచ్చింది. కష్టాలు తీరిపోతాయనుకున్నారు. డిసెంబరులో చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్మేందుకు అధికారుల చుట్టూ తిరిగీ తిరిగీ జనవరి 5న తరలించేలా షెడ్యూల్‌ తీసుకున్నారు. సమయం దాటిపోయి 18 రోజులు గడుస్తున్నా ధాన్యం తరలించలేదు. శనివారం జరిగిన ప్రమాదంలో గింజమిగలకుండా అగ్నికి ఆహుతైపోయింది. నేనెట్టా బతకాలిరా దేవుడా అంటూ దిక్కుతోచక విలపిస్తున్నారు.


ఆర్బీకే సిబ్బంది చెప్పడంతో వీరఘట్టం మండలం యు.వెంకంపేటకు చెందిన ముగ్గురు రైతులు 270 బస్తాల ధాన్యాన్ని రాజాంలోని ఓ మిల్లుకు పంపించారు. వివిధ కారణాలతో ఆ వాహనాన్ని మూడు రోజులు అక్కడే నిలిపిన మిల్లు యాజమాన్యం ఆ తర్వాత ధాన్యం తీసుకోవడానికి ససేమిరా అన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు లారీని వెనక్కి తీసుకెళ్లారు. లారీ బాడుగ కట్టుకుని ఎవరి ధాన్యం వారు దించుకుని కల్లాల్లో నెట్లు కట్టుకున్నారు. జిల్లాలో సగానికిపైగా రైతుల ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉండిపోయింది.


మీ ధాన్యం తీసుకోం..

కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేసి అధికారులే మిల్లులకు తరలించాలి. ఇది సక్రమంగా అమలు కావడం లేదు. రైతులే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక రోజుల తరబడి వాహనాల్ని వెయిటింగ్‌లో ఉంచి చివరికి ధాన్యం తీసుకోబోమని మిల్లర్లు చెబుతున్నారు. ఈలోపు దళారులు బేరసారాలు నెరపుతున్నారు. తాము చెప్పిన ధరకు ఒప్పుకొంటే తక్షణం బస్తాలు అన్‌లోడ్‌ చేస్తామని లేదంటే వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని చెబుతున్నారు.

తక్షణం పరిష్కరిస్తాం..  

ఇప్పటికే మిల్లర్లతో పలుమార్లు సామరస్యంగా చర్చలు జరిపాం. ఇంకా కొన్నిచోట్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎక్కడెక్కడ రైతులకు ఈ సమస్య ఎదురవుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం. తద్వారా కొనుగోళ్లు మరింత వేగవంతం చేస్తాం. రైతులెవరూ నష్టపోకుండా మద్దతు ధర కల్పించడమే మా లక్ష్యం.

 - శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, కలెక్టరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని