logo

అప్పుడప్పుడు.. తూటాల చప్పుడు!

శాంతిభద్రతలకు మారుపేరుగా నిలిచే సిక్కోలు జిల్లాలో ఇలా పలుమార్లు తూటాల చప్పుడు వినిపించింది. తాజాగా జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీటిని నిలువరించకుంటే భవిష్యత్తులో మరిన్ని

Published : 23 Jan 2022 03:52 IST

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తా విభాగం

తుపాకులు (దాచిన చిత్రం)

శాంతిభద్రతలకు మారుపేరుగా నిలిచే సిక్కోలు జిల్లాలో ఇలా పలుమార్లు తూటాల చప్పుడు వినిపించింది. తాజాగా జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీటిని నిలువరించకుంటే భవిష్యత్తులో మరిన్ని ఘటనలకు అవకాశం కల్పిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణహాని ఉందని, ఆత్మ రక్షణకు, జాతీయ బ్యాంకులు, త్రివిధ దళాల్లో ఉద్యోగ విరమణ పొందినవారు.. ఇలా పలువురు తుపాకీ అవసరమని, అనుమతి మంజూరు చేయాలని అర్జీలు పెట్టుకుంటారు. జిల్లాలో సుమారు 270 తుపాకీలకు లైసెన్సు ఉన్నట్లు పోలీసుల దస్త్రాల్లో నమోదైంది. ఇవికాక అనధికారంగా వందల్లో నాటుతుపాకీలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
* జిల్లా కేంద్రంలో మూడు రోజుల కిందట సర్పంచిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఖరీదైన పిస్టల్‌ను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
* గతేడాది మందస మండలం చిక్కిడిగాంలో భూ తగాదాల విషయంలో మనవడు నాటు తుపాకీతో తాతను కాల్చిచంపాడు.
* టెక్కలిలో సుమారు 15 ఏళ్ల కిందట ఓ ప్రముఖ వ్యాపారిని స్థానికంగా ఉండే కొందరు తాము నక్సల్స్‌మంటూ... డబ్బులు డిమాండు చేసి నాటు తుపాకీతో బెదిరించారు.

లైసెన్స్‌ జారీ ఇలా..

తుపాకీ కావాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు కలెక్టరేట్‌కు, అనంతరం ఎస్పీ కార్యాలయానికి పంపుతారు. పోలీసు సిబ్బంది విచారించి అవసరమైతే అనుమతిస్తారు. రెండు నెలల వ్యవధిలో తుపాకీ కొనుగోలు చేసి, బిల్లులు, సంబంధిత పత్రాలను డీఆర్‌వోకి సమర్పిస్తే లైసెన్సు జారీ చేస్తారు. ప్రతి మూడేళ్లకొకసారి రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రత్యేక దృష్టి సారిస్తాం..
జిల్లాలో తుపాకీల వినియోగంపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. ఇప్పటికే సిబ్బందిని ఎన్ని తుపాకీలు ఉన్నాయి.. అనధికారికమైనవి ఉన్నాయేమో ఆరా తీయమని ఆదేశాలు జారీచేశాం. నేరాల నియంత్రణకు కృషి చేస్తాం. 

   -అమిత్‌బర్దార్‌, ఎస్పీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని