logo

పెళ్లిపీటలపైకి పసిమొగ్గలు!

‘ఎచ్చెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికకు చదువంటే ఆసక్తి. మరో ప్రాంతంలో ఉండి చదువుకునేది. కొవిడ్‌  నేపథ్యంలో ఇటీవల సొంతూరుకు రావడంతో పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు కన్నవారు. అధికారులకు సమాచారం అందటంతో బాలల రక్షణ విభాగం, ఐసీడీఎస్‌, పోలీసు అధికారులు వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పెళ్లిని అడ్డుకుని బాలికను ప్రభుత్వ విద్యా సంస్థలో చేర్పించటంతో ఇప్పుడు చదువుకుంటోంది’...

Updated : 24 Jan 2022 05:15 IST

నేడు జాతీయ బాలికా దినోత్సవం

న్యూస్‌టుడే - రాజాం

బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

‘ఎచ్చెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికకు చదువంటే ఆసక్తి. మరో ప్రాంతంలో ఉండి చదువుకునేది. కొవిడ్‌  నేపథ్యంలో ఇటీవల సొంతూరుకు రావడంతో పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు కన్నవారు. అధికారులకు సమాచారం అందటంతో బాలల రక్షణ విభాగం, ఐసీడీఎస్‌, పోలీసు అధికారులు వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పెళ్లిని అడ్డుకుని బాలికను ప్రభుత్వ విద్యా సంస్థలో చేర్పించటంతో ఇప్పుడు చదువుకుంటోంది’


‘లావేరు మండలానికి చెందిన ఓ కుటుంబం పేదరికంతో పొట్టకూటి కోసం మరో చోటకు వలసవెళ్లింది. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి సొంతూరు వచ్చారు. మంచి సంబంధం రావడంతో కన్నవారు సరేనని బాలికకు పెళ్లి చేసేందుకు ముహూర్తం పెట్టించేశారు. అధికారులకు తెలిసింది. కన్నవారు, బంధువులు మొదట ప్రతిఘటించారు. వారికి చట్టాలు, పరిణామాలను వివరించి అధికారులు దారికి తెచ్చారు. బాలికను ప్రభుత్వ విద్యాలయంలో చేర్పించడంతో ప్రస్తుతం పైతరగతులు చదువుతోంది’.

గటున జిల్లాలో ప్రతి నాలుగు రోజులకో బాల్యవివాహం అధికారుల దృష్టికొస్తోంది. ఇలా వచ్చిన వాటిని అడ్డుకుంటున్నా... రాకుండానే ఎన్ని పెళ్లిళ్లు జరిగిపోతున్నాయో.. వీటిని అడ్డుకునేందుకు ఎన్నెన్నో చట్టాలు తెస్తున్నా.. ఆ మేరకు ప్రజలను చైతన్యపర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు.. అందుకు నిదర్శనాలే ఇంకా బాల్యవివాహాలు కొనసాగుతుండటం.. మరోవైపు కేంద్రప్రభుత్వం యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21కు పెంచాలని యోచిస్తోంది.

ఎందుకు ఈ వివక్ష

మగపిల్లాడిని ఒకలా, ఆడపిల్లను మరోలా చూసే దృక్పథం మారాలంటున్నారు మానసిక నిపుణులు. 2011-2016 సంవత్సరాల మధ్య 395 ఫిర్యాదులు అధికారులకు అందితే 392 పెళ్లిళ్లు నిలుపుదల చేశారు. ఇందులో 383 మంది బాలికలే కావడం నిర్ఘాంతపరిచే నిజం.

2016-2021 మధ్య 671 ఫిర్యాదులు రాగా 666 పెళ్లిళ్లు నిలిపేశారు. ఇందులో 663 ఉదంతాల్లో బాలికలే కావడం విశేషం.

ఇవీ కారణాలు..
తక్కువ కట్నం, కట్నం లేకుండా వియ్యంకులు అంగీకరించారని..

కన్నవారి బాధ్యత తీరుతుందని..

మంచి సంబంధం వచ్చిందని..

తల్లిదండ్రుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారని..

గ్రామాల్లో రాజకీయ పలుకుబడి పెంచుకోవాలని..

మ వివాహాల వైపు మొగ్గు చూపుతారేమోననే భయం.. ఇలా పలు విషయాలు ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి.


దీర్ఘకాలిక సమస్యలు..
- జి.మాధవీలత, ప్రసూతి వైద్య నిపుణులు, జీఎంఆర్‌ కేర్‌  

బాల్యంలోనే గర్భం దాల్చటం వల్ల శారీరక ఎదుగుదల నిలిచిపోతుంది. గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశంతో పాటు సహజ ప్రసవానికి ఇబ్బంది కలుగుతుంది. మాతా శిశుమరణాలకు ఆస్కారం ఉంటుంది. శిశువు ఐక్యూ, పెరుగుదలపైనా ప్రభావం ఉంటుంది. అంగవైకల్య ఇబ్బందులూ తలెత్తుతాయి.


బాధ్యత అందరిదీ..
-కేవీ రమణ, జిల్లా బాలల రక్షణ అధికారి, శ్రీకాకుళం

బాల్య వివాహాలను అడ్డుకోవడంలో గ్రామస్థాయి అధికారులు కీలక భూమిక పోషించాలి. పెళ్లిళ్లు చేసేందుకు కన్నవారు ప్రయత్నిస్తే బాల బాలికలు అధికారులకు సమాచారం ఇచ్చి రక్షణ పొందాలి. గ్రామస్థాయిలో బాలల రక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని