logo

మాస్టార్‌ అథ్లెట్లు... మెరుస్తున్నారు!

వెటరన్‌ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటూ పతకాల పంట పండిస్తున్నారు. వర్ధమాన క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. వివిధ కారణాలతో క్రీడావకాశాలు కోల్పోయిన వారంతా ఓ వైపు

Published : 24 Jan 2022 03:27 IST

జాతీయస్థాయి పోటీలకు సాధన చేస్తూ...

శ్రీకాకుళం అర్బన్‌, పాతపట్నం, న్యూస్‌టుడే: వెటరన్‌ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటూ పతకాల పంట పండిస్తున్నారు. వర్ధమాన క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. వివిధ కారణాలతో క్రీడావకాశాలు కోల్పోయిన వారంతా ఓ వైపు మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో రాణిస్తూ అభిలాషను నెరవేర్చుకుంటున్నారు. మరోవైపు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లా తరఫున 48 మంది పాల్గొని 76 పతకాలు సాధించారు. వీరిలో 20 మంది జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.


వరుసగా..18 ఏళ్లుగా...
 - పాలకొండ అప్పారావు

పదిహేడేళ్ల వయసులో క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాను. వరుసగా 18 సంవత్సరాలు క్రీడల్లో పాల్గొన్నాను. వృతిరీత్యా కమర్షియల్‌ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తూనే క్రీడాపోటీల్లో పాల్గొంటున్నాను. 2010లో మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ప్రారంభించినాటి నుంచి ఇప్పటికవరకు పోల్‌వాల్ట్‌, హేమర్‌ త్రో, జావెలిన్‌ త్రో విభాగాల్లో ఇప్పటి వరకు 15 సార్లు జాతీయస్థాయి పోటీల్లో ఏడు రజతాలు, 5 కాంస్య పతకాలు సాధించాను. రాష్ట్రస్థాయి పోటీల్లో 30 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు దక్కించుకున్నాను. 2016లో సింగపూర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పోల్‌వాల్ట్‌లో 4వ స్థానంలో నిలిచాను. ఏప్రిల్‌లో గచ్చిబౌలిలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను. 


నిరంతర సాధన...
- మల్లిపురం భాగ్యలక్ష్మి

నేను శ్రీకాకుళం జిల్లా ఖజానా కార్యాలయంలో ఉపఖజానాధికారికిగా పని చేస్తున్నాను. పాఠశాల స్థాయి నుంచి వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో ప్రావీణ్యముంది. మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో మంచి ప్రతిభ కనబరుస్తున్నాను. ఇందుకు నిరంతరం సాధన చేస్తున్నాను. గచ్చిబౌలి, నాగార్జున వర్సిటీల్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొన్నాను. రాష్ట్రస్థాయి పోటీల్లో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాను. ఏప్రిల్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాను. క్రీడల పట్ల అభిరుచి కలిగిన నాలాంటి వారికి మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు చక్కటి వేదిక.


ప్రతిసారీ స్వర్ణాలే...
- దాలి యశోద

చిన్ననాటి నుంచి క్రీడలపై ఉన్న ఆసక్తితోనే బీపీఈడీ పూర్తి చేసి వ్యాయామెపాధ్యాయినిగా స్థిరపడ్డారు. పుష్కరకాలంగా మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో రాణిస్తున్నాను. పోటీ చేసిన ప్రతిసారి స్వర్ణపతకాలు సాధిస్తున్నాను. వివిధ కారణాలతో జాతీయస్థాయిలో పతకాలు సాధించలేకపోయాను. ఇప్పటి వరకు 10 సార్లు జాతీయస్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాను. రాష్ట్రస్థాయి పోటీల్లో తొలిసారి 100 మీ. పరుగు పందెం పోటీల్లో రజతం, 50 స్వర్ణ పతకం సాధించాను. జాతీయస్థాయి పోటీల్లో పతకం సాధించేందుకు నిరంతరం సాధన చేస్తున్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని