logo

ఇంటింటా కొళాయి.. అంతా రూర్బన్‌ బడాయి

అబ్బా.. ఇంటింటా కొళాయి.. సోంపేట వాసులకు ఎంత హాయి.. అనుకోకండి.. ఏర్పాటు చేసి రెండేళ్లు దాటినా ఈ కొళాయిల్లో నీరు మాత్రం రావడంలేదు. రూర్బన్‌ పథకం కింద జిల్లాలో ఏకైక క్లస్టర్‌గా సోంపేట మేజర్‌ పంచాయతీని ఎంపిక చేశారు.

Published : 24 Jan 2022 03:27 IST

న్యూస్‌టుడే, సోంపేట

అబ్బా.. ఇంటింటా కొళాయి.. సోంపేట వాసులకు ఎంత హాయి.. అనుకోకండి.. ఏర్పాటు చేసి రెండేళ్లు దాటినా ఈ కొళాయిల్లో నీరు మాత్రం రావడంలేదు. రూర్బన్‌ పథకం కింద జిల్లాలో ఏకైక క్లస్టర్‌గా సోంపేట మేజర్‌ పంచాయతీని ఎంపిక చేశారు. మూడేళ్ల కిందట ఉద్దానం ప్రాజెక్టు నీటిలభ్యత ఆధారంగా రూ.4 కోట్ల నిధులతో జలంత్రసోంపేట వీధుల్లో 3 ట్యాంకులు, ఇంటింటా కొళాయిలు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. రెండేళ్లవుతున్నా నీటి సరఫరా మాత్రం లేదు. అవసరమైన మేరకు నీటి లభ్యత లేకపోవడంతో అలంకార ప్రాయంగా మిగిలాయి.

నీటి లభ్యత పూర్యాపరాలను పరిశీలించకుండా పనులు చేయడంతోనే ఇవి వృథాగా ఉండిపోయాయి. రూ.4 కోట్లు వెచ్చించినా పట్టణ వాసుల నీటి కష్టాలు మాత్రం తీరలేదు. నిర్మించిందే వృథాగా ఉంటే.. అధికారులు మాత్రం చీకటి సోంపేట వైపు రూ.2 కోట్లతో ట్యాంకులు, కొళాయిల నిర్మాణ పనులు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. నిర్మించిన వాటికే అతీగతీ లేకుండా పడి ఉండగా రెండోవైపు పనులు చేపట్టేందుకు సిద్ధమవుతుండటం.. నిజంగా పట్టణ ప్రజల నీటి సమస్య తీర్చడానికేనా.. అనే విమర్శలు స్థానికుల నుంచి విన్పిస్తున్నాయి. మెగా పథకంలో తాగునీరొస్తుంది కదా.. అప్పుడిచ్చే దానికైనా పనికొస్తాయిలే అంటుండటం విడ్డూరం కాక మరేమిటి.

మెగా తాగునీటి పథకం వస్తేనే...
- తిరుపతినాయుడు, డీఈఈ, గ్రామీణ నీటిసరఫరా విభాగం

ఉద్దానం మంచినీటి పథకం ఆధారంగా సోంపేట పట్టణానికి ఇంటింటా కొళాయిల ద్వారా నీటి సరఫరా చేయాలని భావించాం. మహేంద్రతనయలో ఆ మేరకు నీటిలభ్యత లేకపోవడంతో పట్టణానికి రోజుకి గంట కూడా ఇంటింటా కొళాయిల ద్వారా నీటిసరఫరా చేసేందుకు అవకాశాలు లేకపోయాయి. ఉద్దానం ప్రాంతం మొత్తానికీ ఉద్దేశించిన మెగా తాగునీటి పథకం ద్వారా అయినా నీటి సరఫరాకు వీలుగా చర్యలు చేపడుతున్నాం. రూర్బన్‌ పథకంలో భాగంగా మిగిలిన వీధుల్లో రూ.2 కోట్లతో ఇంటింటా కొళాయిలు పనులు త్వరలో ప్రారంభించనున్నాం.


గతంలో తలెత్తిన ఇబ్బందులతో....
- పిరియా విజయసాయిరాజ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌

గతంలో ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రూర్బన్‌ నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగపడలేదు. ఉద్దానం నీటి లభ్యతను అంచనా వేయకుండా చేపట్టిన పనుల మూలంగా నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మెగా తాగునీటి పథకం ద్వారా ఉపరితల జలాలు సోంపేట పట్టణ ప్రజలకూ ఇంటింటా కొళాయి ద్వారా అందిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని