logo

పోరాడుతాం..సాధించి తీరుతాం!

సిక్కోలు నగరం ఉద్యోగుల నినాదాలతో మంగళవారం మార్మోగింది. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి నిరసనలకు దిగాయి. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా శ్రీకాకుళం చేరుకున్న ఉద్యోగులు అసమ్మతి స్వరం వినిపించారు. ‘కొత్త పీఆర్సీని వెనక్కి తీసుకుని,

Updated : 26 Jan 2022 05:57 IST

స్పష్టం చేసిన ఉద్యోగ సంఘాలు

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌

కలెక్టరేట్‌ వద్దకు ర్యాలీగా చేరుకొని, నిరసన తెలియజేస్తున్న దృశ్యం

సిక్కోలు నగరం ఉద్యోగుల నినాదాలతో మంగళవారం మార్మోగింది. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి నిరసనలకు దిగాయి. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా శ్రీకాకుళం చేరుకున్న ఉద్యోగులు అసమ్మతి స్వరం వినిపించారు. ‘కొత్త పీఆర్సీని వెనక్కి తీసుకుని, పాత పీఆర్సీ, బకాయి పడ్డ డీఏలు చెల్లిస్తే చాలు’ అంటూ వారు చేసిన నినాదాలతో 80 అడుగుల రహదారి, కలెక్టరేట్‌ ప్రాంగణం మార్మోగింది. ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. దీన్ని అడ్డుకోవాలన్న పోలీసుల ప్రయత్నం సఫలం కాలేదు.

బారికేడ్లు దాటుకుని.. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఉద్యోగ సంఘాలన్నీ మంగళవారం ర్యాలీ, ధర్నాకి సిద్ధమైన నేపథ్యంలో వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. సూర్యనారాయణ మిల్లు కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకూ మూడంచెలుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరూ ఆ పరిసరాల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా వేల సంఖ్యలో ఉద్యోగులు అన్ని దారుల నుంచీ అక్కడికి చేరుకోవడంతో పోలీసులు కట్టడి చేయలేకపోయారు. మూడంచెల బ్యారికేడ్లను దాటుకుంటూ ఉద్యోగులు ర్యాలీగా కలెక్టరేట్‌ వరకూ వెళ్లారు.

నినాదాలు చేస్తున్న ఉద్యోగులు


దుష్ప్రచారాలు మానుకోండి

నిరసనల్లో పాల్గొన్న ఉద్యోగులకు వ్యతిరేకంగా కొందరు తమ అనుకూల వ్యక్తులతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికైనా ఉద్యోగులపై దుమ్మెత్తిపోసే దుశ్చర్యను ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు. చీకటి జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘పోరాడి తీరుతాం.. సాధించి తీరతాం..’, ‘పాత విధానమే ముద్ధు. కొత్త పీఆర్సీ వద్దు’ అంటూ గళమెత్తారు. నచ్చజెప్పే చర్చలకు పిలవొద్దని, అందుకు కమిటీలు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవం అనంతరం మండలాల్లో అధికారులకు వినతులిచ్చే కార్యక్రమాలకు అంతా హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27 నుంచి 30 వరకు ఎన్జీవో హోంలో జరగనున్న నిరసనల్లో అందరూ పాల్గొనాలన్నారు. ఫిబ్రవరి 3న ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


పంపించేందుకే ప్రయత్నాలు..

ర్యాలీని త్వరితగతిన పూర్తిచేసి వెళ్లిపోవాలని పోలీసులు మొదటినుంచీ ఉద్యోగులను హెచ్చరిస్తూనే వచ్చారు. రెండు గంటల్లో పూర్తిచేయాలని సంఘ నాయకులకు హుకుం జారీచేశారు. కలెక్టరేట్‌ వద్ద సంఘ నాయకులు ప్రసంగిస్తుండగానే మరోవైపు పోలీసులు తొందరపెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సంఘాల నాయకులు పలుమార్లు పోలీసులకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.


పోలీసుల అత్యుత్సాహం..

అడ్డుకుంటున్న పోలీసులు

వాంబేకాలనీ సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ కాలనీవాసులకు, వివిధ సమస్యలతో కలెక్టరేట్‌కు వచ్చిన వారికి ప్రవేశాలు నిలిపేశారు. కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన ఓ అంధురాలు ఎంత ప్రాథేయపడినా కనికరించలేదు. పరిచయస్తులను మాత్రమే అనుమతిస్తుండడంతో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని దారులనూ మూసివేయాలన్న కలెక్టర్‌ ఆదేశాలు మేరకు తాము పనిచేస్తున్నామని చెప్పడం కొసమెరుపు.


హామీలు అమలు చేయాలి

- చౌదరి పురుషోత్తంనాయుడు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర సహాధ్యక్షుడు

సీపీఎస్‌ రద్దు, సచివాలయ ఉద్యోగుల రెగ్యులైజేషన్‌ వంటి హామీలు ప్రభుత్వమే ఇచ్చింది. వాటిని అమలు చేయాలి. ప్రభుత్వానికి గాని, ముఖ్యమంత్రికి గానీ వ్యతిరేకంగా మేం లేము. డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే మా ఉద్దేశం.


వారికి గగనమే..

- హనుమంతు సాయిరాం, ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షులు, జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్‌

పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఇదే పంథాను కొనసాగిస్తే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఒక్క పీఆర్సీ అమలు కూడా గగనమమ్యే పరిస్థితి వస్తుంది. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమంలో ప్రతి ఉద్యోగి పాల్గొనాలి.


హెచ్‌ఆర్‌ఏకు కోతలు..

-కె.శ్రీరాములు, ఏపీ రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు

హెచ్‌ఆర్‌ఏలో కోతలు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో 24 గంటలు పనిచేయిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలి. సావధానమైన కోరికలు నెరవేర్చాలి.


సీపీఎస్‌ రద్దు చేయాలి

-పి.జయమ్మ, జిల్లా ఉద్యోగ సంఘం జిల్లాపరిషత్‌ విభాగం అధ్యక్షురాలు

పథకాలు, కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నాం. సెలవుల్లేకుండా పనిచేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తున్నాం. పాత పింఛనువిధానాన్ని కొనసాగిస్తూ సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి.


రివర్స్‌ పీఆర్సీ మాకెందుకు..

-కెళ్లి నారాయణరావు, పీఆర్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు, శ్రీకాకుళం

ఉద్యోగుల జీవన విధానాన్ని తలకిందులు చేసే రివర్స్‌ పీఆర్సీ మాకెందుకు. 30శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలి. చీకటి జీవోలను రద్దు చేసి, మా న్యాయపరమైన డిమాండ్లు అమలు చేయకపోతే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయక తప్పదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని