logo

గిరిసీమల్లో పుత్రశోకం!

సీతంపేట మండలం కుసిమికి చెందిన అయిదు నెలల బాలుడు ఈ నెల 23న రెస్పిరేటరీ అరెస్టు(శ్వాసకోస సమస్య)తో మృతిచెందాడు. కొత్తగూడకు చెందిన 105 రోజుల వయస్సు కలిగిన...

Published : 27 Jan 2022 06:12 IST

సీతంపేట, న్యూస్‌టుడే


సీతంపేటలో ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న చిన్నారులు

సీతంపేట మండలం కుసిమికి చెందిన అయిదు నెలల బాలుడు ఈ నెల 23న రెస్పిరేటరీ అరెస్టు(శ్వాసకోస సమస్య)తో మృతిచెందాడు. కొత్తగూడకు చెందిన 105 రోజుల వయస్సు కలిగిన మండంగి విక్రాంత్‌ గతేడాది డిసెంబరు 15న న్యుమోనియాతో మృతిచెందాడు.

వీరఘట్టం మండలం కొట్టుగుమ్మడకు చెందిన 24 రోజుల వయస్సు కలిగిన మగ బిడ్డ గతేడాది జులై 4న సైక్నోటిక్‌ హార్ట్‌ డిసీజ్‌తో చనిపోయాడు. ఎస్‌.గోపాలపురానికి చెందిన ఆరు నెలల వయసున్న కె.ప్రణీత్‌ గతేడాది జులై 16న మిల్క్‌ యాస్పిరేషన్‌తో మృతిచెందాడు. ఒకటా.. రెండా.. ఐటీడీఏ పరిధిలో సకాలంలో సక్రమ వైద్యం అందక.. అవగాహన లేమి కారణాలుగా శిశు, చిన్నారుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కన్న తల్లులకు గర్భశోకాన్ని మిగుల్చుతూనే ఉన్నాయి.

ఏం చేస్తే ప్రయోజనం..!

● ఎస్‌ఎన్‌సీయూలో వెంటిలేటర్‌ సౌకర్యం కల్పించాలి. ● నియోనెటాలజిస్టులు(నిపుణులు) ఉండాలి. కానీ ఎక్కడా ఆ పోస్టులు లేవు. కేవలం ఒక్క శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోనే ఉన్నారు. అన్ని పెద్ద ఆసుపత్రులు, ఎస్‌ఎన్‌సీయూ యూనిట్లు ఉన్న చోట వారి అవసరం ఉంది. ● గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం తీసుకోవడం, బిడ్డకు పాలిచ్చే విధానం, ఇతర ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించాలి. ● చాలా చోట్ల తల్లుల్లో రక్తహీనత వల్ల ఆ ప్రభావం పిల్లలపై పడుతోంది. నివారణ చర్యలు చేపట్టాలి.

ఎస్‌ఎన్‌సీయూల ఏర్పాటు చేసినా..

పూర్తిస్థాయిలో శిశు మరణాల నివారణే ధ్యేయంగా గత తెదేపా ప్రభుత్వం జిల్లాలోని సీతంపేట, పాలకొండ, కొత్తూరు, పాతపట్నం, టెక్కలి ఆసుపత్రుల్లో నవజాతి శిశు సంక్షేమ విభాగం(ఎస్‌ఎన్‌సీయూ) ఏర్పాటు చేసింది. ఇక్కడ సిబ్బంది కొరత కారణంగా ఆశించిన ప్రయోజనం కలగడంలేదు.

అవగాహన కల్పిస్తున్నాం...

మరణాల నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల ద్వారా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. గతంతో పోల్చితే మరణాలు కాస్త తగ్గాయి. చలి కాలం కావడంతో శ్వాసకోశ, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కొందరు ప్రైవేటు వైద్యులు ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్‌ ఇచ్చేస్తున్నారు. ఇది ప్రమాదకరం. నిపుణుల వద్దే వైద్యం పొందాలి.

- డా.నరేష్‌కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఐటీడీఏ, సీతంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని