logo

అనాసకు మద్దతు లభించేనా..!

సీతంపేట మన్యంలో కొద్ది నెలల్లో అనాస (పైనాపిల్‌) సీజన్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడక్కడా కాసిన పండ్లు కొద్దికొద్దిగా మార్కెట్లు, వారపు సంతలకు వస్తున్నాయి.

Published : 27 Jan 2022 06:12 IST


జగతిపల్లి వద్ద సాగుచేస్తున్న తోటలో కాసిన పండు

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట మన్యంలో కొద్ది నెలల్లో అనాస (పైనాపిల్‌) సీజన్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడక్కడా కాసిన పండ్లు కొద్దికొద్దిగా మార్కెట్లు, వారపు సంతలకు వస్తున్నాయి. గిరిజనులు పోడు వ్యవసాయంలో జీడి తోటలు, ఇతర తోటల్లో అనాసను అంతరపంటగా పండిస్తున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో సుమారు ఐదు వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. లెక్కల్లోకి రానిది మరికొంత ఉంటుంది. సుమారుగా 50 వేల టన్నుల పంట దిగుబడి వస్తుందని చెబుతున్నా అంతకంటే ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది. అధికారులు చొరవ తీసుకొని అనాస ప్రోసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తే మెరుగైన ఆదాయం వస్తుందని గిరిజనులు అభిప్రాయపడుతున్నారు.

గిరాకీ అధికం.. సీతంపేట మన్యంలో 90 శాతం, భామిని, కొత్తూరు, ఎల్‌.ఎన్‌.పేట, బూర్జ, పాతపట్నం, హిరమండలం, మందస, మెళియాపుట్టి తదితర గిరిజన మండలాల్లోనూ సాగుకు చర్యలు చేపడుతున్నారు. సేంద్రియ పద్ధతిలో పండటంతో మన్యం అనాసకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటుంది. ఇక్కడి నుంచి మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్తుంది. సింహాచలం రకం అధికంగా సాగు చేస్తుండగా గిరిజనులకు మేలు కలిగించే క్యూ రకాన్ని కొన్నేళ్ల క్రితం అధికారులు ఆ ప్రాంతానికి పరిచయం చేశారు.


సీతంపేట సంతలో విక్రయానికి తీసుకొచ్చిన అనాస

ప్రోసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పితేనే.. మార్చి, ఏప్రిల్‌ నుంచి మన్యం అనాస భారీగా మార్కెట్‌కు రానుంది. వర్షాకాలం వరకు పంట ఉంటుంది. ఈలోగా ప్రోసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తే గిరిజనులకు ఎంతో మేలు కలుగుతుంది. ఏటా పంట భారీగా సంతలకు వచ్చే సమయంలో ధర పతనమై గిరిజనులు నష్టపోతున్నారు. కొన్నిసార్లు ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేసి తరలించే ఏర్పాట్లు చేస్తున్నా, అవి తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తున్నాయని చెబుతున్నారు. ప్రోసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పితే జ్యూస్‌, జామ్‌ వంటివి తయారుచేసేందుకు వీలు కలిగి పంటకు గిట్టుబాటు ధర వస్తుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని గిరిబిడ్డలు కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపాం.. సీతంపేటలో రూ.5 కోట్లతో అనాస ప్రోసెసింగ్‌ కేంద్రం ఏర్పాటుకు ఐటీడీఏ పీవో ద్వారా కలెక్టరుకు ప్రతిపాదనలు పంపాం. భూసేకరణ, అగ్రిమెంట్లు వంటివి జరుపుతున్నాం. సీతంపేట ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ ఏర్పాటు చేశాం. యూనిట్‌ మంజూరైతే ట్రైఫెడ్‌ నుంచి నిధులు, విశాఖపట్టణానికి చెందిన డాన్‌ ఫౌండేషన్‌ వారి ద్వారా ఇంప్లిమెంటేషన్‌ జరగనుంది. మన్యంలో ప్రోసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటైతే గిరిజనులకు మేలు జరుగుతుంది.

- బి.నారాయణరావు, ఏపీడీ, వైఎస్సార్‌ క్రాంతి పథం, టి.భవానీశంకర్‌, ఇన్‌ఛార్జి పీహెచ్‌వో, సీతంపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు