logo

ఆరుతడి వైపు.. రైతుల చూపు

ఈ ఏడాది రబీ సాగుపై అధికారులు చూపించిన చొరవ రైతులకు ఫలితం ఇవ్వనుంది. ఈ రబీలో మడ్డువలస ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రైతులంతా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు.

Published : 27 Jan 2022 06:20 IST


మడ్డువలస ప్రధాన కాలువలో ప్రవహిస్తున్న సాగునీరు

సంతకవిటి, న్యూస్‌టుడే: ఈ ఏడాది రబీ సాగుపై అధికారులు చూపించిన చొరవ రైతులకు ఫలితం ఇవ్వనుంది. ఈ రబీలో మడ్డువలస ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రైతులంతా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. అధికారుల చైతన్య కార్యక్రమాలు, ప్రాజెక్టు ద్వారా విడతల వారీగా సాగునీరు అందిస్తుండటమే దీనికి కారణం. దీంతో మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, రాగులు, ఇతర అపరాలు సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు.

మడ్డువలస ప్రాజెక్టును 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేశారు. నాటినుంచి వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల్లోని 24,700 ఎకరాలకు ఖరీఫ్‌కే సాగునీరు అందేది. ప్రాజెక్టులో నీటినిల్వ తక్కువ ఉందని, కాలువలు మరమ్మతు చేయాలనే కారణాలు చూపించి రబీలో విడుదల చేసేవారు కాదు. ఈసారి రబీ పూర్తయ్యే వరకు కాలువలకు మరమ్మతులు చేయరాదని కలెక్టరు ముందుగానే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టులో 65 మీటర్ల మేర నీటినిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎకరాలో అపరాలు పండిస్తే 2-3 బస్తాలు మాత్రమే దిగుబడి, రూ.10 వేలలోపే ఆదాయం వస్తుంది. అదే ఎకరాలో మొక్కజొన్న వేస్తే రూ.45 వేల వరకు వచ్చే అవకాశం ఉందని అన్నదాతలు చెబుతున్నారు.

పుష్కలంగా భూగర్భజలాలు..

మడ్డువలస కాలువల్లో సాగునీరు వస్తుండటంతో రైతులు పంటలకు ఆరుతడులు అందించి మిగిలిన నీటిని చెరువుల్లో నిల్వ ఉంచుతున్నారు. దీంతో చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. మరోవైపు భూగర్భజలాలు పది అడుగుల లోపే ఉంటున్నాయి. వేసవిలో పశువులకు తాగునీటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది.

పంట ఏపుగా పెరిగింది...

గతంలో వరిపంట తరువాత మొట్ట భూములన్నీ వృథాగా విడిచి పెట్టేవాళ్లం. ప్రస్తుతం కాలువలు ద్వారా సాగునీరు ఇస్తుండటం, అధికారుల ప్రోత్సాహంతో మొక్కజొన్న వేస్తున్నాం. ప్రస్తుతం పంట ఏపుగా పెరిగింది. అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. - పి.గోవిందరావు, రైతు

ఏప్రిల్‌ వరకూ నీరందిస్తాం...

రబీలో ఆరుతడి పంటలకు సాగునీరు అందిస్తున్నాం. గతంలో నిరుపయోగంగా ఉన్న భూములు నేడు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఏప్రిల్‌ రెండోవారం వరకూ సాగునీటిని దఫదఫాలుగా అందించాలని నిర్ణయించాం. అంతేగాకుండా వచ్చే ఖరీఫ్‌నకు జూన్‌ నెలలోనే సాగునీరు అందించాలని లక్ష్యంతో ఉన్నాం.

- నర్మదాపట్నాయక్‌, డీఈఈ, మడ్డువలస ప్రాజెక్టు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని