logo

భవితకు పునాది వేసేందుకు...

విద్యార్థులు భవిష్యత్తుపై ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు అమలు చేయనున్నారు.

Published : 27 Jan 2022 06:20 IST

 

విద్యార్థులకు పంపిణీ చేయనున్న పుస్తకం

శ్రీకాకుళం విద్యావిభాగం, గార, న్యూస్‌టుడే: విద్యార్థులు భవిష్యత్తుపై ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు అమలు చేయనున్నారు. జిల్లాలోని 60 వేల మంది 9, 10 పదోతరగతి విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. అందులో భాగంగా విద్యార్థులకు జీవననైపుణ్యంతో పాటు వృత్తి మార్గదర్శకాలను వివరించేందుకు ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు డైట్‌ ప్రిన్సిపాల్‌ డా.ఎస్‌.తిరుమల చైతన్య పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం డివిజన్‌కు గురజాడ విద్యాసంస్థల్లో, టెక్కలి డివిజన్‌కు పలాసలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాల, పాలకొండకు సంబంధించి తమ్మినాయుడు కళాశాలలో శిక్షణలు ఉంటాయి. మొత్తం 474 మంది ఉపాధ్యాయులు(స్ట్రాంగ్‌ టీచర్లు) హాజరుకానున్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇచ్చే శిక్షణల్లో పదో తరగతి తరవాత ఏఏ రంగాలను ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి అవకాశాలుంటాయి.. ఆసక్తి ఉన్న కోర్సును ఎంపిక చేసుకునేందుకు ఏం చేయాలనేదానిపై దిశానిర్దేశం చేస్తారు. ప్రతి విద్యార్థికీ ఒక పుస్తకాన్ని అందజేస్తారు.

అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో అమలు..: ప్రతి విద్యార్థికి కెరీర్‌ గైడెన్సుకు సంబంధించిన పుస్తకం, ఉపాధ్యాయునికి కరదీపిక ఇస్తాం. శిక్షణా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఉపాధ్యాయులు ఆ కరదీపికను తీసుకువెళ్లాలి. పాఠశాలకు మూడు పోస్టర్లు అందుతాయి. దీనిని చక్కగా వినియోగించి విద్యార్థుల భవిష్యత్తుకు స్ట్రాంగ్‌ టీచర్లు, ప్రధానోపాధ్యాయులు పునాది వేయాలి. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో ఈ కార్యక్రమం అమలు చేస్తాం.

- బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి, ఆర్‌.జయప్రకాశ్‌, ఏపీసీ, సమగ్రశిక్ష

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని