logo

రైతుల ‘సేతు’లతో నిర్మాణం

దశాబ్దాలుగా హామీలకే పరిమితమైన బారువ మేజర్‌ పంచాయతీలోని వంతెన నిర్మాణాన్ని అన్నదాతలు శ్రమదానంతో పాటు సొంతంగా నిధులు సమకూర్చుకొని పూర్తి చేశారు.

Published : 27 Jan 2022 06:20 IST


కొండిరేవు వద్ద ఏర్పాటు చేసుకున్న రహదారి

సోంపేట, న్యూస్‌టుడే: దశాబ్దాలుగా హామీలకే పరిమితమైన బారువ మేజర్‌ పంచాయతీలోని వంతెన నిర్మాణాన్ని అన్నదాతలు శ్రమదానంతో పాటు సొంతంగా నిధులు సమకూర్చుకొని పూర్తి చేశారు. పంచాయతీ ప్రజలు పొలాలు, మంచినీటి బావులకు వెళ్లాలంటే కొండిరేవు కాలువ దాటాలి. తీర ప్రాంతంలోని ఉప్పలాం, గొల్లూరు, మామిడిపల్లి, సిరిమామిడి పంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజలు ఈ మార్గంలోనే బారువ, సోంపేట వెళుతుంటారు. బారువలో ఉన్నతపాఠశాల, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో చదివే తీరప్రాంతం, ఉద్దానం గ్రామాల విద్యార్థులు, ఇతరులు ఆ కాలువ వద్ద ఇబ్బందులు పడేవారు. మూడు దశాబ్దాల కిందట వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి వదిలేశారు. ఆ తరువాత పనులు అటకెక్కాయి. మహేంద్రతనయపై వంతెన నిర్మాణంతో కొండిరేవు పనులు చేసేందుకు మూడేళ్ల క్రితం నాబార్డు నిధులు మంజూరయ్యాయి. ఎన్నికలు రావడం, తరువాత జరిగిన పరిణామాలతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోగా రైతులే ముందుకొచ్చి వంతెన ఏర్పాటు చేసుకున్నారు. ఎకరాకు కొంత మొత్తం అంటూ విరాళాలు సమకూర్చుకొని రూ.1.5 లక్షలతో పైగా పటిష్టమైన సేతువు, రోడ్డు నిర్మించారు. పాలకుల నిర్వాకంతో విసిగిపోయి చివరకు తామే నిర్మించుకున్నామని రైతుసంఘం నాయకుడు కర్రి సత్యం పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని