logo

పరిష్కారం దొరికేనా?

ఇప్పటికీ పలు ఆదివాసీ గ్రామాలకు కలుషిత జలాలే దిక్కు. మెట్టుగూడ వద్ద మంచినీటి పథకం పనులు ప్రారంభించినా అర్థాంతరంగా ఆగిపోయింది. పోషకాహారంలేక సకాలంలో వైద్యం అందక చిన్నారులు మృత్యువాతపడుతున్నారు. ఈ నేపథ్యంలో 1.66 లక్షల మంది గిరిజనులకు అమల వుతున్న పథకాలను సమీక్షించి వివిధ శాఖలను దిశానిర్దేశం చేయాల్సిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరిగి 28 నెలల తర్వాత శనివారం కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధ్యక్షతన జరగనుండడం ఆశావహమే.. నేతలంతా హాజరుకానున్న నేపథ్యంలో పలు సమస్యలపై ‘న్యూస్‌టుడే పరిశీలన’ ఇది.

Published : 29 Jan 2022 05:24 IST

28 నెలల తర్వాత ఐటీడీఏ పాలకవర్గ సమావేశం

సీతంపేటలో రూ.19.07 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి ఇది. రోజుకు సుమారు 200 మంది గిరిజనులు వైద్యం కోసం ఇక్కడకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని అప్‌గ్రేడ్‌ చేశారు. ఇంతటి అవసరమున్న దీని నిర్మాణం ఎంత వేగంగా సాగాలి. శంకుస్థాపన చేసి ఇప్పటికి 14 నెలలైనా దీని పరిస్థితి ఇది.

ఐటీడీఏ పరిధిలో అనాస ప్రధాన పంట.. ఐదువేల హెక్టార్లలో పండుతూ 50 వేల టన్నుల దిగుబడి ఇస్తోంది. అమ్ముకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లేవీ లేవు. దళారులు వీరి శ్రమను దోచుకుంటున్నారు. సుమారు 10 వేల హెక్టార్లలో సాగవుతున్న జీడి, పసుపు, సీతాఫలం, చింతపండు, ఉసిరి, చెట్టుపనస, మామిడి, అల్లం, అరటి, జామ, సపోట, తదితరాలదీ ఇదే పరిస్థితి. కొన్నింటిని కొద్ది మొత్తంలో మాత్రమే జీసీసీ కొనుగోలు చేస్తోంది. ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టాలని ఏళ్లుగా డిమాండు చేస్తున్నా పట్టించుకునేదెవరు?

సీతంపేట, న్యూస్‌టుడే

ఇప్పటికీ పలు ఆదివాసీ గ్రామాలకు కలుషిత జలాలే దిక్కు. మెట్టుగూడ వద్ద మంచినీటి పథకం పనులు ప్రారంభించినా అర్థాంతరంగా ఆగిపోయింది. పోషకాహారంలేక సకాలంలో వైద్యం అందక చిన్నారులు మృత్యువాతపడుతున్నారు. ఈ నేపథ్యంలో 1.66 లక్షల మంది గిరిజనులకు అమల వుతున్న పథకాలను సమీక్షించి వివిధ శాఖలను దిశానిర్దేశం చేయాల్సిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరిగి 28 నెలల తర్వాత శనివారం కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధ్యక్షతన జరగనుండడం ఆశావహమే.. నేతలంతా హాజరుకానున్న నేపథ్యంలో పలు సమస్యలపై ‘న్యూస్‌టుడే పరిశీలన’ ఇది.

ఐదో షెడ్యూల్డ్‌లో చేర్చాలని..

50 శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న 776 గ్రామాలను ఐదో షెడ్యూల్డ్‌ ప్రాంతంలో చేర్చాలని ప్రతిపాదనలున్నాయి. ప్రస్తుతం సీతంపేట మండలం మాత్రమే ఈ ప్రాంతంలో ఉంది. ఎక్కువ గిరిజన గ్రామాలు నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఉండడంతో విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర వాటితో పాటు గిరిజన చట్టాల అమల్లో ఈ ప్రాంత గిరిజనులు నష్టపోతున్నారు. * కొన్నేళ్లుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాకు చెందిన 13 మందిని పొట్టన పెట్టుకున్నాయి. పంటలు, పండ్లతోటలూ ధ్వంసం చేస్తున్నాయి. దీన్ని పరిష్కరించాలి.

కీలక పోస్టులు ఖాళీ

కీలకమైన పీహెచ్‌వో, డిప్యూటీ డీఈవో, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఈఈ, వైఎస్సార్‌ క్రాంతిపథం ఏపీడీ, వాటర్‌షెడ్‌ ఏపీడీ, తదితర పోస్టుల్లో పూర్తి అదనపు బాధ్యతలు, ఇన్‌ఛార్జులతో కాలం వెల్లదీస్తున్నారు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ విభాగంలో రెండు డీఈ, రెండు ఏఈ, సీనియర్‌ సహాయకులు రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

* పీహెచ్‌సీలలో 10, కొత్తూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 5, సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రిలో 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 31 రకాల పోస్టులకు సంబంధించి 860 మంది ఉండాల్సి ఉండగా రెగ్యులర్‌లో 332 మంది పని చేస్తున్నారు. 250 మంది ఒప్పంద, 69 మంది పొరుగుసేవల కింద పనిచేస్తున్నారు. అప్పటికీ 209 పోస్టుల ఖాళీలు వైద్య సేవలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

చర్చించి నిర్ణయం..

2019 సెప్టెంబరులో పాలకవర్గ సమావేశం జరిగింది. కొవిడ్‌ కారణంగా అనంతరం నిర్వహించలేకపోయాం. కలెక్టరు సూచనల మేరకు శనివారం నిర్వహించనున్నాం. అజెండా ప్రాప్తికి సమావేశంలో చర్చిస్తాం. విద్య, వైద్యం, ఉపాధిహామీ ఇలా ప్రాధాన్యమున్న అన్ని శాఖలకు సంబంధించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం.

-బి.నవ్య, పీవో, ఐటీడీఏ, సీతంపేట

మరికొన్ని..

* ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో గతంలో ఓ సంస్థ ఆధ్వర్యంలో పనిచేసిన 173 మంది హెల్త్‌ వాలంటీర్లను రెన్యువల్‌ చేయాలని కోరుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. నాల్గో తరగతి ఉద్యోగుల కొరత వేధిస్తోంది. దీంతో విద్యార్థులకు వండిపెట్టడానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. * ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి గిరిజన నిరుద్యోగ యువతకు ఆదుకోవాలి. * ఉపాధి హామీ పథకం పెండింగ్‌ బిల్లులు రూ.47 కోట్లున్నాయి. * అనేక గిరిజన గ్రామాల రహదారులు పాడయ్యాయి. * జీసీసీ సేవలు విస్తృతం చేయాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని