logo

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం

స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక దిగులు చెందుతున్న యువత ఓ గోడ పత్రికను చూసి ఆకర్షితులయ్యారు. మంచి జీతంతో దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని.....

Published : 29 Jan 2022 05:24 IST


ఇచ్ఛాపురంలో విమాన టిక్కెట్లు చూపిస్తున్న బాధితులు

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక దిగులు చెందుతున్న యువత ఓ గోడ పత్రికను చూసి ఆకర్షితులయ్యారు. మంచి జీతంతో దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెబితే నమ్మి డబ్బులు చెల్లించారు. సదరు ఏజెంట్‌ వసూలు చేసిన సొమ్ముతో సహా ఉడాయించడంతో మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురం మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో గతేడాది డిసెంబరులో విదేశీ ఉద్యోగాలకు సంబంధించిన గోడ పత్రికలు అతికించారు. మండలంతోపాటు ఒడిశా సరిహద్దు ప్రాంతానికి చెందిన కొందరు యువత ఆ పత్రికల్లో ఉన్న ఫోన్‌ నంబరును సంప్రదించారు. దుబాయ్‌లోని ప్రైవేటు కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నెలకు సుమారు రూ.45 వేల వరకు జీతం వస్తుందని ఏజెంట్లు నమ్మించారు. విశాఖపట్నం కేంద్రంగా కేరళకు చెందిన ఓ వ్యక్తి ఈ తతంగం నడిపించాడని బాధితులు వాపోయారు. మెడికల్‌, విమాన ప్రయాణ ఖర్చులతో పాటు ఇతర ఖర్చులకుగాను ఒక్కో వ్యక్తి నుంచి సుమారు రూ.60 వేల చొప్పున మొత్తం రూ.24 లక్షలు వసూలు చేశారు. ఈ నెల 28న ఓ కంపెనీ తరఫున 12 మందిని, 30న మరో కంపెనీ తరఫున 33 మందిని దుబాయ్‌ తీసుకెళ్తామని నమ్మించారు. ఈ నెల 25న బాధితుల చరవాణులకు వచ్చిన మెసేజ్‌ ఫేక్‌ అని తేలడంతో ఏజెంట్‌కు ఫోన్‌ చేశారు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో విశాఖపట్నం వెళ్లగా అప్పటికే కార్యాలయానికి తాళాలు వసూలు చేసిన సొమ్ముతో పరారైనట్లు తెలిసి లబోదిబోమన్నారు. అనంతరం విశాఖపట్నంలోని నాలుగో పట్టణ పోలీసులకు, ఇచ్ఛాపురం గ్రామీణ పోలీసు స్టేషన్‌లోను ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని