logo

అవసరం 104.. ఉన్నది 34

జిల్లాలోని గ్రంథాలయాలను సిబ్బంది కొరత వేధిస్తోంది. కేంద్రగ్రంథాలయంతో పాటు వివిధ మండలాల్లో మొత్తం 44 శాఖాగ్రంథాలయాలున్నాయి. వాటిల్లో 104 మంది శాశ్వత ఉద్యోగులు అవసరంకాగా...

Published : 29 Jan 2022 05:24 IST

గ్రంథాలయాలను వేధిస్తున్న సిబ్బంది కొరత

ఇది శ్రీకాకుళంలోని కేంద్ర గ్రంథాలయం. ఇక్కడకు నిత్యం సుమారు 500-600 మంది పాఠకులు వస్తుంటారు. ఉన్న అరకొర సిబ్బందితో ఏళ్లుగా దీన్ని నిర్వహిస్తున్నారు. గేడ్‌- 2 గ్రంథాలయాధికారి, రికార్డు అసిస్టెంట్‌, మూడు అటెండర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం కాపలాదారూ లేకపోవడం శోచనీయం.

శ్రీకూర్మం శాఖా గ్రంథాలయాధికారి మూడేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి ఇన్‌ఛార్జి పాలనలోనే కొనసాగుతోంది. ఆయన వారానికోమారు వచ్చి వెళ్తుంటారు. నిత్యం అక్కడి సహాయకుడే మిగిలిన నిర్వహణ బాధ్యతలూ చూస్తున్నారు.

శ్రీకాకుళం సాంస్కృతికం, పొందూరు, న్యూస్‌టుడే: జిల్లాలోని గ్రంథాలయాలను సిబ్బంది కొరత వేధిస్తోంది. కేంద్రగ్రంథాలయంతో పాటు వివిధ మండలాల్లో మొత్తం 44 శాఖాగ్రంథాలయాలున్నాయి. వాటిల్లో 104 మంది శాశ్వత ఉద్యోగులు అవసరంకాగా... కేవలం 34 మందే ఉన్నారు. మరో 14 మంది పొరుగు సేవలు ఉద్యోగులు అక్కడకక్కడా పని చేస్తున్నారు. కొన్నిచోట్ల అసలు గ్రంథాలయ నిర్వహణ చూసే అధికారులే లేరు. మురపాక, సంతకవిటి, టెక్కలి, శ్రీకూర్మం, మెళియాపుట్టి, కొత్తూరు, బూర్జ గ్రంథాలయాలు ఇన్‌ఛార్జుల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం రికార్డు అసిస్టెంట్లు, సహాయకులతోనే నడిపిస్తున్నారు. సుమారు 70 వరకు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. దీని ద్వారా గ్రంథాలయాల అభివృద్ధీ కుంటుపడుతోంది. కొందరు ఈ రెండు, మూడు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా... ప్రభుత్వం వారికి రెండేళ్లు పెంచడంతో కొనసాగనున్నారు. ఇటీవల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలిని నియమించారు. ఇప్పటికైనా విజ్ఞాన భాండాగారాల్లో తిష్ఠ వేసిన సమస్యలకు పరిష్కారం చూపాలని అంతా కోరుతున్నారు.

నెలకొన్న ప్రధాన ఇబ్బందులివీ...

* నాలుగైదు చోట్ల తప్ప ఏ గ్రంథాలయం వద్దా మరుగుదొడ్లు లేవు. నీటి సౌకర్యమూ అంతంతమాత్రమే. * పుస్తకాలు చదువుకునేందుకు, భోజనాలు చేసేందుకు గదులు, వాహనాలు నిలిపేందుకు పార్కింగ్‌ స్థలం లేకపోవడంతో పాఠకులు ఇబ్బంది పడుతున్నారు. * గ్రంథాలయానికి స్థానిక సంస్థల నుంచి సుమారు రూ.5 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉన్నా పట్టించుకునేవారే కరవయ్యారు. * పది గ్రంథాలయాల్లో అంతర్జాలం ఉన్నప్పటికీ మూడు, నాలుగు చోట్లే కంప్యూటర్లు పని చేస్తున్నాయి. * కేంద్ర గ్రంథాలయానికి వచ్చే అభ్యర్థులు భోజనం చేసేందుకు వసతి లేక పక్కనే ఉన్న తితిదే కల్యాణమండపంలోకి వెళ్తున్నారు.

ఉన్నతాధికారులకు నివేదించాం...

గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఉండటంతో ఆశించినస్థాయిలో అభివృద్ధి జరగట్లేదు. స్థానిక సంస్థల నుంచి రావాల్సిన పన్ను బకాయిలు కూడా వసూలు కావడం లేదు. దీంతో చాలా చోట్ల మౌలిక వసతుల కల్పించలేకపోతున్నాం. ఈ సమస్యలన్నింటినీ ఉన్నతాధికారులకు నివేదించాం.

- కె.కుమార్‌రాజా, గంథాలయసంస్థ జిల్లా కార్యదర్శి

ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా..

జిల్లాలో గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాను. ఇటీవల కేంద్ర గ్రంథాలయంలో సమావేశం నిర్వహించాం. చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై తీర్మానం చేశాం. వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తాం.

- సువ్వారి సువర్ణ, జిల్లా గ్రంథాలయసంస్థ అధ్యక్షురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు