logo

Andhra News: ఎంత పని చేశావమ్మా?

భార్యాభర్తల మధ్య జరిగిన తగాదా మూడు నిండు ప్రాణాలను బలిగొంది. భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తాను చనిపోతే పిల్లలు ఏమైపోతారోనని వారిద్దరినీ చంపేసింది...

Updated : 07 Mar 2022 07:09 IST

ఇద్దరి పిల్లలతో సహా వివాహిత బలవన్మరణం

 న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తా విభాగం

నాన్న... నువ్వు ఎప్పుడొస్తావని అమ్మను అడిగితే చెప్పేది కాదు... తాతయ్య ఏమో వస్తారు అనేవాడు... ఫోన్‌ చేసినప్పుడు నిన్ను రమ్మంటే... మీకు అమ్మే కావాలిగా అక్కడే ఉండండి అనేవాడివి... ఇంతకీ మేమిద్దరం ఏం చేశాం? అందరిలా తల్లిదండ్రులతో ఉండాలనుకున్నాం.. అది తప్పా.. ఎంత పని చేశావమ్మా? 

- ఆ చిన్నారులిద్దరి ప్రాణాలు తిరిగొచ్చి మాట్లాడే అవకాశం వస్తే ఇలాగే అడిగేవారేమో..

భార్యాభర్తల మధ్య జరిగిన తగాదా మూడు నిండు ప్రాణాలను బలిగొంది. భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తాను చనిపోతే పిల్లలు ఏమైపోతారోనని వారిద్దరినీ చంపేసింది. ఈ ఘటన శ్రీకాకుళం నగరంలో ఆదివారం జరిగింది. పోలీసులు, మృతురాలి తండ్రి యర్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నగరం దమ్మలవీధిలో నివాసముంటున్న పేర్ల ధనలక్ష్మి(27)కి గార మండలం పేర్లవానిపేటకు చెందిన లక్ష్మీనారాయణతో 12 ఏళ్ల కిందట వివాహమైంది. అయిదేళ్ల పాటు కాపురం చక్కగానే సాగింది. ఆ తరువాత వేధింపులు ఎక్కువకావడంతో ధనలక్ష్మి ఇద్దరు పిల్లలు సోనియా(11), యశ్వంత్‌(9)తో కలిసి ఏడేళ్ల కిందట తండ్రి మైలపల్లి యర్రయ్య ఇంటికి వచ్చేసింది. కాకినాడలో షిప్‌లో పని చేసే లక్ష్మీనారాయణ అప్పుడప్పుడు వచ్చి వీరిని చూసి వెళుతూ ఉండేవాడు. అప్పుడు కూడా ఇద్దరి మధ్య తగాదాలు జరుగుతుండేవి. ఏడాది నుంచి ఒక్కసారి కూడా భార్య, పిల్లలను చూసేందుకు రాలేదు. ఆదివారం ధనలక్ష్మి భర్తతో చరవాణిలో మాట్లాడింది. వారి మధ్య ఏమి సంభాషణ జరిగిందో గానీ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇద్దరు పిల్లలతో పాటు తాను ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందింది.

ఎంత చెప్పినా వినలేదు...

ధనలక్ష్మి తండ్రి మైలపల్లి యర్రయ్య ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక ఓ ప్రయివేట్‌ బస్సు డ్రైవర్‌గా వెళ్తున్నారు. ఆయన భార్య సీతమ్మ రోజూ ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకునేవారు. ఆదివారం ఆమె వత్సవలస జాతరకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కొంతకాలంగా భర్త తనను చూడటానికి రావట్లేదని, పిల్లలతో సహా ఏదో చేసుకుంటానని ధనలక్ష్మి అంటూ ఉండేదని, మేము మీకు అండగా ఉంటాం.. అలాంటి ఆలోచనే పెట్టుకోవద్దని ఎంత చెప్పినా వినలేదని యర్రయ్య బోరున విలపించారు. ముగ్గురు వేర్వేరు గదుల్లో ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర, ఒకటో పట్టణ సీఐ అంబేడ్కర్‌, ఎస్‌.ఐ. విజయ్‌కుమార్‌, ప్రవళ్లిక ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యర్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని