logo
Published : 20 May 2022 06:25 IST

గొలుసు దొంగలు బరితెగించారు..!

- న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తా విభాగం, ఇచ్ఛాపురం

చైన్‌ స్నాచర్స్‌.. సిక్కోలు ప్రజలను వణికిస్తున్నారు... ఒంటరైనా.. గుంపు అయినా తమకేం భయమన్నట్లు చెలరేగిపోతున్నారు... మహిళల మెడలో బంగారు ఆభరణాలే లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. పట్టపగలే రద్దీ ప్రాంతాల్లో సైతం తెంచుకుపోతున్నారు.. ఒకప్పుడు ఎక్కడో జన సంచారం లేని ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు జరిగేవని వినేవాళ్లం.. నేడు పట్టణాల్లో జనసంచారం ఉన్న చోటే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు.. ఒక్క గురువారమే రెండుచోట్ల ఆభరణాలు ఎత్తుకెళ్లగా, మరోచోట విఫలయత్నం చేశారు..

జిల్లాలో చైన్‌స్నాచింగ్‌ ఘటనలు పోలీసులకు సవాలుగా మారాయి. వీటిని ఛేదించలేని పరిస్థితి నెలకొంది. శిరస్త్రాణం ధరించి, వాహనాలకు నంబరు ప్లేట్లు ఏర్పాటు చేయకుండా, ఏర్పాటు చేసినా దొంగ నంబర్లతో సంచరిస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల ఇటువంటి నేరాల్లో నిందితులు దొకరడంలేదు. ఏళ్ల కొద్దీ కేసులు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. ఎక్కడో ఇటువంటి కేసు నమోదైతే వాటి ఆధారంగా మన జిల్లాలో జరిగే కేసులను సరిపోల్చుతూ దొరికితే అప్పుడు పట్టుకుంటున్నారు.
అనుమానం రాకుండా ఇలా చొక్కాలు మార్చేశారు..

మాల్‌దా గ్యాంగ్‌గా అనుమానం..

గురువారం జరిగిన ఘటనలకు కోల్‌కతాకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్‌దా గ్యాంగ్‌ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఇటువంటి నేరాలకు పాల్పడుతుంటారు. వారు వినియోగించిన వాహనాల నంబరు ప్లేట్‌బోర్డులు ఓడీ అని చేతిరాతతోనే రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే రెండు బృందాలు ఒడిశా వెళ్లగా శనివారం మరో బృందం వెళ్లనున్నట్లు సమాచారం.

నిఘా అరకొరే..

జిల్లాలో ప్రధాన రహదారులు, కూడళ్లు, ప్రార్థనా మందిరాల వద్ద 611 వరకూ సీసీ కెమెరాలు గతంలో ఏర్పాటు చేశారు. వాటిలో చాలావరకూ పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. నగర పరిధిలో ప్రతి ముఖ్యకూడలి వద్ద 110 నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినా 26 వరకు పనిచేయడం లేదు. నిర్వహణ లోపాలే కారణమని తెలుస్తోంది. జిల్లాలో పెరుగుతున్న నేర సంస్కృతిని నిర్మూలించాలంటే నిఘా పటిష్టం చేయాల్సిన అవసరముంది.

గస్తీ ముమ్మరం చేస్తాం.....

పగటిపూట గస్తీ ముమ్మరం చేస్తాం. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు వేశాం. క్లూస్‌ టీమ్‌ ద్వారా వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే కొంతమేర వివరాలు రాబట్టాం. ప్రజలు బంగారు ఆభరణాలు ధరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

- ఎం.మహేంద్ర, డీఎస్పీ, శ్రీకాకుళం

ఘటనా స్థలంలో రోదిస్తున్న బాధితురాలు

శ్రీకాకుళం నగరంలో..

ఈ నెల 1న రాత్రి ఇద్దరు యువకులు ఓ ద్విచక్ర వాహనదారుడిని ఆపి ఇంటి వద్ద దింపేయాలంటూ కోరారు. వాహనదారుడు వారిని తీసుకెళుతుండగా నాగావళి నది సమీపంలో ఆయనపై ఇద్దరూ దాడి చేసి రూ.3 వేల నగదు, చరవాణి ఎత్తుకెళ్లారు.

గతేడాది ఎన్‌సీసీ కార్యాలయ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో పుస్తెలతాడును బండిపై వచ్చిన వ్యక్తి లాక్కెళ్లాడు.

శాంతినగర్‌కాలనీ సమీపంలో ఇదే తరహాలో ఘటన చోటు చేసుకుంది.

గత డిసెంబరులో దమ్మలవీధిలో బయట నిద్రిస్తున్న మహిళ మెడలో బంగారు వస్తువులు తెంచి పట్టుకుపోయారు. నగర పరిధిలో ఇటువంటి ఘటనలు ఎనిమిది వరకూ జరిగాయి.

 

జిల్లాలో..

జర్జంగి-జలుమూరు రోడ్డులో బుధవారం సూరమ్మ మెడలోని తులంన్నర తాడును ద్విచక్ర వాహనంపై వచ్చిన యువకులు లాగేసి వెళ్లిపోయారు.

2020 నవంబరు 27న ఆమదాలవలస పాలపోలమ్మ గుడివద్ద మహిళ మెడలోని 3 తులాల తాడు, అదేరోజు అయ్యప్పస్వామి ఆలయ సమీపంలోని మూడున్నర తులాల గొలుసు లాక్కెళ్లారు.

2021 మే 18న పార్వతీశంపేట సమీపంలోని వాణిస్కూల్‌ వద్ద 2 తులాల తాడు చోరీ చేశారు.

ఇటీవల వంశధార క్వార్టర్స్‌ వద్ద 2 తులాలు, కిల్లివారి క్వార్టర్స్‌ వద్ద తులంన్నర తాడు ఒకేరోజు అపహరించారు.

ఇచ్ఛాపురంలో గత దసరా రోజున ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతుల నుంచి 12 తులాల ఆభరణాలు తెంచుకుపోయారు.

గురువారం ఒక్క రోజే..వారే..!

ఉదయం 7 గంటల సమయంలో ఛత్రపూర్‌లో నలుగురు వ్యక్తులు ఒకేచోట రెండు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. అక్కడి నుంచి విడిపోయి ఇద్దరు ఒక వాహనంపై శ్రీకాకుళం వైపు రాగా, మిగిలిన వారు మరోవైపు వెళ్లారు.

శ్రీకాకుళం నగరంలో అత్యంత రద్దీగా సూర్యమహాల్‌ కూడలిలో 10.17 గంటలకు మహిళ మెడలో ఆభరణాలు లాక్కెళ్లారు.

ఇచ్ఛాపురం పట్టణంలో 12.30 గంటల సమయంలో మరొకరి మెడలో రెండు తులాల పుస్తెల తాడు దోచుకెళ్లారు.

ఒడిశా రాష్ట్రం ఛత్రపూర్‌లో 2.30 గంటల ప్రాంతంలో ఇదే తరహాలో చోరీకి పాల్ప డినట్లు సమాచారం.

నగరంలో పట్టపగలే చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి పోలీసులకే సవాలు విసిరారు. అరసవల్లి సమీపంలో గ్యాస్‌ గోదాము వద్ద కూడా ఓ మహిళ నుంచి ఆభరణాలు లాక్కెళ్లబోయి విఫలమయ్యారు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని