logo
Published : 20 May 2022 06:25 IST

ఆక్రమిస్తూ.. అధిక ధరలకు అమ్మేస్తూ..!

- న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం, గ్రామీణం

ఆక్రమణకు గురైన పట్టణంలోని పెద్ద చెరువు

ఆమదాలవలస పురపాలక సంఘంలో భూఆక్రమణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 254 వందలకుపైగా చెరువులు ఉన్నాయి. ఓ వైపు జనాభా పెరగడం... భూములకు అధిక ధరలు రావడంతో కొందరు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి బినామీలతో అమ్మిస్తున్నారు. చెరువు గర్భాలను కబ్జా చేసి వాటిని చదును చేసి, మొదట చిన్న రేకుల షెడ్డు వేసి, కొంత కాలం తరువాత పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కీలక దస్త్రాలు మాయం: భూములకు కీలకమైనవి రెవెన్యూ దస్త్రాలు, ఆమదాలవలస రెవెన్యూ శాఖలో మాత్రం కొన్ని దస్త్రాలు లేకపోవటంతో భూకబ్జాదారులు యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు దస్త్రాలు లేవనే నెపంతో చోద్యం చూస్తున్నారు. పట్టణ పరిధిలో 1-107 వరకూ సర్వే నంబర్లు ఉన్నాయి. వీటిలో 3 నుంచి 56 వరకూ ఉన్న సర్వే నంబర్లకు మాత్రమే అధికారుల వద్ద దస్త్రాలు ఉన్నాయి. 1,2,57-107 వరకూ సర్వే నంబర్లకు ఎఫ్‌ఎంబీలు మాత్రమే ఉన్నాయి. ఏవైనా భూసమస్యలు ఏర్పడితే రెవెన్యూ శాఖ వద్ద ఉన్న ఎఫ్‌ఎంబీతో పాటు ఎస్‌ఎల్‌ఆర్‌ కూడా ఉంటేనే వివాదం పరిష్కారం అవుతుంది. అటువంటి ముఖ్యమైన దస్త్రాలు కనిపించకుండాపోయి 18 ఏళ్లు గడుస్తుంది. గతంలో రెవెన్యూ శాఖలో సర్వేయరుగా పనిచేసిన వ్యక్తే ఈ కీలక దస్త్రాలు మాయం చేసి ఉండవచ్చుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆక్రమణల తీరు ఇదీ..

పట్టణంలోని పెద్ద చెరువు విస్తీర్ణం కేవలం 47.35 ఎకరాలే అని ఆన్‌లైన్‌ రికార్డులు చూపుతున్నాయి. వంద ఎకరాలకు పైగా పెద్ద చెరువు విస్తీర్ణం ఉండేదని స్థానికులు అంటున్నారు. మోనింగివారి వీధి సమీపంలో ఉన్న కనకాద్రి చెరువు విస్తీర్ణం 7 ఎకరాలు. ప్రస్తుతం ఆక్రమణలతో కనుమరుగైంది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉండటాన్ని ఆసరాగా తీసుకొని కొంత భూమిని ఆక్రమించి కొందరు భవన నిర్మాణాలు చేపట్టారు.

కృష్ణాపురం వద్ద ఉన్న కిల్లివాని చెరువు విస్తీర్ణం 20.50 ఎకరాలు ఉండగా ప్రస్తుతం సుమారు 5 ఎకరాల వరకు ఆక్రమణలు జరిగాయి.

పాలబంద చెరువు 15 ఎకరాలు ఉండగా సుమారు 8 ఎకరాల వరకు ఆక్రమణలు జరిగాయి. మొగిలి చెరువు 30.70 ఎకరాలు ఉండేది. ప్రస్తుతం దాదాపు కనుమరుగైంది.

అక్కివలస, అమ్మనగర్‌, బొడ్డేపల్లిపేట, వెంకయ్యపేట, లక్ష్మడుపేట, పార్వతీశంపేట, ప్రశాంతినగర్‌లోని ఉన్న ప్రభుత్వ స్థలాలను చదును చేసి కొందరు భవనాలు నిర్మించారు.

రహదారి పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌లపై కొందరు మెట్లు కట్టుకున్నారు. చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటుచేసి అద్దెకు ఇచ్చేశారు.

ప్రధాన కూడళ్లలో కాలువలపై బడ్డీలను ఏర్పాటుచేయడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి.

అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం...

పట్టణంలో కొన్ని చోట్ల అక్రమ నిర్మాణాలు ఉన్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న నిర్మాణాలను గుర్తించి వాటిపై ఉన్నతాధికారులకు తెలియపరుస్తాం. రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బంది కలిసి సంయుక్తంగా వాటిని తొలగిస్తాం.- ఎం.రవిసుధాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఆమదాలవలస

పట్టణ వివరాలిలా... జనాభా: 49,823 వార్డులు: 23 పట్టణ విస్తీర్ణం: 9.65 చదరపు కిలోమీటర్లు చెరువులు: 138 గృహాలు: సుమారు 11 వేలు

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని