logo
Published : 20 May 2022 06:25 IST

వేతనాలివ్వండి... వెతలు తీర్చండి!

 

డీఎంహెచ్‌వో మీనాక్షికి వినతిపత్రం అందిస్తున్న 108 ఉద్యోగులు

మూడునెలలుగా ఇబ్బందులు..
గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే గుర్తుకు వచ్చేది 108 వాహనమే. ఆ సిబ్బంది కూడా ఫోన్‌ చేసిన క్షణాల్లోనే స్పందించి సేవలందిస్తున్నారు. సకాలంలో ఆసుపత్రులకు చేర్చడం, బాధితులకు మార్గంమధ్యలో చికిత్స అందజేయడం వంటివి చేస్తూ అందరి విశ్వాసాన్ని దక్కించుకుంటున్నారు. ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. కొవిడ్‌ సమయంలోనూ వీరు రాత్రింబవళ్లు శ్రమించారు. వారు ప్రస్తుతం మూడు నెలలుగా జీతాలందక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇంటి అద్దె కూడా చెల్లించేందుకు సైతం సతమతమవుతున్నారు.

జిల్లాలో 108 వాహనాలు 40 ఉన్నాయి. ఒకొక్క దాంట్లో ఇద్దరు పైలెట్లు(డ్రైవర్లు)... ఇద్దరు ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్లు(ఈఎంటీ), ఒక రిలీవర్‌ రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. వీరందరికీ ఈ ఏడాది మార్చి నుంచి జీతాలు రాలేదు. గతంలో జీవీకే సంస్థలో ఉన్న వీరు రెండేళ్ల నుంచి అరబిందో సంస్థ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు. పాతవారు 150 మందికి అదనంగా 60 మంది కొత్తవారిని నియమించుకున్నారు. మొత్తం 210 మంది సేవలందిస్తున్నారు. వీరందరికీ అనుభవం ఆధారంగా జీతాలు చెల్లిస్తున్నారు. గత మూడు నెలలుగా వేతనాలందక పోవడంతో ఆర్థికంగా సతమతమవుతున్నారు. ఇటీవల కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షిలను కలిసి వినతి పత్రాలు అందించారు. ప్రభుత్వానికి సమస్యను నివేదించామని, త్వరలోనే పరిష్కారమవుతుందని డీఎంహెచ్‌వో తెలిపారు.

ఆందోళన చెందవద్ధు..

జిల్లాలో 108 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఆలస్యం కావడం వాస్తవమే. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి బిల్లులు విడుదల కాకపోవడమే. ఈ విషయాన్ని జీవీకే యాజమాన్యం పరిశీలిస్తోంది. త్వరలోనే జీతాలు జమ అవుతాయి. సిబ్బంది ఆందోళన చెందవద్ధు- నజీర్‌, మేనేజర్‌, 108, శ్రీకాకుళం

ఏడాదిగా ఎదురుచూపులు...

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: మెరుగైన శిక్షణ అందిస్తూ క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు పరితపించే జిల్లా క్రీడాప్రాధికార సంస్థ శిక్షకులు ఏడాదిగా జీతాలు కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబ పోషణకు అందినచోట అప్పులు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 22 మందికిగాను సుమారు రూ.41 లక్షల వరకు వేతనాలు రావాల్సి ఉంది. ఇటీవల జీతాలు అందక.. రెగ్యులర్‌ చేయడం లేదనే కారణంగా 30 ఏళ్ల పాటు పని చేసిన ఓ ఉద్యోగి విధుల నుంచీ తప్పుకొన్నారు. ఇప్పటికైనా చెల్లించాలని కోరుతున్నారు.

విడుదల కాని నిధులు...

గత వార్షిక బడ్జెట్‌ నుంచి జిల్లా క్రీడాప్రాధికార సంస్థకు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. వీటిలో కేవలం రూ.25 లక్షలు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన రూ.75 లక్షలు విడుదల చేయకపోవడంతో శిక్షకులు, సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోయారు. మార్చి నెలాఖరుతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు.

కొలిక్కిరాని సాంకేతిక సమస్య..

సాంకేతిక సమస్యతో వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇదే సమస్య తలెత్తినా నేటికీ పరిష్కారం కాలేదు. అప్పట్లో సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రభాకరరావు సిబ్బంది బిల్లులు పెట్టకుండానే వెళ్లిపోయారు. తరువాత బాధ్యతలు స్వీకరించిన బి.వి.ప్రసాదరావు డిజిటల్‌ సంతకం జనవరిలో చేయాల్సి ఉన్నా పని జరగలేదు. దీంతో మార్చిలో జరగాల్సిన చెల్లింపులు ఆగిపోయాయి.

త్వరలో చెల్లింపులు...

ఏడాదిగా డీఎస్‌ఏ శిక్షకులు, సిబ్బందికి వేతనాలు చెల్లింపులు జరగలేదన్నమాట వాస్తవమే. రెండు నెలలుగా వాటి కోసం ప్రయత్నిస్తున్నాం. దీనిపై శాప్‌ ఎండీ సానుకూలంగా స్పందించి బిల్లులు పెట్టమని సూచించారు. త్వరలో బిల్లులు అందేలా చూస్తామన్నారు. - ఎం.మాధురీలత, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకురాలు

క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్న డీఎస్‌ఏ శిక్షకులు

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని