logo

కలల సౌధం.. ఇంకెంత కాలం?

ఎన్నో సమస్యలు, విజ్ఞప్తులతో జిల్లా కేంద్రంలోని వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాలకు జిల్లా నలుమూలల నుంచీ వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు.. వీరి వ్యయప్రయాసలు తగ్గించాలనే ఉద్దేశంతో సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉంచి అన్ని సదుపాయా

Published : 24 May 2022 06:21 IST

బిల్లులు చెల్లించక నిలిచిన కలెక్టరేట్‌ సమీకృత భవనం

ప్రజలకు తప్పని ఇబ్బందులు


అసంపూర్తిగా నిలిచిన భవనం ఇదే..

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, కలెక్టరేట్‌ : ఎన్నో సమస్యలు, విజ్ఞప్తులతో జిల్లా కేంద్రంలోని వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాలకు జిల్లా నలుమూలల నుంచీ వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు.. వీరి వ్యయప్రయాసలు తగ్గించాలనే ఉద్దేశంతో సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉంచి అన్ని సదుపాయాలు కల్పించాలని భావించారు. పనులు ప్రారంభించి ఐదేళ్లు దాటుతున్నా నేటికీ అది అసంపూర్తిగానే మిగిలిపోయింది.. కార్యాలయాల మధ్య తిరిగేందుకు ప్రజలకు అవస్థలు తప్పలేదు.. నిర్మాణం పూర్తయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందనే ప్రశ్నకు సమాధానమూ లభించలేదు..

23 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేలా అప్పటి తెదేపా ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇందుకు తగ్గట్టుగానే బీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఇండియా సంస్థ పనులు దక్కించుకుని 2017లో పనులు ప్రారంభించింది. 2022 వచ్చినా ఇంకా పూర్తికాలేదు. భవన సముదాయాన్ని నాలుగు అంతస్తులు, 16 బ్లాకులుగా నిర్మిస్తున్నారు. 82 ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు ఇది శాశ్వత నిలయంగా మారనుంది. అంతా ఇక్కడి నుంచే సేవలందించనున్నారు. ప్రజలు నిమిషాల వ్యవధిలో అవసరమైన శాఖ కార్యాలయానికి వెళ్లి కావాల్సిన సేవలు పొందొచ్ఛు ఐఏఎస్‌ అధికారులను కలవాలన్నా ఇక్కడే అందుబాటులో ఉంటారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ల అంశం మరోసారి తెరపైకి వచ్చినా నిర్మాణం మధ్యలో ఆగిపోయిన దీని గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఒకేసారి ఎనిమిది సమీక్షలు చేయొచ్ఛు.

ప్రస్తుత కలెక్టరేట్‌లో కేవలం ఒకేఒక సమావేశ మందిరం ఉంది. ఒకసారి ఒక్క శాఖకు సంబంధించిన సమీక్ష చేసేందుకు మాత్రమే ఆస్కారముంది. సమీకృత కలెక్టరేట్‌ పూర్తయితే ఏకంగా ఎనిమిది సమావేశ మందిరాలు అందుబాటులోకి వస్తాయి. 300 సీట్ల సామర్థ్యంతో ఒకటి, వంద సీట్లతో 3, 75 సీట్లతో 2, 30 సీట్ల సామర్థ్యంతో 2 నిర్మిస్తున్నారు. అవసరమైతే ఎనిమిది హాళ్లలో ఒకేసారి ఎనిమిది సమీక్షలు నిర్వహించొచ్ఛు భవన నిర్మాణ పనులు 70 శాతం మాత్రమే పూర్తయ్యాయి.

ప్రస్తుత కలెక్టరేట్‌లో అధికారుల సమావేశానికి ఒకే ఒక్క గది ఉంది. 30 మందికి మాత్రమే అది సరిపోతుంది. పెద్ద సమీక్షలైతే జడ్పీ కార్యాలయానికి అధికారులంతా తరలి వెళ్లాల్సిన దుస్థితి. అత్యవసర పరిస్థితులొస్తే ఒకేసారి రెండు, మూడు సమావేశాలు నిర్వహించడం అసాధ్యం.

సమావేశపు గదైనా పూర్తి చేయండి

గుత్తేదారు సంస్థ రూ.56 కోట్ల విలువైన పనులకు బిల్లులు పెట్టగా రూ.43 కోట్లే విడుదలయ్యాయి. మిగిలిన బకాయిలు చెల్లిస్తేనే పునఃప్రారంభిస్తానని గుత్తేదారు సంస్థ స్పష్టం చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈలోగా కనీసం సమావేశపు మందిరాలైనా పూర్తిచేసి ఇవ్వాలని కోరుతున్నారు. దానికీ గుత్తేదారు ససేమిరా అంటున్నట్లు సమాచారం. మొత్తానికి బకాయిలు విడుదల చేస్తేనే పనులు ముందుకు కదులుతాయనేది అర్థమవుతోంది. ఈనేపథ్యంలో పనులు పూర్తయ్యేదెప్పుడో తెలియని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం : సమీకృత కలెక్టరేట్‌ భవనం పనులు మధ్యలో నిలిచిన విషయం వాస్తవమే. ఇటీవలే కొన్ని బకాయిలు విడుదలయ్యాయి. మిగిలినవి త్వరలో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈలోగా కనీసం మీటింగ్‌ హాల్‌ అయినా పూర్తిచేసి ఇవ్వాలని ప్రతిపాదించాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవగానే మిగతా పనులు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. - శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, కలెక్టరు

భవన నిర్మాణ విస్తీర్ణం : 23 ఎకరాలు

అంచనా వ్యయం : రూ. 116.50 కోట్లు

గుత్తేదారు సంస్థ: బీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఇండియ

గడువు కాలం: 2017-2019

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని