logo

మామిడి రైతుకు చెట్టంత కష్టం

మామిడి పంట అధికంగా సాగయ్యే జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. వేసవి వచ్చిందంటే చాలు ఊరూరా, ప్రధాన వీధుల్లో విక్రయాలకు మామిడి పండ్ల పోగులే దర్శనమిచ్చేవి. ఎక్కడ చూసినా మధుర ఫలాల సువాసనలే గుప్పుమనేవి. ఈసారి చెట్టుకోపుట్టకో కనిపిస్తున్నాయి.

Published : 26 May 2022 06:22 IST

వెంటాడిన ప్రకృతి వైపరీత్యాలు

నష్టాలతో కుదేలు

- న్యూస్‌టుడే, రణస్థలం

రణస్థలంలో ఇటీవల గాలులకు రాలిన మామిడికాయలు

మధుర ఫలంగా పిలిచే మామిడి ఈ ఏడాది అందనంత దూరంలో నిలిచింది.. వేసవిలో ఉక్కపోస్తే పండ్లు మగ్గే కాలమని పిలిచేవారు.. నేడు మగ్గేందుకు ఒక పండు కూడా లేకుండా పోయింది.. ఎక్కడపడితే అక్కడ సామాన్యులకు సరసమైన ధరలకే లభించే మామిడి ఎక్కువ రేటుకైనా కొందామన్నా లేకుండా పోయాయి.. కాలానుగుణ పండును రుచి చూద్దామని భావించినా దొరకని పరిస్థితి జిల్లాలో నెలకొంది. పండించిన రైతన్న నిలువునా మునిగిపోయాడు.

మామిడి పంట అధికంగా సాగయ్యే జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. వేసవి వచ్చిందంటే చాలు ఊరూరా, ప్రధాన వీధుల్లో విక్రయాలకు మామిడి పండ్ల పోగులే దర్శనమిచ్చేవి. ఎక్కడ చూసినా మధుర ఫలాల సువాసనలే గుప్పుమనేవి. ఈసారి చెట్టుకోపుట్టకో కనిపిస్తున్నాయి. జిల్లా విభజన తర్వాత దాదాపు 13,172 ఎకరాల్లో పంట సాగైంది. ఇతర రాష్ట్రాలకు సైతం ఇక్కడి నుంచి సరకు ఎగుమతయ్యేది. కానీ ఈసారి వాతావరణ పరిస్థితులు రైతును నిలువునా కూల్చేశాయి. ఏడాది పాటు రెక్కల కష్టమంతా కరిగిపోయింది. నష్టాల ఊబిలో చిక్కుపోయాడు.

ఎందుకీ పరిస్థితి..

సాధారణంగా మామిడి చెట్లకు పూత నవంబరు, డిసెంబరు నెలల్లో వస్తుంది. ఆ సమయంలో జిల్లాలో ఈసారి తుపాన్లు, అకాల వర్షాలు, ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. దీంతో పూత కాకుండా వాటి స్థానంలో కొత్త చిగుళ్లు వచ్చాయి. పిందెలు కాయాల్సిన జనవరి, ఫిబ్రవరి నెలల్లో మామిడి పూత పూసింది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా చీడపీడల బెడద ఎక్కువైంది. పూత నిలబడకపోవడంతో కాపు పూర్తిగా తగ్గిపోయినట్లు ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

గతంలో దిగుబడులు..

గతంలో మామిడి ఎకరాకు నాలుగు నుంచి ఐదు టన్నుల మేర దిగుబడి వచ్చేది. ఈసారి కొన్నిరకాల తోటల్లో ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు టన్నుల మధ్యనే వస్తోంది. కొన్ని రకాల్లో అయితే పది శాతం కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు, లీజుకు తీసుకున్న కౌలు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టన్ను ధర రూ.50 వేలు..

జిల్లాలో సాగు ద్వారా ఏడాదికి సరాసరి 60 వేల టన్నుల వరకు దిగుబడి వచ్చేది. టన్ను ధర రూ.35 వేల వరకు విక్రయించేవారు. ఈలెక్కన ఏడాదికి రూ.170 కోట్ల వరకు ఆదాయం ఆర్జించేవారు రైతులు. ఈసారి డిమాండ్‌ ఉండటంతో టన్ను రూ.50 వేల వరకు పలుకుతున్నా సరకు లేకుండా పోయింది. ఆదాయం రూ.70 కోట్ల వరకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తీవ్రంగా నష్టపోయిన వైనం..

సాధారణంగా జిల్లాలో మామిడి, జీడి తోటలను కౌలు రైతులు కొన్ని సంవత్సరాలకు లీజుకు తీసుకుంటారు. వాటి సాగు, సస్యరక్షణ చర్యలు చేపడతారు. వచ్చే పంటను విక్రయించుకుంటారు. ఒప్పందం మేరకు రైతులకు నగదు చెల్లిస్తారు. ఈఏడాది కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసలు రైతులు నిర్ణయించిన ధర చెల్లించే పరిస్థితి లేదని వాపోతున్నారు.

జీడి పంటదీ అదే దారి..

జిల్లాలో జీడిమామిడి పంట పరిస్థితి మామిడిలానే ఉంది. విభజిత జిల్లాలో 49,602 ఎకరాల్లో పంట పండిస్తున్నారు. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి ప్రాంతాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. జీడి ఎకరాకు 4 నుంచి 5 బస్తాలు దిగుబడి వచ్చేది. ఈ ఏడాది పూర్తిగా పోయింది.

42 ఎకరాలు కౌలుకు తీసుకున్నా..

నేను 12 ఏళ్లుగా 42 ఎకరాలు మామిడి లీజుకు తీసుకొని సాగు చేస్తున్నాను. ఎకరాకు ఏడాదికి రూ.8 వేలు చెల్లిస్తున్నాను. ఏటా పది లారీల మేర సరకు విక్రయించేవాళ్లం. రూ.18 లక్షలకు ఆదాయం వచ్చేది. ఈ ఏడాది ఒక లోడుకు కూడా దిగుబడి రాలేదు. ఎకరాకు దుక్కులు, ఎరువులు, సస్యరక్షణ చర్యలకు రూ.20 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈసారి తీవ్రంగా నష్టపోయాం. కొంతమంది రైతులు లీజు సొమ్ము తగ్గిస్తారు, కొందరు తగ్గించరు.

- మీసాల రమేష్‌, దేవరాపల్లి, మామిడి కౌలు రైతు

వాతావరణ పరిస్థితుల వల్లే...

ఈ ఏడాది నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్లే మామిడి పంటకు ఈ పరిస్థితి. దీనికితోడు చీడపీడలు దిగుబడులపై తీవ్రంగా ప్రభావం చూపాయి. రైతులు దారుణంగా నష్టపోయారు.

- రత్నాల వరప్రసాద్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి, శ్రీకాకుళం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని