logo

ఒకటి నుంచి మరో భారం

జిల్లా ప్రజలపై జూన్‌ 1 నుంచి మరో భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే రిజిస్ట్రేషన్‌శాఖ ఇంటి నిర్మాణపు విలువలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. గ్రామీణ, పట్టణ, నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి విలువలను పెంచేందుకు ప్రతిపాదనలను తయారు చేసింది.

Published : 28 May 2022 06:53 IST

ఇంటి నిర్మాణపు విలువ పెంపునకు సన్నాహాలు

న్యూస్ టుడే , బలగ (శ్రీకాకుళం )

జిల్లా ప్రజలపై జూన్‌ 1 నుంచి మరో భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే రిజిస్ట్రేషన్‌శాఖ ఇంటి నిర్మాణపు విలువలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. గ్రామీణ, పట్టణ, నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి విలువలను పెంచేందుకు ప్రతిపాదనలను తయారు చేసింది. పెంచిన విలువలు వచ్చే నెల నుంచే అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిపై ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లా రిజిస్ట్రార్లకు సంబంధిత ఉత్వర్వులు అందాయి. వీటిని అమలు చేసే పనిలో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు.

జిల్లాలో 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. వాటన్నింటి పరిధిలో నూతన విలువలు అమలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. అర్బన్‌ పరిధిలో అడుగు రూ.1,140 ఉన్న విలువ 1,200 చేయనున్నారు. గ్రామీణ ప్రాంతంలో రూ.730 నుంచి రూ.770, మేజరు పంచాయతీలో రూ.1,010 నుంచి రూ.1,060కు పెంచనున్నారు. రేకుల షెడ్లు, పెంకుటిళ్లకు ఇంతవరకు రూ.620 వసూలు చేసేవారు. ఇక నుంచి రూ.650 వరకు పెంచి తీసుకోనున్నారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యులపై ఇది మరింత భారం మోపనుంది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు...

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇంటి నిర్మాణపు విలువ పెరగనుంది. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఏ ప్రాంతంలో ఎంత పెంచాలో కూడా సూచించారు. ఆ మేరకు జూన్‌ 1 నుంచి నూతన విలువలను అమలు చేయనున్నాం.

- ఆర్‌.సత్యనారాయణ, జిల్లా రిజిస్ట్రార్‌, శ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని