logo

ఏటా నిర్లక్ష్యమే పారుతోంది

వంశధార.. జిల్లా అన్నదాతల జీవనధార.. దీనిపై ఆధారపడే అధికశాతం ప్రజలు పంట సాగు చేస్తున్నారు. నీరు సమృద్ధిగా ఉన్నా ఉపయోగించుకోలేని దుస్థితి. కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరందక ఏటా అన్నదాతలు అవస్థలు పడుతూనే ఉన్నారు. శివారు భూములకు నీటితడి అందటం గగనమే అవుతోంది.

Published : 28 May 2022 06:53 IST

దయనీయ స్థితిలో వంశధార కాలువలు

ఖరీఫ్‌లో శివారుకు సాగునీరు అనుమానమే..

న్యూస్‌టుడే, నరసన్నపేట

శిథిలావస్థకు చేరిన ఎడమ ప్రధానకాలువ

వంశధార.. జిల్లా అన్నదాతల జీవనధార.. దీనిపై ఆధారపడే అధికశాతం ప్రజలు పంట సాగు చేస్తున్నారు. నీరు సమృద్ధిగా ఉన్నా ఉపయోగించుకోలేని దుస్థితి. కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరందక ఏటా అన్నదాతలు అవస్థలు పడుతూనే ఉన్నారు. శివారు భూములకు నీటితడి అందటం గగనమే అవుతోంది. ఓ వైపు కాలువల అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల కాని పరిస్థితి, మరోవైపు ఉన్నవాటి చేసిన పనులూ పూర్తిచేయలేని దుస్థితి రైతులకు శాపంగా మారింది. 1977లో ఆవిర్భవించిన వంశధార కాలువల తలరాత నేటికీ పూర్తిస్థాయిలో మార్పులేదు. వచ్చే ఖరీఫ్‌లోనూ రైతన్నలకు నీటి కష్టాలు తప్పేలా లేవు..

వంశధార నదీపరివాహక ప్రాంతాల్లోని సాగునీటి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. దీనికితోడు గుర్రపుడెక్క ఏటా వేధిస్తూనే ఉంది. దీనిని తొలగించేందుకు పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతున్నా అరకొర చర్యలే తీసుకుంటున్నారు. ఏటా డెక్క ముంచుతూనే ఉంది. ఎడమ ప్రధాన కాలువ మరమ్మతులకు ఒక్క రూపాయి వెచ్చించడం లేదు. 2,400 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పటివరకు గరిష్ఠంగా 1,800 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. ఫలితంగా శివారు భూములకు సాగునీరు అందివ్వలేకపోతున్నారు.

టెక్కలి డివిజన్‌లో కాలువల పరిస్థితి మరింత దయనీయం. ఎడమకాలువ ఆధునికీకరణకు 2011లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.100 కోట్లు మంజూరుచేసినా విడుదలలో జాప్యం వల్ల పనులు ముందుకుసాగలేదు. పలుమార్లు పనుల అంచనాలు పెంచుతూ ప్రస్తుతం రూ.831 కోట్లకు చేరింది. ఇటీవల ఉపాధి నిధులతో రూ.16 కోట్లు మంజూరు చేసినా ఇంకా సాగుతున్నాయి.

నరసన్నపేట డివిజన్‌ పరిధిలో 2014లో ప్రభుత్వం ఓపెన్‌హెడ్‌ కాలువల ఆధునికీకరణకు రూ.74 కోట్లు ఇచ్చినా పూర్తిస్థాయిలో జరగలేదు. పోలాకి మండలంలోని సుసరాం తంపర భూముల అభివృద్ధికి రూ.13 కోట్లదీ అదే పరిస్థితి.

నరసన్నపేట, టెక్కలి డివిజన్లలో కేటగిరి ‘ఎ’ పద్దు కింద మంజూరు చేసిన నిధులతో రెండేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు రూ.9 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నా ముందుకు సాగకపోవడం గమనార్హం.

2008లో షట్టర్ల కుంభకోణం సాకుగా చూపి ఇప్పటికీ కాలువలపై షట్లర్లు ఏర్పాటు చేయలేదు. దీంతో దాదాపు అన్ని కాలువలపైనా షట్టర్ల సమస్య తీవ్రంగా ఉంది. కాలువలపై నీటి నియంత్రణ లేకపోవడంతో నీరంతా వృథా అవుతోంది.

 

పదిహేనేళ్లుగా షట్టర్ల సమస్యలు

నేను ఐదు ఎకరాల్లో కాలువల దిగువ ఆయకట్టును సాగు చేస్తున్నాను. 15 ఏళ్లుగా కాలువలపై షట్టర్లు లేక నీటి నియంత్రణ కరవైంది. కాలువలపై గడ్డివాములుపెట్టుకుని నీటిని పొలాలకు మళ్లించుకుంటున్నాం. ఎగువ రైతులు నీటిని సకాలంలో విడిచిపెట్టక దిగువ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈపరిస్థితుల నుంచి గట్కెక్కాలంటే వెంటనే షట్టర్లు ఏర్పాటుచేయాలి.- లావేటి మురళీ మోహనరావు, రైతు, తామరాపల్లి

అన్నిచర్యలు తీసుకుంటున్నాం..

వంశధార నదిలో నీటి లభ్యత మేరకు పూర్తిస్థాయిలో సాగు నీరందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే పలు కాలువలపై పనులు పూర్తి చేసుకొని ఖరీఫ్‌కు సమాయత్తం చేస్తున్నాం.

- డోల తిరుమలరావు, ఎస్‌ఈ, వంశధార ప్రాజెక్టు

దేశవానిపేట సమీపంలో కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని