logo

కరోనాతో తల్లి... అనారోగ్యంతో తండ్రి

కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న తల్లిని కరోనా రక్కసి బలి తీసుకుంది.. బాధ్యత తీసుకుంటాడనుకున్న తండ్రి అనారోగ్యంతో కన్నుమూశాడు. తల్లిదండ్రుల రెక్కల కష్టంతో సాగిన కుటుంబంలో మిగిలిన ఇద్దరు బాలికల బతుకు ప్రస్తుతం అగమ్యగోచరమైంది.

Published : 28 May 2022 06:53 IST

పది నెలల వ్యవధిలో కన్నుమూత

అనాథలైన బాలికలు

అనూష, ఈశ్వరి

న్యూస్‌టుడే, సోంపేట:కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న తల్లిని కరోనా రక్కసి బలి తీసుకుంది.. బాధ్యత తీసుకుంటాడనుకున్న తండ్రి అనారోగ్యంతో కన్నుమూశాడు. తల్లిదండ్రుల రెక్కల కష్టంతో సాగిన కుటుంబంలో మిగిలిన ఇద్దరు బాలికల బతుకు ప్రస్తుతం అగమ్యగోచరమైంది.

అండగా ఉంటా... చిన్నపాటి సహకారం అందిస్తే పిల్లలిద్దరికీ తాను అండగా ఉంటానని పిన్ని గంగా రూపవతి పేర్కొన్నారు. తాను కూడా బతుకు కోసం వలసకూలిగా ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేస్తున్నానని, అక్క చనిపోవడంతో పిల్లల పరిస్థితి గురించి ఆలోచనలో పడ్డానని, బావ కూడా మరణించడంతో హైదరాబాద్‌ నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నానని తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

కుదిపేసిన కరోనా.. బారువ గాంధీపేటకు చెందిన దవళ జ్యోతి పద్దెనిమిదేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన శ్రీనివాస చైనులు ప్రేమ వివాహం చేసుకొన్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. తల్లిదండ్రులు కాయకష్టంతో పిల్లలిద్దరినీ ఉన్నంతలో చక్కగానే చూసుకుంటూ చదివిస్తున్నారు. పిల్లలు చదువులో రాణిస్తుండడంతో కష్టాన్ని మరిచిపోయి తమకూ మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతో జీవిస్తూ వచ్చారు. సాఫీగా సాగుతున్న సంసారాన్ని కరోనా కుదిపేసింది. గతేడాది ఆగస్టులో జ్యోతి(40) మృత్యువాత పడింది. అన్నీ తానై కుటుంబాన్ని పోషిస్తున్న భార్య మరణంతో శ్రీనివాస చైనులు మరింతగా కుంగిపోయి తీవ్ర అనారోగ్యంతో రెండు రోజుల కిందట మృతిచెందాడు. తల్లి మరణించి పదినెలలు తిరగకముందే తండ్రిని కూడా కోల్పోయిన చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది.

చదువులు సాగేదెలా... అనూష సోంపేట మోడల్‌స్కూలులో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. ఈశ్వరి బారువలోనే ఏడో తరగతి పరీక్షలు రాసింది. ఎటువంటి ఆధారం లేని తాము ఇక ఎలా చదువుకోగలమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని