logo
Published : 24 Jun 2022 03:18 IST

ఉపాధి.. యథేచ్ఛగా పక్కదారి!

రికవరీ  చేయాల్సింది రూ.కోటిపైనే..
ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

ఎండలో కష్టపడుతున్నా వీరికి దక్కుతున్నది కొంతే

కంచిలిలో ఇటీవల జరిపిన సామాజిక తనిఖీలో  రూ.1,25,446 ఉపాధి నిధులు పక్కదారి పట్టినట్లు డ్వామా అధికారులు నిర్ధరించారు. వెంటనే తిరిగి చెల్లించాలని సంబంధిత సిబ్బంది, మేట్లను ఆదేశించారు. ఇంతవరకూ రికవరీ లేదు.


ఇచ్ఛాపురంలో రూ.63,741, టెక్కలిలో రూ.1,08,759 పక్కదారి పట్టాయని గుర్తించారు. ఇంతవరకు వీటి రికవరీ జాడే లేదు. జిల్లా వ్యాప్తంగా ఇంకా రూ.1.09 కోట్లు నిరుపేద వేతనదారులకు చెందాల్సిన మొత్తాన్ని రికవరీ చేయాల్సి ఉంది.

పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు కొంతైనా భృతి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. నిరుపేదలకు చెందాల్సిన దీన్ని కొందరు ఘనులు దొరికిన మేర స్వాహా చేసేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది, మేట్లు కుమ్మక్కై మరీ నిధులు కాజేస్తున్నారు. వారు దోచుకున్న దానిలో కొంత మండలస్థాయి అధికారులకీ వాటా వెళ్తుండడంతో వారూ కిక్కురుమనడంలేదు. జేబులు నిండుతుండడంతో క్షేత్రస్థాయిలో వారికెలాంటి తప్పులూ కన్పించడంలేదు. దీంతో నిధుల స్వాహా పర్వం యథేచ్ఛగా సాగిపోతోంది. సామాజిక తనిఖీల్లో ఈ తప్పులు బయటపడుతున్నా రికవరీ చేయలేకపోతున్నారు.

క్షేత్రస్థాయి సిబ్బంది హస్తం..
జిల్లాలో 5.3 లక్షలకు పైగా జాబ్‌కార్డులున్నాయి. వాటిలో పది లక్షల మందికిపైగా వేతనదారులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు సగం మంది ఉపాధి హామీ పథకం పనులపై ఆధారపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ పనులు పక్కాగా జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొందరు కూలీలు పని చేయకున్నా, అసలు స్థానికంగా లేకున్నా వారు పని చేసినట్లుగా లెక్కిస్తూ క్షేత్రస్థాయి సహాయకులు చూపిస్తున్నారు. వంద మంది పనిచేస్తే 120 మంది చేసినట్లు మస్తర్లు నమోదు చేస్తున్నారని నేరుగా కూలీలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. అందుకే తాము ఎంత కష్టపడి పనిచేసినా రోజువారీ కూలీ రూ.190 దాటడం లేదని వాపోతున్నారు.

విచారణలో డొల్లతనం..
పథకం అమలు తీరు, చేసిన పని, జరిగిన చెల్లింపులు ఇలా అనేక అంశాలపై సామాజిక తనిఖీలు జరుగుతాయి. ఏయే మార్గాల్లో నిధులు పక్కదారి పట్టాయనేది ఈ తనిఖీల ద్వారా తేటతెల్లమవుతుంది. ప్రతి చిన్న పనికీ ఎంబుక్‌ రికార్డులో నమోదు తప్పనిసరి. తనిఖీలు చేసినప్పుడు ఎన్ని నిధులు పక్కదారి పట్టిందీ తెలుస్తుంది. దాన్నీ నిరూపించలేని పరిస్థితి ఉంటోంది. ఇప్పటివరకూ రూ.5 కోట్లు నిధులు వివిధ రూపాల్లో దారి మళ్లాయని సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. కానీ రూ.2.8 కోట్ల రికవరీకి మాత్రమే విచారణ అధికారులు ఆదేశించారు. మిగిలిన రూ.2.2 కోట్లు ఏమయ్యాయో తెలియని దుస్థితి. ఈ విచారణ జరుగుతున్న విధానంలోనూ, పక్కదారి పట్టిన నిధులు నిర్ణయించే అంశంలోనూ గోల్‌మాల్‌ జరుగుతున్నట్లు కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సొమ్ము తిరిగి చెల్లించాల్సిందే...
- రోజారాణి, డ్వామా పీడీ

ఉపాధి పనుల్లో నిధులు పక్కదారి పట్టకుండా వ్యవస్థ పటిష్టం చేస్తున్నాం. సామాజిక తనిఖీలు, వ్యక్తిగత విచారణలతో అక్రమాల నిగ్గు తేలుస్తున్నాం. ఎలాంటి పక్షపాతం, ఒత్తిళ్లకు తలొగ్గకుండా రికవరీకి ఆదేశిస్తున్నాం. డబ్బులు చెల్లించని వారి ఆస్తులను రెవెన్యూ రికవరీ చట్టం కింద జప్తుచేసి చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయి తనిఖీలు, హాజరు నమోదు, చేసిన పనులకు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. ఎవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. పక్కదారి పట్టించిన సొమ్ము తిరిగి చెల్లించాల్సిందే.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని