logo
Updated : 24 Jun 2022 04:15 IST

అద్దె తక్కువ.. అక్రమం ఎక్కువ!

ఆలయాల దుకాణాల పేరుతో దందా!
-న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

ఇవి శ్రీకాకుళం నగరంలోని గుజరాతీపేట జగన్నాథస్వామి ఆలయానికి చెందిన దుకాణాలు. ఈ కోవెలకు మొత్తం 13 దుకాణాలున్నాయి. ఆలయానికి ఎదురుగా కొన్ని, హయాతీనగరం ప్రధాన మార్గంలో మరికొన్ని ఉన్నాయి. ఈ దుకాణాలకు వేలంపాటలు నిర్వహించి సుమారు 15 సంవత్సరాలవుతోంది. ఒక్కో దాని నుంచి నామమాత్రంగా రూ.850, రూ.460, రూ.550, రూ.700 ఇలా మొత్తం నెలకు రూ.6,090 వస్తోంది. వాస్తవానికి రూ.30 వేల వరకు వచ్చే అవకాశముంది. ఈ లెక్కన నెలకు రూ.24 వేలు, ఏడాదికి రూ.2.88 లక్షలు దేవస్థానం నష్టపోతోంది.

* తుమ్మావీధిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సమీపంలో 7, పెద్దపాడు రహదారిలోని స్థలంలో 25 దుకాణాలు ఉన్నాయి.

* అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి సుమారు 9 దుకాణాలున్నాయి. వీటన్నిటికీ నామమాత్రపు అద్దెలే వసూలు చేస్తున్నారు. వేలం పాట పెట్టి పెంచేందుకు అధికారులు ప్రయత్నించినా రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నట్లు తెలిసింది. దుకాణాలు ఖాళీ చేయమని ఈవో నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు.

దేవాదాయశాఖ అధికారుల ఉదాసీనత, రాజకీయనాయకుల జోక్యం వంటి కారణాలతో దేవుడి ఆదాయానికి గండిపడుతోంది. ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల దేవుని మాన్యాలు ఆక్రమణల చెరలో చిక్కుకున్నాయి. ఆలయ భూముల ద్వారా రావాల్సిన శిస్తులూ సక్రమంగా వసూలు కావడం లేదు. వీటితో పాటు ఆలయాలకు ఉన్న దుకాణాల ద్వారా రావాల్సిన అద్దెలూ అంతంతమాత్రంగా వస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఆలయ పరిసరాల్లో ఉన్న దుకాణాలకు అరకొరగా అద్దెను చెల్లిస్తూ ఆదాయానికి గండి కొడుతున్నారు.

నామమాత్రంగానే...
జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో 6ఏ ఆలయాలు 7, 6బీ 24, 6సీ 791, 6డీ 18 ఉన్నాయి. వాటిలో కొన్నింటికి భూములు, దుకాణాలు ఉన్నాయి. కొందరు దశాబ్దాలుగా వాటిని వ్యాపారాలకు వినియోగించుకుంటున్నారు. ఇంకొందరు నివాసముంటున్నారు. కానీ కేవలం రూ.200, 300 మాత్రమే అద్దె చెల్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల తక్కువకు దుకాణాలను తీసుకుని ఎక్కువ మొత్తానికి సబ్‌ లీజుకు ఇస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే గ్రామాల్లోని సంగతి చెప్పనవసరంలేదు.

టెక్కలి పట్టణం: టెక్కలి లక్ష్మణబాలాజీ మఠానికి దేవస్థానం చుట్టూ 34 దుకాణాలు, ఖాళీ స్థలం ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్‌ ప్రాంతంలో ఉన్న వీటిని కొన్ని దశాబ్దాల కిందట దేవాదాయశాఖ వ్యాపారులకు లీజుకిచ్చింది. వీటి నుంచి ఏడాదికి 2.96 లక్షల ఆదాయం సమకూరుతుండగా, తాజాగా 52 శాతం అద్దెను పెంచడంతో ప్రస్తుతం ఏడాదికి రూ.4.50 లక్షల ఆదాయం సమకూరనుంది. ఈ దుకాణాల్లో కొందరు ఇతరులకు అద్దెకిచ్చి రూ.10 వేల వరకు నెలసరి వసూలు చేస్తున్నారు. సగటున కనీసం దుకాణానికి నెలకు రూ.5 వేలు అద్దె వేసుకున్నా.. ఏడాదికి దేవస్థానం రూ.15 లక్షలకుపైగా ఆదాయాన్ని కోల్పోతోంది. రెండు నెలల కిందట దేవాదాయశాఖ సహాయ కమిషనరు శిరీష పరిశీలించి సబ్‌లీజుదారుల అధీనంలో ఉన్న రెండు దుకాణాలను సీజ్‌చేసి అద్దెలు పెంచారు.


నేతల అండతో బెదిరింపులు...
ఎవరైనా ఆలయ ఈవోలు, మేనేజర్లు గట్టిగా అడిగితే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. శాసనసభ్యులతో సిఫార్సులు చేయిస్తున్నారు. అప్పటికీ తగ్గకపోతే బదిలీలు చేయిస్తామని అంటున్నారని సమాచారం. ఇటీవల దేవాదాయశాఖ ఏసీ, ఈవోలతో నిర్వహించిన సమావేశంలోనూ అద్దెలను పెంచాలని ప్రస్తావన రాగానే ఓ స్థానిక నేత జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. ఇలా ప్రతిచోటా ఎవరో ఒకరు దుకాణాల విషయంలో మోకాలడ్డుతూనే ఉంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
ఆలయాలకు చెందిన దుకాణాల విస్తీర్ణం, వాటి డిమాండును బట్టి బహిరంగ వేలం పాట ద్వారా కేటాయించాలి. మూడేళ్లకు 33 శాతం అద్దెను పెంచుతూ ఉండాలి. కొత్త నిబంధనల ప్రకారం 50 శాతం పెంచాలి. వీటినెవరూ పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా లీజుకిచ్చే ప్రక్రియ ద్వారా కాకుండా మేనేజర్లు, ఈవోల నిర్ణయంతోనే ఎంతో కొంత అద్దెను నిర్ణయించి వసూలు చేస్తున్నారు. కొన్నింటికి పూర్వీకుల నుంచి అనుభవిస్తున్నామని దుకాణదారులు ఎగ్గొట్టేస్తున్నారు.


చర్యలు తీసుకుంటాం..
- శిరీష, సహాయ కమిషనర్‌, దేవాదాయశాఖ, శ్రీకాకుళం

ఆలయాల దుకాణాలకు సంబంధించి అద్దెల పెంపుపై తగు చర్యలు తీసుకుంటాం. బహిరంగ వేలం ద్వారా లీజుకు ఇచ్చి దేవాలయాల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తాం. ఇటీవల టెక్కలిలోనూ ఇలా పెంచేందుకు చర్యలు తీసుకున్నాం.  

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని