logo
Published : 24 Jun 2022 03:18 IST

పరీక్షల కాలం.. అయోమయం..!

న్యూస్‌టుడే, ఎచ్చెర్ల, రణస్థలం

అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం

టా జూన్‌లో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేది. ఏప్రిల్‌ నాటికి వార్షిక పరీక్షలు పూర్తయి మే నాటికి ఫలితాలు వెల్లడయ్యేవి. విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు పట్టాలతో వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ పరిస్థితులు తారుమారయ్యాయి. దీన్ని గాడిలో పెట్టేందుకు ఉన్నత విద్యాశాఖ సిలబస్‌ను తగ్గించి సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేలా మార్గదర్శకాలు జారీచేసింది. ఆ మేరకు రాష్ట్రంలో కొన్ని విశ్వవిద్యాలయాలు సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు సైతం విడుదల చేశాయి. కానీ జిల్లాలోని బీఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో చివరి సెమిస్టర్‌ పరీక్షలు జరగలేదు. మరోవైపు వివిధ రకాల ప్రవేశపరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలైపోయాయి. అసలు పరీక్షలు జరగకుండా వాటికి ఎలా సన్నద్ధం కావాలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం అనుబంధంగా 14 ప్రభుత్వ, 90 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 50 వేల మంది వివిధ రకాల కోర్సులు చదువుతున్నారు. డిగ్రీ మూడో ఏడాదిలో ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఇంకా నిర్వహించకపోగా నేటికీ షెడ్యూల్‌ ఖరారు కాలేదు. ఆంధ్రా విశ్వవిద్యాలయం డిగ్రీ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించి ఫలితాలు సైతం పది రోజుల కిందటే వెల్లడించడం గమనార్హం.

వేధిస్తున్న సిబ్బంది కొరత...
బీఆర్‌ఏయూలో శాశ్వత ఆచార్యులు లేక ఉన్నవారిపై అదనపు బాధ్యతలతో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వానికి ఈ సమస్య అనేకసార్లు వర్సిటీ అధికారులు, పాలకమండలి సభ్యులు తెలియజేసినా ఫలితం ఉండటం లేదు. దీంతో డిగ్రీలో ఆరు, పీజీలో నాలుగు, బీఈడీలో నాలుగు, ఇంజినీరింగ్‌లో ఎనిమిది, బీపీఈడీ, డీపీఈడీ, యోగా వంటి కోర్సుల్లో పరీక్షల నిర్వహణకు జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం స్పందించి శాశ్వత ఆచార్యులు, బోధనేతర సిబ్బందిని నియమిస్తే పరీక్షల నిర్వహణ వ్యవస్థ గాడిన పడేందుకు అవకాశం ఉంటందని పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు.


అవకాశాలు కోల్పోతాం...
- కొత్తకోట విజయలక్ష్మి, బీఎస్సీ మూడో సంవత్సరం

రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నెలలో డిగ్రీ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయితే వివిధ రకాల సెట్‌లకు సిద్ధమయ్యేందుకు సమయం ఉంటుంది. ఏయూ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ఆరో సెమిస్టర్‌ పరీక్షలై ఫలితాలు సైతం వెలువడ్డాయి. మాకు ఇంతవరకు పరీక్షలు జరగలేదు. జులై నెలాఖరు వరకూ పరీక్షలు జరిగితే ప్రవేశపరీక్షలకు ఎప్పుడు సిద్ధమవ్వాలి. దీంతో మంచి కళాశాలల్లో సీట్లు పొందే అవకాశాలు కోల్పోతాం.


షెడ్యూల్‌ విడుదల చేస్తాం...
- డా.ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌, ఎగ్జామినేషన్‌ డీన్‌, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం

డిగ్రీ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అనివార్య కారణాలతో వాయిదా వేశాం. రెండు, మూడురోజుల్లో షెడ్యూల్‌ విడుదల చేస్తాం. జులై మూడో వారంలోగా పూర్తిచేసి ఆగస్టు 15 నాటికి ఫలితాలు విడుదల చేస్తాం. ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన వీసీల సమావేశంలో ఈ అంశంపై చర్చించాం. విద్యాసంవత్సరాన్ని గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని