logo

వంశధార నిర్వాసితులకు రూ.216 కోట్ల పరిహారం

వంశధార నిర్వాసితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూ.216 కోట్ల అదనపు పరిహారం విడుదల చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శుక్రవారం హిరమండలంలో నిర్వాసితులకు

Published : 25 Jun 2022 06:04 IST

నమూనా చెక్కు విడుదల చేస్తున్న స్పీకర్‌ తమ్మినేని, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, అప్పలరాజు ఎమ్మెల్యే రెడ్డి శాంతి, తదితరులు

హిరమండలం, న్యూస్‌టుడే: వంశధార నిర్వాసితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూ.216 కోట్ల అదనపు పరిహారం విడుదల చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శుక్రవారం హిరమండలంలో నిర్వాసితులకు చెల్లించేందుకు కేబినెట్‌ సమావేశంలో ఆమోదించిన అనంతరం రూ.216 కోట్ల నమూనా చెక్కును స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, కలెక్టరు శ్రీకేష్‌ బి లఠ్కర్‌, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే రెడ్డిశాంతి విడుదల చేశారు. అంతకముందు కలెక్టర్‌ మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులు, పీడీఎఫ్‌, యూత్‌ ప్యాకేజీ మంజూరైన 15 వేల మంది బ్యాంకు ఖాతాలకు లబ్ధి జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాబితాలో తప్పిపోయిన వారుంటే దరఖాస్తులను అధికారులకు అందజేయాలన్నారు. మంత్రులు ధర్మాన, అప్పలరాజు స్పీకర్‌ తమ్మినేని, ఎమ్మెల్యే శాంతి మాట్లాడుతూ శుక్రవారం నుంచే చెల్లింపులు ప్రారంభించారని, 27న ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చేలోగా చెల్లింపులు జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. తెదేపాపై పలు విమర్శలు గుప్పించారు.


బాధితుల ఆగ్రహం..

ఎమ్మెల్యే రెడ్డి శాంతిని నిలదీస్తున్న నిర్వాసితులు

సమావేశం అనంతరం పలు గ్రామాల నిర్వాసితులు స్పీకర్‌, మంత్రులు, ఎమ్మెల్యే రెడ్డిశాంతికి వారి సమస్యలు తెలియజేసేందుకు యత్నించగా కొందరు అడ్డుకున్నారు. ఆగ్రహంతో ఎమ్మెల్యే రెడ్డిశాంతిని చుట్టుముట్టి నిలదీశారు. గతంలో యూత్‌ప్యాకేజీ మంజూరుకాని 2 వేల కుటుంబాలకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తామని ముఖ్యమంత్రి మాటిచ్చారని ఆ మాట నిలబెట్టుకోకుండా అదనపు పరిహారం పేరుతో అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా శాంతించలేదు. చివరకు పోలీసులు, వైకాపా నాయకుల సాయంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని