logo

ఉపాధి మార్గం.. అందనంత దూరం..!

ఏ రంగంలో రాణించాలన్నా అందుకు తగిన నైపుణ్యం, శిక్షణ అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ప్రభుత్వం గిరిజనులకు వైటీసీ (గిరిజన యువత శిక్షణ కేంద్రం)ల్లో ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేది. ఆ విధంగా స్వయం ఉపాధి

Published : 25 Jun 2022 06:04 IST

వైటీసీల్లో నిలిచిన శిక్షణ కార్యక్రమాలు
- న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

ఏ రంగంలో రాణించాలన్నా అందుకు తగిన నైపుణ్యం, శిక్షణ అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ప్రభుత్వం గిరిజనులకు వైటీసీ (గిరిజన యువత శిక్షణ కేంద్రం)ల్లో ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేది. ఆ విధంగా స్వయం ఉపాధి కల్పించడంతో పాటు ఉద్యోగాలు సాధించేందుకు తోడ్పాటునందించేది. కరోనా కారణంగా జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ఈ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. వాటిని మళ్లీ పునరుద్ధరించాలని గిరిజన యువత కోరుతున్నారు.

సీతంపేటలోని వైటీసీలో శిక్షణ పొందుతున్న యువత (పాత చిత్రం)

జిల్లాలోని శ్రీకాకుళం, పాతపట్నం, మందస, సీతంపేట ప్రాంతాల్లో గిరిజన యువత శిక్షణ కేంద్రాలు (వైటీసీ) ఉన్నాయి. 2015లో అప్పటి ప్రభుత్వం ఆయా చోట్ల స్వయం ఉపాధి శిక్షణ కోర్సులను ప్రారంభించింది. ఐటీడీఏ(ట్రైకార్‌) నిధులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నేతృత్వంలో వివిధ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణలు ఇప్పించేవారు. ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించడంతో పాటు శిక్షణానంతరం ధ్రువపత్రం అందించేవారు. కొందరికి ఉద్యోగ అవకాశాలు చూపించేవారు. మరికొందరు శిక్షణలో నేర్చుకున్న అంశాలను సద్వినియోగం చేసుకుని ఆయా రంగాల్లో స్థిరపడేవారు. కరోనా ముందు వరకు నాలుగు కేంద్రాల్లో 122 బ్యాచ్‌ల్లో 3,743 మంది శిక్షణ ఇచ్చారు.

20కిపైగా కోర్సులు..
నాలుగు వైటీసీల్లో అక్కడి వనరుల లభ్యత, ఇతర పరిస్థితులను బట్టి 20కిపైగా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవారు. ఆటో సేల్స్‌, జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ అసిస్టెంట్‌, టైలరింగ్‌, మొబైల్‌ అసెంబ్లింగ్‌, తాపీపని, ఫ్లంబింగ్‌, ఎలక్ట్రీషియన్‌, డ్రైవింగ్‌, పుట్టగొడుగుల పెంపకం, తదితర రంగాల్లో తర్ఫీదు అందించేవారు. పట్టభద్రులు, ఇంజినీరింగ్‌ కోర్సులు చేసిన పేద గిరిజన యువత సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకునేవారు.

11 నెలలుగా జీతాల్లేవు...
జిల్లాలోని గిరిజన యువత శిక్షణ కేంద్రాల్లోని వివిధ విభాగాల్లో కేర్‌ టేకర్లతో పాటు 24 మంది పని చేస్తున్నారు. వీరు కేంద్రం నిర్వహణతో పాటు ఇతర కార్యకలాపాలు చూస్తుంటారు. 11 నెలలుగా వీరికి జీతాలు ఇవ్వడం లేదు. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత అధికారులు చొరవ తీసుకుని వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.


ఎంతో ఉపయోగపడేవి...
- కె.రామలక్ష్మి, పెద్దూరు, గిరిజన యువతి

గిరిజన కుటుంబాల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డబ్బులు పెట్టి శిక్షణలు పొందడం కష్టం. గతంలో వైటీసీ ద్వారా పోటీపరీక్షలకు ఉచితంగా ఇచ్చేవారు. అవి ఎంతో ఉపయోగపడేవి. స్వయం ఉపాధి కోర్సులూ నిర్వహించేవారు. కరోనా కారణంగా వాటిని నిలిపివేశారు. మళ్లీ ప్రారంభించలేదు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని వైటీసీలº నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సులు ప్రారంభించాలి.


త్వరలో ప్రారంభిస్తాం..
- బి.నవ్య, పీవో, ఐటీడీఏ, సీతంపేట

గిరిజన యువతకు స్వయం ఉపాధి కోర్సులను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైటీసీలో సూపర్‌-60 పేరిట ఉన్నత విద్య అభ్యసించేందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నాం. కొద్దిరోజుల్లో మందస వైటీసీలో టైలరింగ్‌, తాపీపని, ఇతరత్రా శిక్షణలు ఇప్పించాలని చూస్తున్నాం. ఈ మేరకు కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదించాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని