logo

సీఎం సారు.. మా మొర వినరూ!

‘రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడింది. 4.47 లక్షల సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో 4.06 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. షట్టర్లు లేక కాలువల్లో నీటి నియంత్రణ సాధ్యం కాక, శివారు ప్రాంతాల ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Published : 27 Jun 2022 06:26 IST

మీ చూపు పడితేనే... వీటికి మోక్షం...

నేడు జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా ప్రజల విన్నపాలివి.

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, బృందం

‘రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడింది. 4.47 లక్షల సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో 4.06 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. షట్టర్లు లేక కాలువల్లో నీటి నియంత్రణ సాధ్యం కాక, శివారు ప్రాంతాల ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకుంటే మరో 2 లక్షల ఎకరాలకు అదనంగా నీటిని ఇవ్వవచ్చు. ఇందుకు ఉద్దేశించిన వంశధార ప్రాజెక్టు నిర్మాణం సాగుతూనే ఉంది. కిడ్నీ బాధితులున్న ఉద్దానానికి ఊపిరిపోసే మెగా తాగునీటి పథకమూ అంతే.. హార్బర్ల నిర్మాణం చేపడతామని చెప్పినా అటుగా అడుగులు పడలేదు. మీ సభకు వేదికవుతున్న కోడి రామ్మూర్తి క్రీడా మైదానాన్నీ గాలికొదిలేశారు. జిల్లా పర్యటనకొస్తున్న మీరు కనికరిస్తే అవస్థల నుంచి మోక్షం లభించినట్లవుతుంది.’

‘వంశధార’లెప్పుడో..!

జిల్లాలోని 20 మండలాల్లో మొత్తం 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేలా రూపొందించిన బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. జిల్లాను కరవు పరిస్థితుల నుంచి బయట పడేయడానికి ఈ ప్రాజెక్టు కీలక భూమిక పోషించనుంది. ప్రసుత్తం ఫేజ్‌-2లో స్టేజ్‌-2 పనులు జరుగుతున్నాయి. ఇప్పటికి 89 శాతం పూర్తయ్యాయి. పది శాతం పనులు కొన్నేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి.

పరిష్కారం: ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై ఆరా తీస్తూ.. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. బిల్లులు సకాలంలో విడుదలచేస్తే వేగం పుంజుకుని జిల్లాకు మేలు జరిగే అవకాశాలున్నాయి.


అయ్యో.. నారాయణా..

నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులను రూ.112 కోట్ల జైకా నిధులతో గత ప్రభుత్వం 2018లో చేపట్టింది. తర్వాత ప్రభుత్వం మారి ఈ పనులను పక్కన పెట్టినా ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో చేర్చి పనులు పునఃప్రారంభించారు. కానీ ఆనకట్ట, కాలువల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదు. సకాలంలో ఈ పనులు పూర్తిచేయకపోతే జైకా నిధులు వెనక్కి మళ్లిపోతాయి.  పూర్తయితే 37 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు.

ఇలా చేస్తేనే..: పనుల పురోగతి, ఆలస్యానికి గల కారణాలు, ఫలానా సమయంలోగా పూర్తిచేయాలి అనే లక్ష్యాలు విధిస్తే వేగవంతం కావడానికి అవకాశాలున్నాయి.


గొట్టా.. కాపాడుకోకుంటే ఎట్టా!

జిల్లాలో ఎడమ, కుడి కాలువ ద్వారా 2.10 లక్షల ఎకరాలకు నీరందించే ప్రధాన నీటి వనరు వంశధారపై హిరమండలం వద్ద నిర్మించిన గొట్టాబ్యారేజీ. 1977-79 మధ్య దీన్ని నిర్మించారు. ప్రస్తుతం బ్యారేజీ గేట్లు కొన్నింటికి మర్మతులు చేయాల్సి ఉంది. బ్యారేజీ దిగువన రాతితో కట్టిన చప్టా(ఏప్రాన్‌) దెబ్బతింది. దీని పునఃనిర్మాణానికి రెండేళ్ల కిందటే ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇప్పటికీ ఒక శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. బ్యారేజీలో పూడిక పేరుకుపోవడంతో సుమారు 15 శాతం నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది.

చేయాల్సింది: బ్యారేజీ గేట్లకు మరమ్మతులు పూర్తిస్థాయిలో చేయాలి. బ్యారేజీలో పూడిక తొలగించాలి. ఏప్రాన్‌ మరమ్మతుల వేగం పెంచాలి. కాలువల షట్టర్లు బాగుచేయాలి


‘కోడిరామ్మూర్తి’.. ఎప్పటికవుతుంది..

దేశం గర్వించదగిన స్థాయిలో మెరికల్లాంటి ఎందరో క్రీడాకారుల్ని అందించిన ఘనత జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి క్రీడా మైదానానికి ఉంది. ఇక్కడ పాత స్టేడియం కూలగొట్టి కొత్తది నిర్మించడానికి రూ.15 కోట్ల అంచనాలతో 2016లో పనులు ప్రారంభించారు. నేటికీ పూర్తికాలేదు. క్రీడాకారులకు సాధన చేసుకోవడానికి సరైన మైదానం, స్టేడియం లేకుండా పోయాయి. ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ దీనిపై గతంలో పలు హామీలిచ్చారు.

పూనుకుంటేనే..: విషయం ముఖ్యమంత్రికి వివరించి నిధులు మంజూరయ్యేలా చూస్తే స్టేడియం పనులు జోరందుకుని తొందరగా క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుంది.


ఉద్దానం.. నత్తలా నిదానం

కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ఉద్దానం ప్రాంతానికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.700 కోట్ల అంచనా వ్యయంతో మెగా ప్రాజెక్టు చేపట్టింది. ఇది పూర్తయితే 807 గ్రామాలకు నీరందుతుంది. మొత్తం 999 కిలోమీటర్ల మేర ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ పైపులైన్లతో పాటు 264 ట్యాంకుల నిర్మించి నీరు సరఫరా చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టులోపు దీన్ని పూర్తిచేయాల్సి ఉంది. పనులు ఆలస్యం కావడంతో ఈ ఏడాది చివరి వరకూ గడువు పొడిగించారు. అయినా పనులది నత్తనడకే.

నాయకులు స్పందిస్తేనే..: జిల్లాకు చెందిన మంత్రులు, ప్రధాన నాయకులు స్పందించాలి. ప్రాజెక్టుపై పూర్తిస్థాయి దృష్టిసారించి, అధికారులు, గుత్తేదారులకు మధ్య సమన్వయం సాధిస్తేనే సాధ్యమవుతుంది.


ఆధునికీకరణకు ‘ఎడమే’

హిరమండలం, సారవకోట, జలుమూరు, నరసన్నపేట, పోలాకి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు ఎడమ ప్రధాన కాలువ నీరందిస్తోంది. మొత్తం 398 గ్రామాల్లోని 1,48,230 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా నిర్మించారు. దశాబ్దాలుగా మరమ్మతులు జరగక కాలువ దెబ్బతిని సామర్థ్యం 2,400 క్యూసెక్కులు కాగా 1800కి మించి వదిలితే గండ్లు పడే పరిస్థితి. దీనివల్ల టెక్కలి, నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు తదితర మండలాల్లోని సుమారు 35 వేల ఎకరాలకు కొన్నేళ్లుగా నీరు అందడంలేదు.

పనులు చేపడితేనే..: రూ.100 కోట్లు వెచ్చించి కాలువను పూర్తిస్థాయిలో ఆధునికీకరిస్తామనే ప్రభుత్వ వాగ్దానం నిజంకావాలి. అప్పుడే చివరి భూములకు నీరందుతుంది.


అనుసంధానం.. అడుగడుగునా ఆలస్యం..

వంశధార నదిని నాగావళితో అనుసంధానం చేసి, నారాయణపురం ఆనకట్ట ఆయకట్టుకు రెండో పంటకు నీరందించడంతో పాటు, మార్గమధ్యలో మరో 5 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేలా దీన్ని నిర్మిస్తున్నారు. రూ.84 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన దీని పనుల విలువ ప్రస్తుతం రూ.145.34 కోట్లకు పెరిగింది. 82 శాతం పనులు పూర్తయ్యాయి. గతేడాది డిసెంబరు నాటినే పూర్తిచేస్తామని, ఆ తర్వాత మే నెలాఖరు నాటికి అవుతుందని, మరోసారి జులై చివరికి పూర్తిచేస్తామని, ఇప్పుడు డిసెంబరు లేదా మార్చిలోగా అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు.

సమన్వయంతో సాగితేనే: అధికారులు గుత్తేదారులను సమన్వయ పరచుకుని ముందుకు సాగితేనే పనుల్లో వేగం పుంజుకుంటుంది.


అంతా కనికట్టేే..

వంశధార, నాగవళి నదులపై రూ.1,055.60 కోట్లతో 2017లో నాలుగు ప్యాకేజీల్లో కరకట్టలు నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. అనేక గ్రామాలు, వేలాది ఎకరాల పొలాలు వరద నీటిలో మునిగిపోకుండా వీటిని నిర్మించనున్నారు. ఈ పనులు ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయాయి. 448 ఎకరాలకు 213 ఎకరాలు మాత్రమే సేకరించారు. భూసేకరణ, నిధుల లేమి కారణంగా ఆగిపోయాయి.
భూసేకరణే ప్రధానం: ఏళ్లుగా ఇక్కడ భూసేకరణ కొనసాగుతూనే ఉంది. దీన్ని వేగవంతం చేసి పనులు పునఃప్రారంభమయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఆయా గ్రామాల్లోని వేలాది కుటుంబాలు, పంటలను కాపాడినట్లవుతుంది.


ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

కలెక్టర్‌, ఎస్పీలతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మఒడి పథకం మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సోమవారం ఆయన రానున్నారు. ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం 10.55 గంటలకు కోడిరామ్మూర్తి క్రీడా మైదానానికి వెళ్తారు. అక్కడ మీట నొక్కి నగదు పంపిణీని ప్రారంభించనున్నారు.

1,500 మందితో బందోబస్తు..: గత నాలుగు రోజులుగా సీఎం పర్యటన సమన్వయకర్త ఎమ్మెల్సీ తలశిల రఘురాం సూచనల మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మైదానం చదును చేసి రోడ్లు వేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల బాధ]్యతను ఆ శాఖ అధికారులకు అప్పగించారు. 1,500 మంది పోలీసులను బందోబస్తుకు సిద్ధం చేశారు. వారితో ఆదివారం ఉదయం కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, ఎస్పీ జి.ఆర్‌.రాధిక సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. గ్యాలరీలో విధులు నిర్వహించే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వాహనాలు కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్‌ చేయించాలని సూచించారు.
మంత్రి సమీక్ష..: సీఎం పర్యటన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, తదితరాలపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ కలెక్టర్‌, ఎస్పీలతో ఆదివారం సాయంత్రం సమీక్షించారు. లబ్ధిదారులను సభాస్థలానికి సమయానికి తరలించాలని చెప్పారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని