logo
Published : 28 Jun 2022 06:32 IST

చీకట్లు తొలగేదెప్పుడు..?

విద్యుత్తు శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది కొరత

సకాలంలో పరిష్కారం కాని సమస్యలు

- న్యూస్‌టుడే, సరుబుజ్జిలి, ఆమదాలవలస గ్రామీణం, పొందూరు

లావేరు మండలం రాయలింగాలపేట వద్ద మరమ్మతుకు గురైన విద్యుత్తు నియంత్రిక

జిల్లాలో విద్యుత్తు శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో నిర్వహణ గాడి తప్పి వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు. ఎక్కడైనా ఏదైనా సమస్యతో విద్యుత్తు సరఫరా నిలిచిపోతే పునరుద్ధరించేందుకు సమయం పడుతుంది. సాధారణ రోజుల్లోనే ఈ పరిస్థితి. ఇలా ఉంటే వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సరఫరాలో అంతరాయాలు, కనెక్షన్లు, పునరుద్ధరణ నిత్యం ఏదో ఒకచోట సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.

అసలే వర్షాకాలం..

వర్షాకాలంలో జిల్లాలో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో విద్యుత్తు తీగలు తెగిపడిపోవడం, స్తంభాలు విరిగిపోవడం, నియంత్రికలు దెబ్బతినడం వంటివి జరిగి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. వెంటనే పునరుద్ధరణకు అవసరమైన లైన్‌మెన్‌, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌, జేఎల్‌ఎం వంటి క్షేత్ర స్థాయి సిబ్బంది లేకపోవడంతో ఆయా గ్రామాల్లో తలెత్తిన సమస్యలతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. పక్క గ్రామాలకు చెందిన సిబ్బంది సమాచారం అందుకొని వచ్చి పరిష్కరించేటప్పటికి తీవ్ర జాప్యమవుతుంది. గ్రామాల్లో విద్యుత్తు వినియోగానికి తగిన సామర్థ్యం ఉన్న నియంత్రికలను ఏర్పాటుచేయడంతో పాటు పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేసి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.

సత్వర పరిష్కారానికి కృషి ..

క్షేత్రస్థాయిలో తలెత్తిన విద్యుత్తు సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. వివిధ కారణాలతో సరఫరా నిలిచిపోయినప్పుడు సకాలంలో పునరుద్ధరిస్తున్నాం. ఈమధ్య కాలంలో ఈదురుగాలులకు పలు మండలాల్లో విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయినప్పటికీ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా వేర్వేరు సెక్షన్ల నుంచి విద్యుత్తును తీసుకువచ్చి సకాలంలో సరఫరాను పునరుద్ధరించాం. పంచాయతీల్లో ఏర్పడిన ఖాళీల వివరాలను ఇప్పటికే గుర్తించి ప్రభుత్వానికి పంపించాం.

- చలపతిరావు, ఎస్‌ఈ, విద్యుత్తు శాఖ, శ్రీకాకుళం

కొన్ని మండలాల్లో పరిస్థితి ఇది:

సరుబుజ్జిలి: మండలంలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ ముగ్గురికి ఇద్దరే ఉన్నారు. లైన్‌మెన్‌ పోస్టులు రెండూ ఖాళీగా ఉన్నాయి. సచివాలయాల్లో 14 మంది ఎనర్జీ అసిస్టెంట్లు(ఈఏ) ఉండాల్సి ఉండగా 11 మంది ఉన్నారు.

టెక్కలి: క్షేత్రస్థాయి సిబ్బంది 26కు 18 మందే ఉన్నారు.

కొత్తూరు: క్షేత్రస్థాయి సిబ్బంది 27కి 23 మంది ఉన్నారు.

జలుమూరు: నాలుగు అసిస్టెంటు లైన్‌మెన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 24 గ్రామ సచివాలయాల్లో జలుమూరు, రానా, సురవరం, తిమడాం, కొమనాపల్లి, శ్రీముఖలింగం, సైరిగాం సచివాలయాల్లో ఈఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కంచిలి: క్షేత్రస్థాయి సిబ్బంది 20కి 18 మంది పనిచేస్తున్నారు. సచివాలయాల్లో 18 మంది ఈఏలకు గాను 15 మంది ఉన్నారు.

మూడు డివిజన్లలో క్షేత్రస్థాయి సిబ్బంది అయిన అసిస్టెంట్‌ లైన్‌మెన్‌, జూనియర్‌ లైన్‌మెన్‌ (ఎనర్జీ అసిస్టెంట్లు) 1,083 మంది ఉండాల్సి ఉండగా 764 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 319 పోస్టులు ఖాళీగా ఉండటంతో చాలా గ్రామాల్లో సకాలంలో ఆ శాఖ సేవలందక వినియోగాదారులు అవస్థలు పడుతున్నారు.

జిల్లాలోని విద్యుత్తు సర్కిల్‌ కార్యాలయం పరిధిలో శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 43 సెక్షన్‌ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా విభజన అనంతరం కూడా పాలకొండ డివిజన్‌ ఈ సర్కిల్‌ కార్యాలయం పరిధిలోనే కొనసాగుతోంది. క్షేత్ర స్థాయిలో అవసరమైన సిబ్బంది లేక ఆయా డివిజన్లలో పరిస్థితి దారుణంగా ఉంది.

నెల రోజులుగా తిరుగుతున్నా

ఈయన పేరు బెవర గణేష్‌. ఊరు సరుబుజ్జిలి మండలం రొట్టవలస. ఇల్లు కడుతున్నారు. దీనికి 30 మీటర్ల దూరంలో విద్యుత్తు స్తంభం ఉంది. అక్కడి నుంచి మరో స్తంభం వేయాలని లైన్‌మేన్‌కు పలుసార్లు విన్నవించుకున్నా పనికాలేదు. దీంతో బోరు లేక నిర్మాణ పనులు త్వరగా చేయించుకోలేకపోతున్నారు. గ్రామ సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్‌ లేకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు.

కనెక్షన్‌ కావాలని కోరినా..

ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు ఎం.అసిరినాయుడు. జి.సిగడాం మండలం నక్కపేట గ్రామం. ఇతనికి ఉన్న రెండెకరాల వ్యవయసాయ భూమికి సొంతంగా మోటారు ఏర్పాటుచేశారు. విద్యుత్తు కనెక్షన్‌ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసం అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వాపోతున్నారు. సచివాలయంలో లైన్‌మేన్‌ లేకపోవడంతో కనెక్షన్‌ ఇవ్వడంలో ఆలస్యమవుతుందని చెబుతున్నారు.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts