logo

సిక్కోలును ప్రగతిపథాన నడిపిస్తాం..

జిల్లాలో ఏళ్లుగా నానుతున్న సమస్యలు పరిష్కరిస్తాం. పెండింగులో ఉన్న అన్ని పనులూ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం. జిల్లాను ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అమ్మఒడి మూడో విడత

Published : 28 Jun 2022 06:32 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, 

- న్యూస్‌టుడే, పాత శ్రీకాకుళం, అర్బన్‌, గుజరాతీపేట, అరసవల్లి

సభకు హాజరైన జనం

జిల్లాలో ఏళ్లుగా నానుతున్న సమస్యలు పరిష్కరిస్తాం. పెండింగులో ఉన్న అన్ని పనులూ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం. జిల్లాను ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అమ్మఒడి మూడో విడత నగదు జమ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో సోమవారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో రహదారులు నిండిపోయాయి. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నగరంలో పోలీసుల ఆంక్షలు, సభకు వచ్చినవారి అవస్థలు, నేతల అసంతృప్తి గళాలు, వామపక్ష నేతల నిర్బంధాల మధ్య సీఎం పర్యటన సాగింది..

హామీలు.. నిధుల మంజూరు..

జిల్లాలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ●

కోడి రామ్మూర్తి స్టేడియం పునర్‌నిర్మాణానికి అవసరమైన రూ.10 కోట్లు

అసంపూర్తిగా నిలిచిన సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణానికి రూ.60 కోట్లు

శ్రీకాకుళం-ఆమదావలస రహదారి నిర్మాణంలో భాగంగా నిర్వాసితులు, ఇతర అవసరాలకు రూ.18 కోట్లు

● వంశధార రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీరు నిల్వ చేసేందుకు, గొట్టా దిగువన ఎత్తిపోతలు ఏర్పాటుకు రూ.189 కోట్లు

మహేంద్రతనయ నదిపై నిర్మిస్తున్న ఆఫ్‌షోర్‌ నిర్మాణానికి ఇచ్చిన అంచనాలకు ఆమోదం, యుద్ధప్రాతిపదికన పనుల పూర్తికి చర్యలు

వంశధార-నాగావళి నదుల అనుసంధాన పనులు పూర్తి చేసి డిసెంబరు నాటికి జాతికి అంకితం.

ఉద్దానం ప్రాంత ప్రజల కోసం రూ.700 కోట్లతో చేపట్టిన మెగా తాగునీటి సరఫరా పథకాన్ని పాతపట్నంలోని మరో మూడు మండలాలతో పాటు ఇతర కొన్ని ప్రాంతాలకు విస్తరణకు అవసరమైన రూ.200 కోట్లు మంజూరు

నగరంలో నరకయాతన..! విద్యార్థుల విలవిల..

జన సమీకరణలో భాగంగా జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లులను తరలించారు. ఇందుకోసం ఆర్టీసీ, ప్రైవేటు బడుల బస్సులు పెద్ద సంఖ్యలో వినియోగించారు. అధికారుల అత్యుత్సాహం వల్ల సభ లోపలే కిక్కిరిసింది. కనీసం నిల్చునేందుకు చోటులేక, సూర్య తాపానికి తట్టుకోలేక విద్యార్థినులు, వారి తల్లులు విలవిల్లాడారు. ఆరుగురు విద్యార్థినులు స్పృహ తప్పి పడిపోయారు. తోపులాటలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వీరిలో కొందరికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.

95 శాతం హామీలు నెరవేర్చాం..

విద్యకోసం గత పాలనలో ఎన్నడూ ఇంత పెద్దఎత్తున ఖర్చు చేయలేదు. బాలకార్మికులు ఉండకూడదని, వారిని బడికి వచ్చేలా చేయడానికి చేపడుతున్న కార్యక్రమం. ఇది సంక్షేమం కాదు.. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడి. ఇప్పటికే 95 శాతం హామీలు నెరవేర్చాం. రాజకీయాల్లో జగన్‌ కొత్త ఒరవడి సృష్టించారు. రాజకీయ నాయకులు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు. అమ్మఒడి పథకంపై కొందరు కావాలనే విమర్శలు చేస్తున్నారు. - బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి

విద్యకు అధిక ప్రాధాన్యం

ఇది డబ్బులు పంచే కార్యక్రమం కాదు. సంపన్నులు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం విద్య కోసం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి పేదవాడి పిల్లలూ ధనవంతులతో కలిసి చదువుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇలా లేకుంటే ఆకలి తీర్చుకునేందుకు పిల్లలు బాల కార్మికులుగా మారిపోతారు. రాష్ట్రంలో జిల్లా వెనుకబడి ఉంది. గత 75 ఏళ్లలో జిల్లాకు న్యాయం జరగలేదు. వందేళ్లపాటు ప్రజలు గుర్తించుకుపోయేలా కార్యక్రమాలు చేస్తున్నాం.. - ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ మంత్రి

చుక్కలు చూపించారు...

నగర ప్రజలు గతంలో ఎప్పుడూ చూడనన్ని ఆంక్షలు చవిచూశారు. హెలీప్యాడ్‌ ఉన్న ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి స్టేడియం వరకూ భారీస్థాయిలో భారీకేడ్లు, కొన్నిచోట్ల పరదాలు ఏర్పాటు చేశారు. ఈ రహదారులకు ఆనుకుని అనేక వీధులున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. మహిళలైతే మరీ ఇబ్బంది పడ్డారు

సీఎం వస్తున్నారు మూసేయండి..

సీఎం కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో ముందుగానే వ్యాపార దుకాణాలను పోలీసులు మూయించివేశారు. 80 అడుగుల రహదారి, కళింగరోడ్డు, పొట్టిశ్రీరాములు కూడలి, ఏడురోడ్ల కూడలి, పాలకొండ రోడ్డు, డేఅండ్‌నైట్‌ కూడలి, స్టేడియం రహదారుల్లో ఈ పరిస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి నిబంధనలు చూడలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.

నేతల అసంతృప్తి గళం..

సీఎంకు స్వాగతం పలికేందుకు వచ్చిన కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణిని హెలిపాడ్‌ ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్‌ హేమమాలినీరెడ్డినీ విడిచిపెట్టలేదు. ఆమె భర్త బల్లాడ జనార్దన్‌రెడ్డి పోలీసులను కోరినా అనుమతించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. పలాస మాజీ ఛైర్మన్‌ పూర్ణచంద్రరావును అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదే పరిస్థితి మరికొంత మందికీ ఎదురైంది.

ఆంక్షల సుడిగుండం..

సీఎం పయనించే మార్గంలో ఓవైపు రోడ్డు మొత్తం బ్లాక్‌ చేశారు. ఆ దారిలో ఎవరినీ నడవనివ్వలేదు. రెండోవైపు నుంచే వాహనాలు, ప్రజల రాకపోకలకు అనుమతించారు. ఆ దారిలో తమ ఇల్లు ఉందని కొందరు స్థానికులు మొరపెట్టుకున్నా పోలీసులు విడిచిపెట్టలేదు. కొన్నిచోట్ల వాగ్వాదాలు జరిగాయి. ఏడురోడ్ల కూడలి వద్ద రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లు నిర్మించాలని పోలీసులు భావించి కర్రలు పాతించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. శివారు ప్రాంతాల్లో బస్సులు ఇతర వాహనాలు నిలిపివేయడంతో గంటలు తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.

అంబులెన్సుకీి దారివ్వలే...

సీీఎం హెలీప్యాడ్‌కి తిరిగి వెళ్లే దారిలో ముందుగానే వాహనాలను నిలిపేశారు. కొత్తబ్రిడ్జి కూడలి వద్ద 15 నిమిషాల ముందు నుంచే ట్రాఫిక్‌ నిలిపేయడంతో ఓ అంబులెన్సు ఇరుక్కుపోయింది. పోలీసులు దారి వదలకపోవడంతో అక్కడే ఉన్న పలువురు విమర్శలు చేశారు.

దాహం.. దాహం..

సభా ప్రాంగణంలో తాగునీటి సౌకర్యం కల్పించినా అక్కడికొచ్చి నీళ్లు తాగే పరిస్థితి లేదు. దాహార్తిని తట్టుకోలేక నీళ్ల కోసం బయటకెళ్లిన పిల్లల కోసం తల్లులు వెతుక్కోవాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని