logo

రైలు నిలయంలో సమస్యల కూత..

జిల్లాలో ప్రధానమైనదిగా పేరు గాంచిన శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్‌ ఆదాయంలో ఘనంగా ఉన్నా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించటంలో మాత్రం వెనుకంజలోనే ఉంది. రైల్వేస్టేషన్‌లో సౌకర్యాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్‌ఫాంపై

Published : 28 Jun 2022 06:44 IST

న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం, గ్రామీణం


శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్‌లో పూర్తి స్థాయిలో ప్లాట్‌ఫాంపై పైకప్పు లేని దృశ్యం

జిల్లాలో ప్రధానమైనదిగా పేరు గాంచిన శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్‌ ఆదాయంలో ఘనంగా ఉన్నా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించటంలో మాత్రం వెనుకంజలోనే ఉంది. రైల్వేస్టేషన్‌లో సౌకర్యాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్‌ఫాంపై పూర్తి స్థాయిలో పైకప్పు లేకపోవడంతో ప్రయాణికులు ఎండకు ఎండుతూ.. వర్షంలో తడుస్తూ రైళ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉన్నట్లు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా 3, 4 ప్లాట్‌ఫాంలపై పూర్తిగా మరుగుదొడ్లు లేకపోవడంతో వారు 2వ నెంబరు ప్లాట్‌ఫాం పైకి వచ్చి తమ అవసరాలను తీర్చుకోవల్సి వస్తుంది. రైల్వేశాఖ ఇటీవల నూతనంగా నిర్మించి ర్యాంపు వంతెనను పూర్తిస్థాయిలో నిర్మించకపోవడం, ప్లాట్‌ఫాంపై పూర్తిస్థాయిలో తాగునీటి కుళాయిలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టేషన్‌ మీదుగా సుమారు 63 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా స్టేషన్‌లో 15 వరకు ఇక్కడ ఆగడం లేదు.

సౌకర్యాలు కల్పించాలి

ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటూ, ఆదాయంలో ముందు ఉంటున్న శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాలు అంతగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం వస్తున్న ఈ స్టేషన్‌లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రైల్వేశాఖపై ఉంది. -బొనెల అప్పారావు, ఆమదాలవలస

‘‘రైల్వే స్టేషన్‌లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించి డీఆర్‌ఎం కార్యాలయానికి పంపించాం. వాటిలో కాలి నడక వంతెన ప్రారంభమైంది. మిగతా సమస్యలను కూడా త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తాం.’’ - ఎం.రవికుమార్‌, స్టేషన్‌ మేనేజర్‌, శ్రీకాకుళం రోడ్‌ రెలు నిలయం

మరికొన్ని సమస్యలిలా

శాశ్వత పార్కింగ్‌ షెడ్డు లేకపోవడంతో ఆరుబయటే వాహనాలను ఉంచాల్సి వస్తుంది.

ప్రయాణికుల లగేజీ దాచుకోవడానికి లగేజీ రూంలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

విభిన్న ప్రతిభావంతులు(వికలాంగులు) సౌకర్యార్థం నిర్మించిన లిఫ్టు పనిచేయడం లేదు. ప్లాట్‌ఫాం పైకి వారిని చేరవేయడానికి ఎటువంటి వాహనాలు లేవు.

రైల్వే ప్లాట్‌ఫాంకు టిక్కెట్‌ కౌంటర్‌ దూరంగా ఉండటంతో ప్రయాణికులు టిక్కెట్‌ తీసుకొని, తమ లగేజీతో చుట్టూ తిరిగి రైలు వద్దకు చేరుకునేందుకు కొంత సమయం పట్టడంతో కొన్నిసార్లు రైలు ఎక్కలేక వెనుతిరగాల్సి వస్తుంది.

రైలు నిలయం ప్రాంగణంలో పూర్తిస్థాయిలో విద్యుత్తు దీపాలు, రైల్వే పోలీసులు గస్తీ లేకపోవడంతో కొందరు ఆకతాయిలు రాత్రి సమయంలో ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రయాణికులు భయంతో బయటకు వెళ్లాల్సి వస్తుంది.

శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్‌లో రోజుకు టికెట్‌ కౌంటర్‌, పార్శిళ్ల ఆదాయం సుమారుగా రూ.3 లక్షలు

గూడ్సు వ్యాగన్ల ద్వారా ఆదాయం: రోజుకు రూ.10 లక్షలు, నెలకు సుమారు రూ.3 కోట్లకు పైగా

ప్రతి రోజు వచ్చి, వెళ్లే ప్రయాణికులు: సుమారు 1,600 మంది

రోజూ ఆగే రైళ్లు: 48

ప్లాట్‌ఫాంలు: 4

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని