logo

వైద్యులు.. సేవా నారాయణులు...

వైద్యవృత్తిలో స్థిరపడాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ కొందరు వైద్యులుగా మారి నిస్వార్థ సేవలందించాలని.. నిరుపేదలకు అండగా నిలవాలని ఆరాటపడుతుంటారు. అప్పుడే వారు చదువుకున్న చదువులకు సార్థకత లభిస్తుందని భావిస్తారు. 

Published : 01 Jul 2022 05:20 IST

నేడు జాతీయ వైద్యుల దినోత్సవం

- న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం), బృందం

వైద్యవృత్తిలో స్థిరపడాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ కొందరు వైద్యులుగా మారి నిస్వార్థ సేవలందించాలని.. నిరుపేదలకు అండగా నిలవాలని ఆరాటపడుతుంటారు. అప్పుడే వారు చదువుకున్న చదువులకు సార్థకత లభిస్తుందని భావిస్తారు.  వైద్యాన్నే నమ్ముకున్న కొందరు ఆ వృత్తిని వారితో అంతమైపోకుండా తర్వాత తరాలకు అందించాలనే తపనతో ముందుకుసాగుతుంటారు. ఇలా వైద్యరంగంలో విభిన్నంగా రాణిస్తూ... నలుగురికి ఉపయోగపడుతున్న పలువురిపై  ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..  


తెలుగులోనే మందుల చీటీ..

అతను వైద్యం చేస్తే ఎంతటి రోగమైనా తగ్గిపోతుందన్న పేరొందారు నరసన్నపేటకు చెందిన విశ్రాంత వైద్యుడు యయాతి. స్థానిక సీహెచ్‌సీలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన యయాతి పేదల వైద్యుడిగా గుర్తింపు ఉంది. ఇందుకు కారణం ఈయన వైద్యం చేసినా ఎవరినుంచి డబ్బులు తీసుకోరు. తెలుగుపై మమకారంతో మందుల చీటీలను తెలుగులోనే రాస్తున్నారు. ఇతని కుమార్తె, అల్లుడు కూడా వైద్యులుగా గుర్తింపు పొందారు. ఇప్పటికీ ఈయన సేవలు కొనసాగిస్తూనే ఉన్నారు.

- న్యూస్‌టుడే, నరసన్నపేట


మనసున్న డాక్టరు...

డాక్టర్‌ నాయుడు.. టెక్కలి ప్రాంతానికి సుపరిచితమైన పేరు.. నేటికీ పేదలు ఎవరికైనా వైద్యం కావాలంటే గుర్తొచ్చే చిరునామా అది.. రూ.వందలు, వేలల్లో ఫీజుల కింద తీసుకొనే ఈ రోజుల్లో ఈయన క్లినిక్‌లో చికిత్స కోసం వసూలుచేసే మొత్తం రూ.50 మాత్రమే. మొన్నటివరకూ కేవలం రూ.20 తీసుకొనేవారు. అదీ సామాజిక సేవకోసమే.. వైద్యుడిగా కన్నా సమాజ సేవకుడిగా నంబాళ్ల వెంకటనాయుడుది ప్రత్యేక స్థానం. ఉన్నత విద్య అయినా, ఆడపిల్ల వివాహమైనా ఆర్థికలోటుతో ఆగిపోకూడదని ఆయన తనవంతు సాయమందిస్తారు. 50 ఏళ్ల పాటు వైద్యుడిగా సేవలందించిన ఆయన కొవిడ్‌ అనంతరం అనారోగ్యం బారినపడిన కొద్దినెలల నుంచి వైద్యసేవలు నిలిపివేశారు. పాతికేళ్లు జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన అనారోగ్యం బారినపడినా ఆసుపత్రికొచ్చే రోగులకు ఇబ్బంది తలెత్తకుండా ఆయన కుమారుడు దంత వైద్యుడు నంబాళ్ల దిలీప్‌ ప్రాథమిక వైద్య సేవలందిస్తున్నారు.

- న్యూస్‌టుడే, టెక్కలి


విశ్వనాథం.. సేవాసుగంధం

బాలికను పరీక్షిస్తున్న విశ్వనాథం

92 ఏళ్ల వయసులో ఓ వైపు లయన్స్‌క్లబ్‌ సేవా కార్యక్రమాలు, మరోవైపు భాజపా నాయకుడిగా సేవలు.. ఇంకోవైపు తన దగ్గరకు వచ్చే రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు పలాసకు చెందిన మాజీ ఎంపీ, డాక్టర్‌ కె.విశ్వనాథం. ఇతను యుక్త వయసులో ఉండే సమయంలో ఒడిశా బ్రహ్మపుర నుంచి శ్రీకాకుళం వరకు ఒక్కరే వైద్యుడు ఉండేవారు. తన స్నేహితుడు రాజారెడ్డి ఉద్యోగం రావటంతో వెళ్లిపోయినా, తను మాత్రం ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా వెళ్లకుండా స్థానిక సేవకే ప్రాధాన్యం ఇచ్చారు. 1957లో వైద్యునిగా సేవలు ప్రారంభించిన ఆయన నేటికీ తన దగ్గరకు వచ్చే రోగులను పరిశీలించి మందులు లేదా ఇంజక్షన్లు స్వయంగానే ఇస్తుంటారు. అందుకు ఆయన దగ్గర ఫీజు నిర్ణయం కూడా ఉండదు. వారు ఎంత ఇస్తే అంతే తీసుకునే నేటికీ సేవలు అందిస్తున్నారు.

- న్యూస్‌టుడే, పలాస


వృత్తిబంధం.. కలిపింది స్నేహం

స్కానింగ్‌ తీస్తున్న శివాజీ, క్రిష్ణమూర్తి

డాక్టర్‌ ప్రధాన శివాజీది సంతబొమ్మాళి మండలం కొత్తూరు. డాక్టర్‌ యారడి క్రిష్ణమూర్తిది కంచిలి మండలం గోకర్ణపురం గ్రామం. మారుమూల గ్రామాలకు చెందిన వీరిద్దరూ చదువుల కోసం విశాఖ ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో కలిశారు. కానీ భావాల రీత్యా భిన్నధ్రువాలు. వైద్యవిద్య పూర్తయిన తర్వాత పరిణామాలు ఇద్దరినీ ఒకచోటుకు చేర్చాయి. ఒకరు గైనకాలజిస్టు, ఇంకొకరు మత్తువైద్యుడు కావడంతో ఇద్దరూ కలిసి సోంపేటలో నర్సింగ్‌హోం నడుపుతున్నారు. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా నేటికీ వారి బంధం ఆదర్శంగా కొనసాగుతూనే ఉంది. వైద్యరంగంలోనే కాక సామాజిక పోరాటాల్లో వీరిద్దరూ ముందుంటారు. సోంపేట థర్మల్‌ ఉద్యమంలో క్రిష్ణమూర్తి ప్రత్యక్షంగా పోరాడగా తెరవెనుక కార్యకలాపాలన్నీ శివాజీ నిర్వహించారు. ఉద్యమ నేపథ్యంలో వీరి ఆసుపత్రిపై బాంబుల దాడి కూడా జరిగింది. క్రిష్ణమూర్తి 50 పోలీసు కేసులు కూడా ఎదుర్కొన్నారు. కిడ్నీవ్యాధుల పరంగా ప్రభుత్వం చేపట్టే చర్యల విషయంలో మొదటి నుంచి శివాజీ పనిచేస్తున్నారు. వీరి ఇద్దరి కుమార్తెలు కూడా వైద్యవిద్యనే అభ్యసిస్తున్నారు.  

- న్యూస్‌టుడే, సోంపేట


ఉన్నంతలో కొంతసమయం..

వారంతా ఆయా విభాగాల్లో పేరున్న వైద్యులే. ఆసుపత్రులు, క్లినిక్‌ల్లో పనిచేస్తున్న వారే. అయినా వారి బిజీ కాలంలో కొంత నిరుపేదలకు కేటాయిస్తున్నారు. తమలో సేవాగుణాన్ని చాటుతున్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్‌ సొసైటీకి వచ్చే రోగులకు వీరంతా ఉచితంగా వైద్య సేవలందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

* ఫిజియోథెరపీ వైద్యులు కోరాడ లక్ష్మణమూర్తి ప్రతిరోజు ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు చేస్తారు.

* కంటి వైద్యులు పి.ఎల్‌.ఎన్‌.రాజు ప్రతి ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం వరకు పరీక్షలు చేస్తారు. సహాయకులుగా ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ జగన్నాథరావు ఉంటారు. నేత్ర పరీక్షల అనంతరం అవసరమైన వారికి రెడ్‌క్రాస్‌ సహకారంతో శస్త్రచికిత్సలు, కంటి అద్దాలు సమకూర్చుతున్నారు.

* దంత వైద్యులు ప్రేమ్‌ ప్రతి మంగళవారం ఉదయం పూట సేవలందిస్తారు.

* మధుమేహ వైద్య నిపుణులు కెల్లి చిన్నబాబు ప్రతి శనివారం సాయంత్రం అయిదు గంటల నుంచి రాత్రి ఏడు వరకు పరీక్షలు చేసి మందులు అందజేస్తారు.


వండాన వండర్‌..

పోలాకి మండలం గొల్లలవలసలో వ్యవసాయం కుటుంబంలో జన్మించారు వండాన శేషగిరిరావు. మారుమూల ప్రాంతంలో పుట్టిపెరిగినా చదువులో ఎక్కడా వెనుకబడలేదు. పేదలకు సేవలందించాలనే ఉద్దేశంతో వైద్యుడు కావాలని సంకల్పించారు. 1972లో ఆంధ్రా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ తర్వాత జనరల్‌ మెడిసిన్‌ చేశారు. అప్పటి నుంచి అదే వృత్తిలో కొనసాగుతూ పేదల వైద్యుడిగా పేరొందారు. నిరుపేదలు ఎంతిస్తే అంత అన్నట్లుగా సాగుతున్నారు. అంతేకాక బిడ్డలను కూడా వైద్యరంగం వైపే నడిపించి ఆదర్శంగా నిలిచారు. కుమారుడు వండాన కిరణ్‌కుమార్‌ 2001లో ఏఎంసీలోనే జనరల్‌ మెడిసిన్‌ పూర్తిచేశారు. ఈయన భార్య చిన్నపిల్లల వైద్య నిపుణులుగా సేవలందిస్తున్నారు. శేషగిరిరావు కుమార్తెలు విజయలక్ష్మి (గైనిక్‌) సునీత (రేడియాలజీ) భర్త శరత్‌చంద్ర (రేడియాలజీ) విభాగాల్లో స్థిరపడ్డారు. ఇతను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.


తండ్రి బాటలోనే పిల్లలు

నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన డాక్టర్‌ లుకలాపు ప్రసన్నకుమార్‌ నాల్గోతరగతిలో ఉండగానే తండ్రి బాబూరావు మృతి చెందారు. అప్పటినుంచి తల్లి విజయలక్ష్మి కష్టపడి చదివించారు. 2001లో వైద్యవిద్య పూర్తి చేసి ఎచ్చెర్ల పీహెచ్‌సీలో వైద్యాధికారిగా చేరారు. అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సివిల్‌ అసిస్టెంట్‌గా చేరి ప్రస్తుతం అక్కడే డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి కుమార్తె ప్రియాంకవదన్‌ జెమ్స్‌ ఆసుపత్రిలో హౌస్‌సర్జన్‌గా చేస్తున్నారు. కుమారుడు సంతోష్‌ సిద్ధార్థ ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు.


తాత నుంచి మనవరాలు వరకు...

శ్రీకాకుళంలో 30 ఏళ్లుగా సేవలందిస్తున్న డాక్టర్‌ కింజరాపు అమ్మన్నాయుడు కుటుంబంలో నాలుగు తరాలవారు వైద్యులుగా కొనసాగుతున్నారు. పీజీ చేసిన అనంతరం 1983లో సివిల్‌సర్జన్‌ అసిస్టెంట్‌గా సాలూరులో మెడికల్‌ ఆఫీసర్‌గా పని చేశారు. శ్రీకాకుళంలో సొంతంగా శాంతినర్శింగ్‌ హోం ప్రారంభించి ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. వీరి కుమారుడు రవిశంకర్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా, కుమార్తె ప్రశాంతి గైనకాలజిస్ట్‌గా స్థిరపడ్డారు. కోడలు శిరీష సైతం విశాఖపట్నంలోని రెడ్డీస్‌ ఆసుపత్రిలో రేడియాజిస్ట్‌గా పని చేస్తున్నారు. మనవరాలు సింధు మేఘన ఆంధ్రామెడికల్‌ కాలేజీలో ప్రస్తుతం వైద్యవిద్య అభ్యసిస్తోంది


డీఎంహెచ్‌వో ఇంటా ఇంతే...

జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిగా పని చేస్తున్న డాక్టర్‌ బి.మీనాక్షి కుటుంబంలోనూ వైద్యులకు కొదవలేదు. ఈమె భర్త డాక్టర్‌ బమ్మిడి అప్పలనాయుడు సర్వజన ఆసుపత్రి ఆర్‌ఎంవోగా ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళంలోని కిమ్స్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్నారు. వీరి కుమార్తె బీడీస్‌ పూర్తి చేసి దంత వైద్యురాలిగా స్థిరపడ్డారు. అల్లుడు సనపల వెంకట్‌ రాజేష్‌ ఎం.ఎస్‌. ఆర్థో పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని