logo

ఎంత పనిచేసిన అంతే...!

పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు ఉపాధి పథకం వరమే. నిత్యం పని దొరుకుతోంది. కానీ వారి శ్రమకు తగిన ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎంత పనిచేసినా వారికి కనీస వేతనం అందడం గగనంగా మారింది. ఇక గరిష్ఠ వేతనం అందుకోవడం కలగానే కనిపిస్తోంది. చేతులు

Updated : 02 Jul 2022 07:10 IST

ఉపాధి పథకంలో వేతనదారులకు అందని గరిష్ఠ వేతనం

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు ఉపాధి పథకం వరమే. నిత్యం పని దొరుకుతోంది. కానీ వారి శ్రమకు తగిన ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎంత పనిచేసినా వారికి కనీస వేతనం అందడం గగనంగా మారింది. ఇక గరిష్ఠ వేతనం అందుకోవడం కలగానే కనిపిస్తోంది. చేతులు బొబ్బలెక్కేలా కష్టపడుతున్నా అనుకున్న స్థాయిలో వేతనం రాకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మస్తర్లు వేయడంలో కొందరు క్షేత్ర సహాయకుల చేతివాటం కారణంగా కొందరు పని చేయకపోయినా మస్తర్లు వేస్తుండటంతో వారికీ వేతనం అందుతోంది. ఈ మేరకు అసలు పనిచేసిన వారికి తగ్గుతోంది.

రెండు నెలల్లో రూ.33 పెరుగుదల

గతంలో జిల్లాలో రోజుకు 70-80 వేల మంది రోజూ పనులకు వచ్చేవారు. ఇప్పుడు వారి సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. గత నెలలో ఒక్కరోజులో అత్యధికంగా 2.61 లక్షల మంది పనిచేశారు. ఏప్రిల్‌లో వీరు అందుకున్న సరాసరి వేతనం రూ.139. ఈ పరిస్థితిపై రాష్ట్రస్థాయి అధికారులు, కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత తక్కువ వేతనం రావడంపై అధికారులను ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకుని రోజువారీ వేతనం పెరిగేలా చూడాలని ఆదేశించారు. మే 29న సరాసరిన ఒక్కొక్కరూ రూ.154 అందుకోగా ప్రసుత్తం రూ.172 చొప్పున పొందుతున్నారు. గరిష్ఠ వేతనం మాట అటుంచితే అధికారుల నిర్దేశించిన లక్ష్యం రూ.230. దీనికి చేరుకోవడమే సాధ్యమయ్యేలా కనిపించడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

వెనుకబడిన కొన్ని మండలాలు..

జిల్లాలో కొన్ని మండలాల్లో సరాసరి వేతనం కొంతమేరకు బాగానే ఉంది. కొన్నిచోట్ల మాత్రం మరీ అధ్వానంగా వస్తోంది. ఏపీవో, క్షేత్రసహాయకుల మధ్య సమన్వయ లోపం కారణంగా వేతన జీవులకు దిశానిర్దేశం చేయలేకపోతున్నారు. గత మూడు నెలల సరాసరి చూస్తే మెళియాపుట్టి, సరుబుజ్జిలి, నరసన్నపేట, గార, జలుమూరు మండలాల్లో వరుసగా రూ.185, రూ.184, రూ.184, రూ.183, రూ.182 చొప్పున అందుకుంటున్నారు. అదే సమయంలో పొందూరు, ఆమదాలవలస, కొత్తూరు, పోలాకి మండలాల్లో సరాసరి వేతనాలు వరుసగా రూ.153, రూ.155, రూ.161, రూ.163 మాత్రమే ఉన్నాయి. వేతనంలో పెంపుదల చూపించడంలో ఈ మండలాలు వెనుకబడుతున్నాయి.

పనిముట్లు పనికిరావు..

వేతనదారులు గరిష్ఠ వేతనం పొందాలంటే చేయాల్సిన పని లక్ష్యాన్ని క్షేత్ర సహాయకులు, మేట్లు చూపించాలి. కొన్నిచోట్ల ఈ విషయంలో సమన్వయ లోపం కనిపిస్తోంది. మరోవైపు పనిముట్లు పదును తగ్గడంతో ఎంత ఎక్కువగా శ్రమించినా తక్కువ పనే జరుగుతోంది. గతంలో శ్రమశక్తి సంఘాల్లోని సభ్యుల ఆధారంగా పదునైన గునపాలు అందించేది. ప్రస్తుతం ఈ సాయం అందడం లేదు.

అవగాహన లేమి..

ఉపాధి పథకం ఇన్నేళ్లుగా అమలులో ఉన్నా కొందరు క్షేత్రసహాయకులు, మేట్లకు ఎంత పని చేస్తే సంఘంలోని సభ్యులకు ఎంతెంత వేతనం వస్తుందనే అంశంపై అవగాహన లేదు. మేట్లకు, క్షేత్రస్థాయి సహాయకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నా . కానీ ఆచరణలో కనిపించడం లేదు.


రోజువారీ సమీక్షిస్తున్నాం..

సరాసరి వేతనం అంశంలో రోజు, మండలాల వారీగా లెక్కగడుతున్నాం. ఎక్కడెక్కడ తక్కువ వస్తుందో ఆయా మండలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన వైఖరి అవలంబిస్తున్నాం. ఇటీవల ఇద్దరు ఏపీవోలతో పాటు పది మంది క్షేత్రసహాయకులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం. అతి త్వరలోనే లక్ష్యాన్ని చేరుతామనే నమ్మకం ఉంది.  

           - ఎం.రోజారాణి, పీడీ, డ్వామా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని