logo
Published : 06 Aug 2022 04:06 IST

బావ ఇంటికే కన్నమేశాడు

ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య నలిగిన చోరీ కేసు

ఎట్టకేలకు ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాధిక

వారిద్దరూ ఉపాధ్యాయులు. వరుసకు బావ, బావమరుదులు. ఒకే వీధిలో నివాసముండటంతో బంధం మరింత బలపడింది. అన్ని విషయాలు పంచుకునేవారు. అదే కొంపముంచింది. చివరికి బావ ఇంటికే కన్నమేశాడు ఆ ప్రబుద్ధుడు. పాపం పండిపోవడంతో పోలీసులకు దొరికిపోయిన నిజాన్ని ఒప్పుకుని కటకటాల పాలయ్యాడు. కొత్తూరులో గతేడాది అక్టోబరు 25న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ జి.ఆర్‌.రాధిక విలేకర్లకు వెల్లడించారు.కొత్తూరు అఫీషియల్‌ కాలనీకి చెందిన జన్ని అప్పన్న స్థానిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈయన గతేడాది అక్టోబరు 25న కుటుంబంతో బయటకెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలోని రూ.21.50 లక్షలతో పాటు, 5 తులాల బంగారం గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో, ఈ ఏడాది ఏప్రిల్‌ 30న ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తుండగా అప్పన్న చెల్లెలు భర్త అయిన భామిని మండలం పెద్దదిమిలి గ్రామానికి చెందిన పక్కి ఏడుకొండలుపై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆపై ఆయన నేరాన్ని అంగీకరించారు.

స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం

- న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం


దర్జాగా తాళం తీసుకుని వెళ్లి..

ఏడుకొండలు భామిని మండలం లివిరి పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌, గేమ్స్‌, బీట్‌ కాయిన్స్‌లో భారీ ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. అసలే కరోనా సమయం,  ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇంతలో అప్పన్న కుమారుడికి వివాహం జరగడంతో ఇంట్లోనే నగదు ఉన్నట్లు తెలుసుకున్నాడు. అప్పన్న ఇంటి తాళం ఎక్కడ ఉంటుందో గ్రహించిన ఏడుకొండలు దర్జాగా తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. బీరువాలో ఉన్న నగదు, బంగారంతో వెళ్లిపోయాడు. చోరీ చేసిన రూ.21.50 లక్షలు ఒకేసారి బ్యాంకులో జమ చేస్తే దొరికిపోతానని భావించి ఇంట్లోనే ఉంచాడు. చివరికి చిక్కాడు. నిందితుడి నుంచి పోలీసులు నగదు, బంగారం స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. అదనపు ఎస్పీ(కైమ్స్‌) పి.విఠలేశ్వరరావు పర్యవేక్షణలో కేసును ఛేదించిన కొత్తూరు సీఐ చంద్రమౌళి, క్రైమ్‌ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts