logo

సూర్యాస్తమయాన ఉదయించిన సిక్కోలు

దేశ వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్న వేళ.. స్వాతంత్య్ర పోరాట ఫలాలు ఆస్వాదిస్తున్న క్షణాలు.. బానిస సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న సమయాలు.. ఆ సంతోష వేడుకలను కనులారా చూసింది సిక్కోలు గడ్డ.. అదే పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకుంది..

Updated : 09 Aug 2022 07:20 IST

స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో జిల్లా సాధన
- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, సాంస్కృతికం

దేశ వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్న వేళ.. స్వాతంత్య్ర పోరాట ఫలాలు ఆస్వాదిస్తున్న క్షణాలు.. బానిస సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న సమయాలు.. ఆ సంతోష వేడుకలను కనులారా చూసింది సిక్కోలు గడ్డ.. అదే పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకుంది.. ఆలన..పాలన పరంగా ఎదురవుతున్న సమస్యలకు స్వస్తిపలకాలనుకుంది.. అంతే.. సిక్కోలు జిల్లా డిమాండ్‌కు శ్రీకారం చుట్టింది.. ఉద్యమాలు, డిమాండ్ల ఫలితంగా ఏరోజైతే స్వాతంత్య్రం రుచి చూశారో.. అదే రోజు ప్రకటనతో ఇక్కడి ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది.. ‘ఆజాదీకా అమృత మహోత్సవాలు’ సందర్భంగా నాటి ఘట్టాలను స్మరించుకుందాం.. పోరాట స్ఫూర్తిని అందుకుని, జిల్లా అభివృద్ధికి బాటలు వేద్దాం..    

ఒడిశా నుంచి ప్రత్యేక విశాఖపట్నం ప్రత్యేక జిల్లాగా 1936లో  ఏర్పాటైంది. అప్పట్లో శ్రీకాకుళం విశాఖలో ఒక రెవెన్యూ డివిజన్‌గా మాత్రమే ఉండేది. అభివృద్ధి, పరిపాలనాపరంగా అనేక సమస్యలను ఎదుర్కొనేవారు ఇక్కడి ప్రజలు. దీంతో స్వాతంత్య్రం నాటికి అంటే 1948 నాటికే జిల్లా ఏర్పాటుకు స్థానిక నాయకులు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వం అంగీకరించినా జిల్లా కేంద్రం ఎంపికలో విభేదాలొచ్చాయి. ఫిబ్రవరిలో జిల్లా ఏర్పాటు చేయాలని భావించినా జాప్యం చోటుచేసుకుంది. స్వాతంత్య్రం అనంతరం కూడా సిక్కోలు నాయకులు వెనుకడుగు వేయలేదు. జిల్లా ఏర్పాటుకు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు.

బలమైన డిమాండ్‌..

1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిల్లా ప్రముఖుల దృష్టి అంతా జిల్లా ఏర్పాటుపైనే పడింది. 1950 జులై 17న ఆనాటి రెవెన్యూ శాఖ మంత్రి హెచ్‌.సీతారామరెడ్డి శ్రీకాకుళం ప్రాంత పర్యటనకొచ్చే ముందు చల్లా నర్సింహులు నాయుడు, పుల్లెల వెంకట రమణయ్య విజయనగరం వెళ్లి జిల్లా కేంద్రంగా శ్రీకాకుళాన్నే ఎంపిక చేయాలని కోరారు. దీంతో సీతారామరెడ్డి శ్రీకాకుళంలో కొన్ని ప్రదేశాలు స్వయంగా చూశారు. సీతారామిరెడ్డికి నచ్చజెప్పిన బృందంలో రొక్కం రామ్మూర్తి(ఎమ్మెల్యే), పసగాడ సూర్యనారాయణ, బరాటం వెంకట రమణయ్య, మంగు రాఘవరావు ఉన్నారు. బలిజేపల్లి నాగేశ్వర శాస్త్రి ప్లానులు, మ్యాపులతో మంత్రికి వివరించారు.

* ఉద్యమ కాలంలో మద్రాసు రాజధానిగా ఉన్నందువల్ల ఈ చివరగా ఉన్న విశాఖ జిల్లాను విభజించి శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు, డిమాండ్లు అందాయి. ఆ రోజుల్లో కోల్‌కతా, మద్రాసు మధ్య ఒక మెయిల్‌ రైలు మాత్రమే నడిచేది. ఉదయం ఆరు గంటలకు ఇచ్ఛాపురంలో మెయిల్‌ ఎక్కితే తూర్పుగోదావరి సరిహద్దున ఉన్న తుని రైల్వేస్టేషన్‌కు చేరుకోవడానికి సాయంత్రం ఆరు గంటలయ్యేది. అంటే 12 గంటలపాటు ఒకే జిల్లాలో మెయిల్‌ ప్రయాణం జరిగేది.

నాటి కలెక్టరేట్‌


పెట్రోమాక్స్‌ వెలుగుల నడుమ..

ఇక్కడి నాయకుల అభిప్రాయం మేరకు 1950 జులై చివరిలో రెవెన్యూ మంత్రి హెచ్‌.సీతారామరెడ్డి శ్రీకాకుళం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం 1950 ఆగస్టు 15న సూర్యాస్తమయం సమయంలో శ్రీకాకుళం అవతరించింది. అదేరోజు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో అవతరణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ షేక్‌ అహ్మద్‌ తన నివాసం నుంచి ప్రస్తుత జిల్లా జడ్డి కోర్టు భవన సముదాయంలో ఉన్న కలెక్టర్‌ కార్యాలయానికి బయలుదేరారు. దారిమధ్యలో ఆయన వాహనం చెడిపోవడంతో మరో వాహనాన్ని పంపించారు. ఆయన వచ్చేసరికి సూర్యస్తమయం అయింది. చీకటి అలముకుంది. అప్పటికప్పుడు పెట్రోమాక్స్‌ లైట్ల కాంతిలో కార్యక్రమం జరిపించారు. అలా శ్రీకాకుళం జిల్లా అవతరించింది.


తొలి కలెక్టరు జనాబ్‌ షేక్‌ అహ్మద్‌..

జిల్లా ఏర్పడేనాటికి కలెక్టర్‌గా ‘మిస్టర్‌ వైట్’ ఉండేవారు. 1950 ఆగస్టు 15న జిల్లా ఏర్పడిన తర్వాత జనాబ్‌ షేక్‌ అహ్మద్‌ తొలి కలెక్టరుగా నియమితులయ్యారు. 1951 జనవరి 31న జిల్లా బోర్డు అధ్యక్షుడి ఎన్నిక విశాఖ జిల్లా బోర్డు భవనంలో జరిగింది. 1959 డిసెంబరు ఒకటిన అధికారికంగా ఏర్పాటైన బోర్డుకు బెండి కూర్మన్న అధ్యక్షుడిగా, కొత్తపల్లి పున్నయ్య ఉపాధ్యక్షుడిగా  ఎన్నికయ్యారు.


మళ్లీ విభజన..

* 1979లో శ్రీకాకుళం నుంచి విజయనగరం జిల్లా ఏర్పడింది. తర్వాత మూడు రెవెన్యూ డివిజన్లు, 38 మండలాలకు పరిమితమైంది. తాజాగా ఇదే ఏడాది రాజాం నియోజకవర్గం విజయనగరంలోనూ, పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలోనూ విలీనం కావడంతో పలాస, టెక్కలి, శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లలోని 30 మండలాలతో సిక్కోలు జిల్లాగా నిలిచింది.


అనేక మార్పులు...

1950 నాటికి సాలూరు, బొబ్బిలి తాలూకాలు శ్రీకాకుళంలోనే ఉండేవి. 1969లో సాలూరు తాలూకాలోని 63 గ్రామాలు, బొబ్బిలిలోని 44 గ్రామాలను విశాఖ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన గజపతినగరం తాలూకాకు బదలాయించారు. మళ్లీ 1979 మేలో కొత్తగా విజయనగరం జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి తాలూకాలను విలీనం చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని