logo

అమ్మో..రణస్థలమా

జిల్లాలోనే అత్యధికంగా పరిశ్రమలు, వ్యవసాయ మోటార్లు, గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్న ఏకైక మండలం రణస్థలం. ఇక్కడ తీరప్రాంతం సైతం ఎక్కువే. ఇలాంటి చోటుకు వచ్చేందుకు గతంలో పలువురు అధికారులు పోటీ పడేవారు. నేడు ఇందుకు భిన్నంగా మారిపోయింది. ఇక్కడ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ఎవరూ ఈ

Published : 10 Aug 2022 04:08 IST

ఇక్కడికొచ్చేందుకు విద్యుత్తు సిబ్బంది నిరాసక్తత

 న్యూస్‌టుడే, రణస్థలం

జేఆర్‌పురంలో విద్యుత్‌ స్తంభాలకు అల్లుకున్న తీగలు

జిల్లాలోనే అత్యధికంగా పరిశ్రమలు, వ్యవసాయ మోటార్లు, గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్న ఏకైక మండలం రణస్థలం. ఇక్కడ తీరప్రాంతం సైతం ఎక్కువే. ఇలాంటి చోటుకు వచ్చేందుకు గతంలో పలువురు అధికారులు పోటీ పడేవారు. నేడు ఇందుకు భిన్నంగా మారిపోయింది. ఇక్కడ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ఎవరూ ఈ ప్రాంతంలో పని చేసేందుకు  ఇష్టపడటం లేదు.    రణస్థలం మండలంలో ముఖ్యంగా విద్యుత్తు శాఖలో ఖాళీలు పేరుకుపోయాయి. ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో విద్యుత్తు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కేవలం మండల కేంద్రంలోనే కాక గ్రామీణ, తీర ప్రాంతాల్లో సరఫరా గగనంగా మారుతోంది. చినుకు పడితే రోజంతా కష్టాలే. ఏమంటే సిబ్బంది లేరని అధికారులు సమాధానమిస్తున్నారు. ప్రతిరోజూ ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వాణిజ్య దుకాణాలు, గృహవినియోగదారులు విసిగిపోతున్నారు. ఇక్కడ లైన్‌మెన్లు, ఏఎల్‌ఎంలు, జూనియరు లైన్‌మెన్ల ఖాళీలు ఉన్నప్పటికీ ఇక్కడకు రాకుండా ఇతర ప్రాంతాలకు పరిమితమవుతున్నారు. ఇటీవల బదిలీల్లో ఇక్కడ వారు ఇతర ప్రాంతాలకు వెళ్లారే తప్ప వేరేచోట నుంచి ఇక్కడికి ఎవరూ రాకపోవడంతో సమస్య మరింత ఎక్కువైంది.  

అత్యధిక కనెక్షన్లు..

మండలంలో 3,667 వ్యవసాయ మోటారు, 30 భారీ, చిన్నతరహా పరిశ్రమలు, 28,194 గృహవిద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. సాధారణంగా పది వేల కనెక్షన్లకు ఒక ఏఈ, ఇతర సిబ్బంది ఉండాలి. కానీ ఇన్నివేల కనెక్షన్లు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

కొరత ఇలా..

రణస్థలం, కోష్ట, పైడిభీమవరం, పాతర్లపల్లి, ఎర్రవరంలలో విద్యుత్తు ఉప కేంద్రాలున్నాయి. పైడిభీమవరం, ఎర్రవరం, పాతర్లపల్లికి లైనుమెన్లు లేరు. ఏఎల్‌ఎంలు నలుగురికి ఒక్కరూ లేరు. జేఎల్‌ఎంలు ఇద్దరు ఉన్నా ఈ నెలలో ఒకరు ఉద్యోగ విరమణ పొందనున్నారు. 28 గ్రామ సచివాలయాల ఎనర్జీ అసిస్టెంట్లకు 20 మందే ఉన్నారు.

తరచూ ఇబ్బందులే..

ఎర్రవరం సబ్‌స్టేషను పరిధిలో తరచూ విద్యుత్తు అంతరాయాలు కలుగుతున్నాయి. ఇక్కడ లైన్‌మెన్‌ లేకపోవడంతో ఈ ఫీడరు పరిధిలో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడికక్కడే తీగలు తెగిపడిపోతున్నాయి. తీర ప్రాంతమైన జీరుపాలెం, కొవ్వాడ, కోటపాలెం, ఎన్‌జీఆర్‌పురం, మైదాన ప్రాంతాలైన తిరుపతిపాలెం, జేఆర్‌పురం తదితర ప్రాంతాల్లో అధికంగా సమస్యలు నెలకొంటున్నాయి.  


ఇటీవల ఇక్కడి నుంచి కొంతమంది వేరే చోటుకు బదిలీ అయ్యారు. ఎర్రవరం, పైడిభీమవరాలకు లైన్‌మెన్లను కేటాయించినప్పటికీ ఇంకా చేరలేదు. 20 మంది ఎనర్జీ అసిస్టెంట్లు ఉన్నారు. వారి సేవలు వినియోగిస్తున్నాం. సిబ్బందిని పూర్తిస్థాయిలో కేటాయించి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం.

- సీహెచ్‌ పాత్రుడు, డీఈ, ఈపీడీసీఎల్‌, శ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని