logo

ఇదీ తీరు... సురక్షితమేనా నీరు?

జలం.. అందరికీ ప్రాణాధారం. అలాంటి మంచినీరే కలుషితమైతే ప్రజలు డయేరియా, కామెర్లు వంటి రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ఈ విషయంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ నిర్లక్ష్యం వహిస్తోంది. నగరవాసులు తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు మురుగు కాలువల్లో ఉంటున్నాం.. వాల్వులకు లీకులు ఏర్పడుతున్నా మొక్కుబడి చర్యలతో

Published : 10 Aug 2022 04:08 IST

మురుగు నీటిలో తాగునీటి   పైపులైన్లు

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

గొంటివీధిలోని మురుగునీటిలో వ్యక్తిగత కుళాయి పైపులైను

జలం.. అందరికీ ప్రాణాధారం. అలాంటి మంచినీరే కలుషితమైతే ప్రజలు డయేరియా, కామెర్లు వంటి రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ఈ విషయంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ నిర్లక్ష్యం వహిస్తోంది. నగరవాసులు తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు మురుగు కాలువల్లో ఉంటున్నాం.. వాల్వులకు లీకులు ఏర్పడుతున్నా మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్నారు. క్లోరినేషన్‌ సైతం అరకొరగా చేపడుతుండటంతో తాగునీరే సురక్షితమేనా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

నగరంలోని పుణ్యపువీధి, ఇల్లీసుపురం, చిన్నబరాటం వీధి, గూనపాలెం, బలగ హడ్కోకాలనీ, రైతుబజార్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో వ్యక్తిగత కుళాయిల పైపులైన్లులో దాదాపు 50 శాతం మురుగు కాలువల్లోనే ఉన్నాయి. చాలా చోట్ల ఇనుప పైపులైన్లు నిత్యం ఈ మురుగు నీటిలో ఉండటంతో నాని తుప్పుపట్టి పోతున్నాయి. వాటిపైన గతంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ రబ్బరు లాంటిది సైతం కానరావట్లేదు. కొన్ని చోట్ల పరిస్థితి చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. దీనిపై నగరవాసులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి.

మేల్కోకుంటే తప్పదు ముప్పు: గతంలో రాష్ట్రంలోని గుంటూరు కార్పొరేషన్‌లో పైపులైన్లు లీకుతో మురుగు కాలువల్లో నీటితో కలుషితమైంది. ఆ నీరు తాగి ప్రజలు వందల సంఖ్యలో  ఆస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. కొందరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలికల్లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నగరంలోనూ నీటిసరఫరా చేసే ముందు ఆ నీటి నమూనాలను తీసుకుని నాణ్యతా ప్రమాణాలు తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించేవారు. సురక్షితం అని నిర్ధారణ అయిన తరువాత సరఫరా చేసేవారు. క్రమం తప్పకుండా క్లోరినేషన్‌ చేసేవారు. నాణ్యమని తేలిన తరువాతే రిజర్వాయర్లకు పపంఏవారు. ప్రస్తుతం అవేమీ జరగడం లేదు. పూర్తిస్థాయిలో క్లోరినేషన్‌ చేస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. గుంటూరు ఘటన జరిగిన తరువాత నగరంలో మురుగునీటిలో ఉన్న కుళాయిన పైపులైన్లను సుమారు 500కుపైగా గుర్తించి మార్చారు. ఆ తరువాత మళ్లీ విస్మరించడంతో అధిక సంఖ్యలో వ్యక్తిగత కుళాయిలు, పైపులైన్లు మురుగునీటి కాలువల్లోనే కనిపిస్తున్నాయి.


ఈ చిత్రంలో మురుగునీటి కాలువలో కనిపిస్తున్నది పి.ఎన్‌.కాలనీ నుంచి బైరివానిపేట, సీపన్నాయుడుపేటకు వెళ్లే ప్రధాన పైపులైను. దీని ద్వారా సుమారు 500కుపైగా కుళాయిలకు నీటి సరఫరా జరుగుతుంది. కాలువలో ప్రవాహం పెరిగితే కొన్నిసార్లు పైపులైన్‌ కనిపించని పరిస్థితి కూడా ఉంటుంది. ఇది ఏ మాత్రం లీకేజీకి గురైన తాగునీరు కలుషితంకాక తప్పదనేది స్పష్టమవుతోంది.


డివిజన్లలో సర్వే చేయిస్తాం...

నగరంలో మురుగు కాలువల్లో ఉన్న పైపులైన్లను కొంత మేర మార్చాము. ఈ విషయమై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. మరోసారి అన్ని డివిజన్లలో సర్వే చేయిస్తాం. అక్కడి పరిస్థితి ఆధారంగా అవసరమైన చోట పైపులైన్లను మార్చేందుకు చర్యలు తీసుకుంటాం. నీటి పరీక్షలు, క్లోరినేషన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాం.

-చల్లా ఓబులేసు, నగరపాలక సంస్థ కమిషనర్‌, శ్రీకాకుళం

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని