logo

యువత ఇంట.. పాడిపంట..!

వారంతా ఉన్నత చదువులు అభ్యసించారు. కానీ ఎక్కడికో వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడలేదు. ఉన్నఊరిలో స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నారు. తమతో పాటు మరికొందరికి ఆర్థిక భరోసా ఇవ్వాలనే పాడిబాట పట్టారు. బ్యాంకు నుంచి రుణం పొంది విజయవంతంగా ముందుకు సాగుతున్నారు.

Published : 10 Aug 2022 04:08 IST

చల్లవానిపేట వద్ద పాడి పరిశ్రమలో ఉన్న ఆవుల్కు

జలుమూరు, నరసన్నపేట, న్యూస్‌టుడే: వారంతా ఉన్నత చదువులు అభ్యసించారు. కానీ ఎక్కడికో వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడలేదు. ఉన్నఊరిలో స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నారు. తమతో పాటు మరికొందరికి ఆర్థిక భరోసా ఇవ్వాలనే పాడిబాట పట్టారు. బ్యాంకు నుంచి రుణం పొంది విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్న జలుమూరు మండలం చల్లవానిపేటకు చెందిన యువతపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..

గ్రామానికి చెందిన వైద్యభూషణ సతీష్‌, పాలవలస ప్రదీప్‌, వాసుదేవరావు పట్నాయక్‌ బాగా చదువుకున్నారు. స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో బ్యాంకు నుంచి రూ.20 లక్షలు రుణం పొందారు. చెరో కొంత నగదు పోగు చేసి 17 పాడిఆవులను కొనుగోలు చేశారు. ప్రస్తుతం రోజుకు 120 లీటర్ల పాలు అమ్ముతున్నారు. మరో 50 నాటుకోళ్లు పెంచుతూ వాటి గుడ్లను విక్రయిస్తున్నారు. రెండెకరాల విస్తీర్ణంలో పశు దాణాను పెంచుతున్నారు. యువకులే సొంతంగా దాణాను తెచ్చి యంత్రాల సాయంతో చిన్నచిన్న ముక్కలు చేసి ఆవులకు వేస్తున్నారు. తీసిన పాలలో విశాఖడెయిరీకి కొంతమేర పాలు ఇస్తూ లీటరుకు రూ.38 పొందుతున్నారు. ప్రైవేటు వర్తకులకు అమ్మి లీటరు పాలకు రూ.50 పొందుతున్నారు. ఇలా నెలకు రూ.1.20 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నారు. మరో నలుగురికి ఉపాధి చూపుతున్నారు.


మరింత విస్తరిస్తాం...

ఎంసీఏ చదువు పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధపడ్డాను. ఇంతలో కొవిడ్‌ రావడంతో ఎలాంటి పోటీ పరీక్షలు లేవు. దాంతో చేసేది లేక పాడి పరిశ్రమ పెట్టాలన్న ఆలోచన కలిగింది. మా పెద్దలను సంప్రదించి పాడి పరిశ్రమ ఏర్పాటు చేశాం. విడతల వారీగా దీన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నాం.

-వైద్యభూషణ సతీష్‌, ఎంసీఏ విద్యార్థి, చల్లవానిపేట


మిత్రుని ఇంటి వద్ద చూసి..

చిన్నప్పుడు నా స్నేహితుడి ఇంటికి వెళ్తే అక్కడ వారు పాడిపరిశ్రమను నిర్వహించేవారు. అప్పుడే నాలో స్వగ్రామంలోనే వాటి ద్వారా ఆదాయం పొందాలనే ఆలోచనవచ్చింది. ముగ్గురి అభిప్రాయాలు కలవడంతో పాడిపరిశ్రమ ఏర్పాటు చేశారు. యాంత్రీకరణను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం.

- పాలవలస ప్రదీప్‌, బీఎస్సీ


సంతృప్తిగా ఉంది...

ఉన్నత చదువులు చదివి ఎవరి వద్దో పనిచేసే కన్నా సొంతంగా అభివృద్ధి చేందాలన్నది నా ఆలోచన. చివరికి ఇలా పాడిపరిశ్రమ ఏర్పాటుచేసి సొంతంగా పశువులకు దాణా అందించడం, వాటి బాగోగులు చూడటం, రాత్రింబవళ్లు పరిశ్రమ వద్ద ఎక్కువసేపు గడిపి మరింత పాల దిగుబడి పెంచేలా కృషి చేస్తున్నాం. తల్లిదండ్రుల దగ్గర ఉన్నామన్న సంతృప్తి కలుగుతుంది.

-వాసుదేవరావు పట్నాయక్‌, ఎంబీఏ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని