logo

సిక్కోలు సిగలో ప్రగతి ఫలాలు

సిక్కోలు.. రాష్ట్రంలోనే వెనకబడిన ప్రాంతాల్లో ఒక్కటి.. ఈ మాటను రూపుమాపుకొంటూ రాజకీయ, సామాజిక చైతన్యంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.. స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్ల కాలంలో జిల్లా ఒక్కో రంగంలో ప్రగతి మెట్లు ఎక్కుతూ పయనిస్తోంది. ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుంటూ, ప్రకృతి విపత్తులను అధిగమిస్తూ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటోంది.

Published : 13 Aug 2022 03:32 IST

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

సిక్కోలు.. రాష్ట్రంలోనే వెనకబడిన ప్రాంతాల్లో ఒక్కటి.. ఈ మాటను రూపుమాపుకొంటూ రాజకీయ, సామాజిక చైతన్యంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.. స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్ల కాలంలో జిల్లా ఒక్కో రంగంలో ప్రగతి మెట్లు ఎక్కుతూ పయనిస్తోంది. ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుంటూ, ప్రకృతి విపత్తులను అధిగమిస్తూ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటోంది. విద్య, వైద్య, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో వడివడిగా ముందుకు సాగుతోంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాన.. జిల్లా ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధి ఏమిటి..? ఇంకా సాధించాల్సిన ప్రగతి ఏమిటో పరిశీలిద్దాం..

మత్స్య సంపదకు కొదవే లేదు..

సువిశాల సముద్ర తీర ప్రాంతం జిల్లా సొంతం. ఎన్నో అరుదైన జలచరాలు  లభ్యమవుతున్నాయి. మత్స్య సంపదకు కొదవే లేదు. 104 గ్రామాలకు చెందిన 1.12 లక్షల మంది మత్స్యకారులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు 2,500 హెక్టార్లలో చేపలు, రొయ్యల సాగు జరుగుతోంది. వీటి పెంపకానికి జిల్లాలోని తీరప్రాంతం  అనుకూలం. గత కొన్నేళ్లుగా వీటి సాగు క్రమంగా పెరుగుతోంది.


ఇవి సాధిస్తే అభివృద్ధి పరుగే

2.13 లక్షల హెక్టార్లలో..

సిక్కోలు పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా. ఖరీఫ్‌లో 2.13 లక్షల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, చెరకు పంటలు ఇక్కడి ప్రత్యేకం. నీటి వనరులు అభివృద్ధి చెందడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది.


పేదరికం, నిరక్షరాస్యతతో కొట్టుమిట్టాడిన జిల్లా నేడు అక్షరాస్యతలో దూసుకుపోతోంది. చదువు విలువ తెలుసుకుని తమ పిల్లలను ఉన్నత విద్య చెప్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంజినీరింగ్‌, వైద్య, ఐఐటీ చదువుల్లోనూ రాణిస్తున్నారు.


రహదారుల పొడవు (కిలోమీటర్లలో)

స్వాతంత్య్రం తర్వాత రహదారుల విస్తరణలో పురోగతి  ఉంది. జిల్లా మీదుగా వెళ్లే ఎన్‌హెచ్‌-16 ఆరు వరుసలుగా రూపాంతరం చెందడంతో రవాణా సులభతరమైంది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, గ్రామీణ దారులు మెరుగుపడ్డాయి.  


మన దగ్గరే విశ్వవిద్య.. 

ఎచ్చెర్ల వద్ద ఉన్న ఏయూ స్టడీసెంటర్‌ నేడు అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం మారింది. దీంతో జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకొచ్చింది. దీనికి అనుబంధంగా జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాలలు ఏర్పడ్డాయి.

కొబ్బరి అంటే ఉద్దానం..

కోనసీˆమ తర్వాత కొబ్బరి ఎక్కువగా పండించేది ఉద్దానంలోనే. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఉద్యానవనంగా పిలిచేవారు.  ఇక్కడ పండించే కొబ్బరి పంట రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు పక్క రాష్ట్రాలకూ ఎగుమతి అవుతోంది. దాదాపు 25 వేల ఎకరాల్లో కొబ్బరి పంట సాగవుతోంది.

రుచిలో మేటి పలాస జీడిపప్పు

పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలు జీడి పంటకు పెట్టింది పేరు. పలాస జీడిపప్పుకి దేశ వ్యాప్తంగా పేరు ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. 40,500 ఎకరాల్లో జీడి పంట సాగవుతోంది. విలువ ఆధారిత ఉత్పత్తులు ఇక్కడే తయారయ్యేలా చేయగలిగితే జిల్లా అభివృద్ధిలో ఇది కీలకంగా మారుతుంది.


నాణ్యమైన వైద్యమే కీలకం..  

గతంతో పోల్చితే వైద్య, ఆరోగ్య రంగంలో ఎన్నో సంస్కరణలు వస్తున్నాయి. గ్రామంలోనే మెరుగైన వైద్య సేవలు అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అవసరమైన వైద్యం కోసం పేదవాడు వెళ్లాల్సిన దూరం క్రమంగా తగ్గుతోంది. అదే క్రమంలో నాణ్యమైన వైద్యం కూడా అందాలి. అవసరమైన అన్ని సదుపాయాలు నియోజకవర్గ స్థాయి ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి.

- కె.సి.చంద్రనాయక్‌, విశ్రాంత జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి


ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి

ఇతర దేశాల్లో ప్రభుత్వ విద్యపైనే ఆధారపడే వారు ఎక్కువ. అక్కడే నాణ్యమైన విద్య అందుతుంది. మన దగ్గరా ఆ విధానం రావాలి. గతం కంటే ఇప్పుడు నిధులు ఖర్చు చేస్తున్నారు. వృత్తి విద్య కూడా అదేస్థాయిలో అందుబాటులో ఉండాలి. డిమాండ్‌, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విద్యా విధానాల్లో మార్పులు తేవాలి.

- బలివాడ మల్లేశ్వరరావు, విశ్రాంత డీఈవో


పెండింగ్‌ ప్రాజెక్టులు పట్టాలెక్కితే బాగు..

దాదాపు రూ.2 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన వంశధార రిజర్వాయర్‌, నేరడి బ్యారేజీ కల నెరవేరితే జిల్లా సస్యశ్యామలమే. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన జిల్లాలో అన్ని మూలలకూ నీరందించే అవకాశముంది. పెండింగ్‌ ప్రాజెక్టులు వినియోగంలోకొస్తే పంటకాలం ఆలస్యాన్ని నివారించవచ్చు. దిగుబడులు పెంచొచ్చు. 

 - డోల తిరుమలరావు, వంశధార ఎస్‌ఈ


యువత వ్యవసాయం వైపు అడుగేయాలి

వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతోంది. వాటిని వినియోగించాలంటే యువతకే సాధ్యం. ఇప్పటికే ఈ రంగంలోని యువత బయటకెళ్లకుండా చూడాలి. భూమి లేకపోయినా  పండించే విధానాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అవి మరింత వృద్ధి చెందుతాయి. పంట చేతికొచ్చిన తర్వాత రైతులే నేరుగా మార్కెటింగ్‌ చేసుకునేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి.  

- డాక్టర్‌ కె.చిన్నంనాయుడు, ప్రొఫెసర్‌, నైరా వ్యవసాయ కళాశాల


ఔత్సాహికులకు ప్రోత్సాహం..

పరిశ్రమలు నెలకొల్పడమంటే ఉపాధి దొరికినట్లే. అలాంటి పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలి. యువత ఉద్యోగాల వైపు కాక నైపుణ్యాలు అలవర్చుకుని పారిశ్రామిక రంగం వైపు మొగ్గు చూపాలి.  చిన్న కారణాలతో మూతపడిన పరిశ్రమలు మళ్లీ తెరుచుకునేలా చేయాలి. జిల్లాలోని వనరుల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహమివ్వాలి.  

- తాళ్లూరి రామ్మోహన్‌రావు,  ఐలా ఎక్స్‌ ఛైర్మన్‌

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts