logo
Published : 13 Aug 2022 03:32 IST

పంట పొలాల్లో వృద్ధుడి హత్య

రామయ్యతాత(పాత చిత్రం)

గార, న్యూస్‌టుడే: ఇంటి నుంచి పనికి వెళ్లేందుకు బయలుదేరిన ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గార మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని తోణంగి పంచాయతీ బచ్చువానిపేటకు చెందిన బచ్చు రామయ్యతాత(72) శుక్రవారం తెల్లవారుజామున క్యారేజీ తీసుకుని పనికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. గ్రామం నుంచి పంట పొలాల గట్లపై అడ్డుదారిలో కొర్లాం వెళ్తుండగా మార్గంమధ్యలో పెద్దచెరువు సమీపంలో దుండగులు దారి కాసి ఆయనను హత్య చేశారు. పొలంలో విగతజీవిగా పడి ఉన్న ఆయనను చూసి స్థానికులు గ్రామస్థులకు సమాచారం అందించారు. అనంతరం విషయం తెలియడంతో డీఎస్పీ మహేంద్ర, సీఐ అంబేద్కర్‌, ఎస్‌.ఐ. మధుసూదనరావు, పొలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌టీం వివరాలు సేకరించాయి. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. కుమారుడు అప్పన్న ఫిర్యాదు మేరకు ఎస్‌.ఐ. కేసు నమోదు చేశారు. సీఐ అంబేద్కర్‌ దర్యాప్తు చేస్తున్నారు.


తాపీ పనిచేస్తూ జారిపడి మృత్యువాత


ఆదినారాయణ

సారవకోట, న్యూస్‌టుడే: సారవకోట మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన పట్ట ఆదినారాయణ (50) నెల్లూరులోని నాయుడుపేటలో తాపీ పని చేస్తూ ప్రమాదవశాత్తు రెండంతస్థుల ఎత్తయిన పరంజాపైనుంచి జారిపడి శుక్రవారం మృతిచెందారు. కొన్నేళ్లక్రితం ఆదినారాయణ చెన్నై, నెల్లూరు ప్రాంతాలకు వలసవెళ్లి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. గ్రామంలో సొంత ఇళ్లు మినహా ఇతర ఆస్తుల్లేవు. ఈయనకు భార్య రమణమ్మ, కుమార్తె చిన్నమ్మి, కుమారుడు జగదీష్‌ ఉన్నారు. కుమార్తెకు వివాహమవడంతో భార్య, కుమారుడితో నెల్లూరులోనే నివాసముంటున్నారు. భార్య, కుమారుడు అక్కడే పనిచేస్తుండగా వారి కళ్లెదుటే ఈ ప్రమాదం జరిగింది. నెలరోజుల కిందటే కుటుంబంతో స్వగ్రామానికి వచ్చి వెళ్లారు. మృతదేహాన్ని శనివారం వెంకటాపురం గ్రామానికి తీసుకురానున్నారు.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని