logo

మరో ఝాన్సీ.. మన గున్నమ్మ

అవును.. నాటి ఝాన్సీ లక్ష్మీభాయి.. బిడ్డను వీపున కట్టుకుని తెల్లవారిపై పోరాటం చేస్తే.. మన వీరనారి గున్నమ్మ నిండు గర్భిణిగా తెల్లవారి తొత్తులైన పోలీసులను ఎదిరించింది. వారు ఓ వైపు కాల్పులకు దిగుతున్నా వెనుకంజ వేయలేదు. తూటాలకు నేలకొరిగినా.. ఎందరికో స్ఫూర్తిగా ఆకాశాన నిలిచారు.

Updated : 14 Aug 2022 05:44 IST

మందస, న్యూస్‌టుడే


గున్నమ్మ ఊహా చిత్రం

అవును.. నాటి ఝాన్సీ లక్ష్మీభాయి.. బిడ్డను వీపున కట్టుకుని తెల్లవారిపై పోరాటం చేస్తే.. మన వీరనారి గున్నమ్మ నిండు గర్భిణిగా తెల్లవారి తొత్తులైన పోలీసులను ఎదిరించింది. వారు ఓ వైపు కాల్పులకు దిగుతున్నా వెనుకంజ వేయలేదు. తూటాలకు నేలకొరిగినా.. ఎందరికో స్ఫూర్తిగా ఆకాశాన నిలిచారు. ఈ నేల గర్వపడేలా చేశారు. గుడారిరాజమణిపురాన్ని వీరగున్నమ్మపురంగా సిక్కోలు పోరుగడ్డగా ప్రఖ్యాతి గాంచేలా చేసిన వీరనారి మన గున్నమ్మ.

పోరాటమే శరణ్యమని..:  అది 1940 ప్రాంతం.. తెల్లదొరల పాలన నడుస్తున్న రోజులవి. రైతులు తాము పండించిన పంటలో మూడొంతులు జమిందారులకు శిస్తు కట్టేవారు. మిగిలినవి సాలుసరి తిండికి చాలక నానాబాధలూ పడేవారు. ఈ దుర్భర పరిస్థితులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం గుడారిరాజమణిపురం ప్రజలను ఎంతగానో ఆలోచింపజేసింది. జమిందారుల పీడ నుంచి విముక్తి పొందాలంటే పోరాటాలే శరణ్యమని భావించారు. రైతులంతా ఏకమయ్యారు.

పన్ను చెల్లించకూడదని నిర్ణయించి.. : మందస ఎస్టేటు పరిధిలోని అడవుల నుంచి నాటుబళ్లపై కలప తెచ్చుకునేందుకు అంతా సన్నద్ధమయ్యారు. తెచ్చిన కలపకు ఏ పరిస్థితుల్లోనూ పన్ను చెల్లించకూడదని నిర్ణయించారు. అనుకున్నట్లుగా అడవుల నుంచి నాటుబళ్లపై కట్టెలు (వంట చెరకు)తో గ్రామానికి చేరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాటి మందస ఎస్టేటు దివాను రామకృష్ణదేవ్‌ విషయాన్ని సర్కారుకు చేరవేశారు. వెంటనే డీఎస్పీ మునిలాల్‌ పోలీసు బలగాలతో గ్రామానికి వెళ్లి కొందరిని అరెస్టు చేశారు. రైతులు ఆగ్రహానికి గురై తిరగబడ్డారు. అరెస్టయినవారిని విడిపించుకున్నారు.

హూంకరించి..
సబ్‌కలెక్టరు చక్రవర్తి అదనపు పోలీసు బలగాలతో 1940 ఏప్రిల్‌ 1న గ్రామానికి వచ్చారు. చర్చల పేరుతో రైతులను తీసుకెళ్తుండగా వారిని అరెస్టు చేసేందుకేనని భావించి సాసుమాన గున్నమ్మ అపర కాళిలా పోలీసులపై హూంకరించారు. ఆమె స్ఫూర్తితో రైతులు కర్రలతో ఎదురుదాడికి దిగారు. బెదరగొట్టేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. ఎవరూ వెనుకంజవేయలేదు.  ముందుకే సాగిన నిండు గర్భిణి గున్నమ్మ నేలకొరిగి వీర మరణం పొందింది. ఆమెతో పాటు సమీప గ్రామానికి చెందిన గొర్లె జగ్గయ్య, గుంట బుడియాడు, కర్రి కలియాడు, గుంట చిననారాయణ కూడా వీరమరణం పొందారు.


స్మారకంగా..  

గ్రామాన్ని 1988లో గవర్నరు శ్రీమతి కముద్‌బెన్‌జోషి సందర్శించారు. గున్నమ్మ నేలకొరిగిన చోట ఏర్పాటు చేసిన స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. గ్రామానికి వీరగున్నమ్మపురంగా నామకరణం చేసి ప్రభుత్వ గెజిట్‌లో మార్పు చేయించారు. ఈమె త్యాగానికి స్మృతిగా గ్రామానికి వెళ్లే దారిలో పోరాట చిహ్నాలతో సింహద్వారాన్ని ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని