logo

దేవుడా.. నువ్వే కాపాడు!

తీర రక్షణలో ప్రధాన పాత్ర పోషించాల్సిన కానిస్టేబుళ్లలో 138 మందికి ఉన్నది 36 మంది. అంటే 193 కిలోమీటర్ల తీరం.. 145 తీరగ్రామాలు, నిర్దేశిత సముద్రప్రాంతం.. వీటన్నిటినీ 36 మంది కాపాడాలన్నమాట. ఒక్కో కానిస్టేబుల్‌ 5.36 కి.మీ. తీరం

Updated : 15 Aug 2022 06:40 IST

కడలి అంచున భద్రతపై కలవరం

సగానికిపైగా ఖాళీలతో నామమాత్రంగా మెరైన్‌ స్టేషన్లు

- న్యూస్‌టుడే, సోంపేట

బావనపాడు స్టేషన్‌ ఆవరణలో మూలపడిన బోట్లు

తీర రక్షణలో ప్రధాన పాత్ర పోషించాల్సిన కానిస్టేబుళ్లలో 138 మందికి ఉన్నది 36 మంది. అంటే 193 కిలోమీటర్ల తీరం.. 145 తీరగ్రామాలు, నిర్దేశిత సముద్రప్రాంతం.. వీటన్నిటినీ 36 మంది కాపాడాలన్నమాట. ఒక్కో కానిస్టేబుల్‌ 5.36 కి.మీ. తీరం పరిధిలో చీమచిటుక్కుమన్నా తెలుసుకోవాల్సిందే.. ఇది సాధ్యమా.

* సిబ్బందిలేరు... పరికరాలు లేవు.. బోట్లు లేవు... సముద్రం లోపల ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం లేదు.. తీరంలో హఠాత్తుగా జరిగే ప్రమాదాలు, పరిణామాలపై చర్యలు తీసుకునే పరిస్థితులు లేవు... తుపాన్లు ఇతర విపత్తుల సమయంలో తక్షణ సాయం అందించే పరిస్థితి లేదు... అందుకే తీరం రక్షణను దేవుడికి వదిలేసి (ముంబాయి దాడుల అనంతరం తీరం బయట, సముద్రం లోపల భద్రతాచర్యలు చేపట్టేందుకు వీలుగా ఏర్పాటు చేసిన) మెరైన్‌ పోలీస్‌స్టేషన్లు నామమాత్రమయ్యాయి.

పరికరాలు.. వసతులు అరకొరే.. .

* బారువ, బావనపాడు స్టేషన్లకు ఇప్పటి వరకు బోట్లు, ఇతర పరికరాలు సమకూర్చలేదు. * కళింగపట్నంలో మూడుబోట్లు సమకూర్చగా తిత్లీ తుపాన్‌లో అవి మరమ్మతులకు గురయ్యాయి. మూడేళ్లు దాటినా వాటిని బాగుచేయడంలేదు. * మూడుచోట్ల జెట్టీలు ఏర్పాటుచేసి బోట్లు, ఇతర పరికరాలు సమకూర్చాల్సి ఉండగా ఇప్పటి వరకు దానిపై కార్యాచరణ లేదు. * సముద్రంలో ఎవరైనా గల్లంతయినా, మత్స్యకారులు ప్రమాదాలకు గురైనా సిబ్బంది వెళ్లేందుకు బోట్లు లేక మత్స్యకారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. * సముద్రంలో జరిగే పరిణామాల గురించి తెలుసుకునే పరిస్థితి సైతం లేదు. ఇప్పటి వరకు వాచ్‌టవర్స్‌ కూడా ఏర్పాటు చేయలేదు. * స్టేషన్‌లో స్వీపర్లను నియమించకపోవడంతో కానిస్టేబుళ్లు ఆ పని చేసుకుంటున్నారు. తీరంలో ఏర్పాటు చేసిన స్టేషన్లకు ప్రహరీలు నిర్మించకపోవడంతో పాములు, విషపురుగులు, రాత్రిపూట జంతువులు ఆవరణలోకి ప్రవేశిస్తున్నాయి. * సిబ్బందికి సంబంధించిన వసతిగృహాలు నిర్మించకపోవడం, స్థానికంగా అద్దెకు ఇళ్లు దొరకకపోవడంతో ఇబ్బందులు నెలకొంటున్నాయి.

సిబ్బంది కొరత..

* బారువ స్టేషన్‌లో 52 మంది కానిస్టేబుళ్లకు కేవలం ఆరుగురే ఉన్నారు. ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లకు ముగ్గురున్నారు. ఈ సిబ్బందితో 36 గ్రామాల పరిధి తీరంలో రక్షణచర్యలు చేపట్టడం ఎలా సాధ్యం. * బావనపాడు స్టేషన్‌ పరిధిలో 63 గ్రామాల పరిధిలోని తీరం ఉంది. 42 మంది కానిస్టేబుళ్లకు కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. ఐదుగురు డ్రైవర్లకు ఒక్కరూ లేకపోగా హోంగార్డులు ఇతర ఖాళీలు భర్తీకి నోచుకోలేదు. *67 కి.మీ. 46 గ్రామాల పరిధి గల కళింగపట్నం స్టేషన్‌లో 28 కానిస్టేబుళ్లతో పాటు మూడు ఎ.ఎస్‌.ఐ.లు, ఇతరపోస్టులు ఖాళీగా ఉన్నాయి.

చేపట్టాల్సిన చర్యలు

* తీరప్రాంత రక్షణదళాలు మత్స్యకారులతో మమేకమై తీరంలో కొత్త వ్యక్తుల కదలికలు, సముద్రంలోపల జరిగే కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలి. * ఇతర దేశాలకు సంబంధించి సముద్రపరంగా చొరబాట్లు ఇతరప్రాంతాలకు సంబంధించి అక్రమచొరబాట్లు, అక్రమరవాణా అంశాలపై చర్యలు తీసుకోవాలి. * ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఓడలు, బోట్లు, మరపడవలు, స్టీమర్ల రాకపోకలు, తీరప్రాంత రక్షణచర్యలు, స్థానికంగా శాంతిభద్రతల విషయమై ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. * సముద్రస్నానాల సమయంలో ప్రమాదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. * సముద్రంలోపల నిఘాతో పాటు నిర్దేశించిన గ్రామాలలో జరుగుతున్న పరిణామాలు గమనించాలి. * మత్స్యకారులకు వేట, ఇతర అంశాల పరంగా సహకారం అందించడం, సముద్రంలో గల్లంతైనవారి జాడ తెలుసుకోవడం, తీరంలో శాంతిభద్రతల అంశాలపై చర్యలు తీసుకోవడం ముఖ్యంగా తుపాన్లు ఇతర విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు వీరు చూడాల్సి ఉంటుంది. * ఆయా స్టేషన్లకు అవసరమైన సిబ్బందిని నియమించి, పరికరాలు సమకూర్చి, వసతులు కల్పిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి.

మరమ్మతులకు ప్రతిపాదనలు

తిత్లీ తుపాన్‌లో నాశనమైన బోట్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాం. జెట్టీ లేకపోవడంతో బావనపాడులో వాటిని ఉంచాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ విధుల నిర్వహణ విషయంలో రాజీ పడడంలేదు. మత్స్యకారుల సహకారంతో తీరప్రాంతం, సముద్రంలోపల కార్యకలాపాల గురించి నిరంతరం అప్రమత్తతతో ఉన్నాం. - జి.దేవుళ్లు, సీఐ, కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసుస్టేషన్‌, కళింగపట్నం

జిల్లాలో ఇదీ పరిస్థితి

తీరప్రాంత విస్తీర్ణం: 193 కి.మీ తీరప్రాంత గ్రామాలు: 145 తీరప్రాంతానికి అనుసంధానంగా ఉన్న గ్రామాలు: 150 మెరైన్‌ పోలీసుస్టేషన్లు: మూడు (బారువ, బావనపాడు, కళింగపట్నం) ఉండాల్సిన సిబ్బంది మొత్తం: 249 మంది ఖాళీలు: 148

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని